- టీఆర్‌ఎస్ అధినాయకత్వం నిర్ణయం
- శ్రీహరి ఎంపీగా రాజీనామా చేసే అవకాశం
- వెంకటేశ్వర్లుకు మరో చాన్‌స
- నేడు నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో శ్రీహరికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. కడియం గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూన్ 1న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు స్థానాలకు ఇంత కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే పోలింగ్ జరుగుతుంది. సమాన సంఖ్యలో నామినేషన్ దాఖలైతే పోలింగ్ లేకుండానే ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. ఏడాది క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.
అనూహ్య పరిస్థితులతో ఈ ఏడాది జనవరి 25న ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా లోక్‌సభ సభ్యుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం గతంలో ఎప్పుడు జరగలేదు. వరంగల్ ఎంపీగా ఉన్న శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో ఆరు నెలల(జూలై 24)లోపు ఆయన రాష్ట్ర చట్టసభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో టీఆర్‌ఎస్ అధిష్టానం కడియంకు అవకాశం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనుండడంతో జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనుండడంతో శ్రీహరి వరంగల్ లోక్‌సభ సభ్యత్వానికి గురువారమే రాజీనామా చేసే అవకాశం ఉంది. లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే జూన్ 1న రాజీనామా చేయనున్నారు.
‘బోడకుంటి’కి మరో చాన్స్
జిల్లా నుంచి కడియంతోపాటు బోడకుంటి వెంకటేశ్వర్లుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన ‘బోడకుంటి’ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం దక్కింది. కాగా, గురువారం కడియంతోపాటు వెంకటేశ్వర్లు కూడా నామినేషన్ వేయనున్నారు.
కడియం, బోడకుంటికి ఎమ్మెల్సీ గిరి
Published Thu, May 21 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement