సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని ముందుగానే అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్.. ఇతర పార్టీల కంటే ముందే క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలనూ రంగంలోకి దింపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా నియమించాలని.. గ్రామాలను కీలక నేతలకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇన్‌చార్జులుగా నియమితులయ్యే వారు.. తమకు అప్పగించిన చోటే ఉండి ప్రచారాన్ని, పనులను పర్యవేక్షించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎవరెవరికి ఏయే మండలం, గ్రామం బాధ్యతలు అప్పగించేదీ త్వరలో ఖరారు చేయనున్నారు. తర్వాత వారం పది రోజుల్లో సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయా మండలాలు, గ్రామాలకు వెళ్లి పార్టీ కేడర్‌తో మమేకమై పనిచేయనున్నారు.
సభ నాటి నుంచే..
ఈనెల 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభతోనే పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి వేల వాహనాలతో మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సభ బాధ్యతలు అప్పగించారు. తర్వాత మునుగోడులో టీఆర్‌ఎస్ కార్యకలాపాల్లో కొంత స్తబ్ధత నెలకొన్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో పర్యటిస్తూ ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, క్రియాశీల నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్నవారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
చదవండి: Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్
అసంతృప్త నేతలు దారికి..
మునుగోడులో టీఆర్‌ఎస్ అసంతృప్త కార్యకర్తలు, స్థానిక నేతలు మెల్లగా పార్టీలైన్‌లోకి వస్తున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి బీజేపీలో చేరగా.. ఇతర మండలాల నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని ప్రకటించారు. 20న జరిగిన కేసీఆర్ సభ జన సమీకరణలోనూ వారు క్రియాశీలకంగా పనిచేశారు.
మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు ఆ పార్టీవర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దసరాలోగా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్థానిక నేతలకు పార్టీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టు తెలిసింది. షెడ్యూల్ విడుదల కాగానే చండూరులో టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అందరికీ బాధ్యతలు
పార్టీపరంగా మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్.. పెద్ద సంఖ్యలో మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా మండలాలు, గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగినవారిని ఇన్‌చార్జులుగా నియమించనున్నారు.
చదవండి: Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
Comments
Please login to add a commentAdd a comment