ముహూర్తం కుదిరింది..పెళ్లిబాజా మోగింది | Happy Hours marriage | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది..పెళ్లిబాజా మోగింది

Published Mon, Dec 8 2014 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

Happy Hours marriage

 మార్గశిర మాసం.. మంచి ముహూర్తాలు తెచ్చింది. జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. బంధుమిత్రుల రాకతో కోలాహలం పెరిగింది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ మాల్స్ సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి.. భూలోకాన్ని పీఠగా వేసి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. మూఢాల కారణంగా ఈ ఏడాది భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో వివాహాలు జరగలేదు. మార్గశిర మాసం తర్వాత మళ్లీ మూఢం ఉండడం.. ఈ మాసంలో కూడా వివాహ వేడుకలకు ముహూర్తాలు తక్కువగా ఉండడంతో ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి.
 
 - నల్లగొండ కల్చరల్
 ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. మూడు ముళ్లు, ఏడడుగులతో ఏకమయ్యే అపూర్వమైన సుదినం. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. వివాహానికి సుముహూర్తమే కొండంత బలం. దివ్యమైన ముహూర్తం లేకపోతే వివాహం జరిగే అవకాశాలు తక్కువే. భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు జరగలేదు. ఈ తరుణలంలో మార్గశిర మాసం పెళ్లిముహూర్తాలను మోసుకొచ్చింది. ఈ నెల 8, 12, 13, 17, 18 తేదీల్లో  శుభ ముహూర్తాలున్నాయి. వీటిల్లో 13, 18 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత బలమైన ముహూర్తాలని పురోహితు లు చెబుతున్నారు. ఈ నెల 18 దాటితే వచ్చే జనవరి 22వ తేదీ వరకు ఆగాల్సిందేనన్నారు.
 
 అడ్వాన్స్ బుకింగ్.. అదరగొడుతున్న రేట్లు
 సంప్రదాయ పెళ్లిళ్లకు పురోహితుడు తప్పనిసరి. ఒక్కసారిగా ము హూర్తాలు వచ్చి పడడం తో పురోహితులకు గిరాకీ పెరిగింది. పెళ్లి తంతును బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. సన్నాయి..బ్యాండ్ మేళం లేనిదే పెళ్లికి పూర్తి కళ సంతరించుకోదు. ముహూర్తాలు లేని రోజుల్లో పూటగడవడమే కష్టం కావడంతో వారు కూడా ఒక్కో పెళ్లికి రూ.8వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న ఫంక్షన్‌హాళ్లు నెల రోజుల మందుగానే బుక్కయ్యాయి.
 
 సీజన్‌లోనే పని
 మాకు సీజన్‌లోనే పని.. మిగతా రోజులన్నీ ఖాళీ. కానీ పెళ్ళీళ్ల సీజన్ వచ్చిం దంటే చాలు... పూలు అమ్మెటోళ్లంతా కూడబలుక్కొని రేట్లను ఒక్కసారిగా డబుల్ చేస్తారు. దీంతో ఎన్ని ఫంక్షన్లకు పనిచేసినా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది.
 - గణేష్, డెకరేషన్
 డిజైనర్
 
 ముహూర్తాలు ఒకేసారి రావటంతో ఇబ్బంది
 చాలా రోజుల తరువాత శుభ ఘడియలు వచ్చాయి. అవి కూడా ఏడు రోజులే ఉన్నాయి. పురోహితులు తక్కువ, వివాహాలు ఎక్కువ..  దీంతో ఒక రోజు లో రెండు, మూడు పెళ్లీలు జరిపించాల్సి రావడం కొంత ఇబ్బందిగా ఉంది.
 - పురోహితుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement