
హరికృష్ణ పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్
చౌటుప్పల్ (మునుగోడు) : నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీ నటుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పార్థివదేహాన్ని రోడ్డుమార్గం ద్వారా చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ వెంట భారీ వాహన శ్రేణి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రముఖులు అంబులెన్స్ వెంటే ఉన్నారు. స్థానిక తంగడపల్లి రోడ్డు, బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానులు అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించారు.
శాంతి భద్రతల సమస్యల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా హరికృష్ణ అమరహై, హరికృష్ణకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. తంగడపల్లి క్రాస్‌రోడ్డు వద్ద అడ్డంగా వాహనాలు రావడంతో అంబులెన్స్, చంద్రబాబు కాన్వాయ్ కొద్దిసేపు ఆగిపోయింది. పోలీసులు అడ్డంగా వచ్చిన వాహనాలను పంపించడంతో కాన్వాయ్ వెళ్లిపోయింది.
హుటాహుటిన తరలిన మంత్రి జగదీశ్‌రెడ్డి
ఏపీ సీఎంను ఆస్పత్రికి తీసుకెళ్లిన మంత్రి
నల్లగొండ ప్రతినిధి : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాద సంఘటన తెలియడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెరెడ్డి హుటాహుటిన బెటాలియన్ వద్దకు చేరుకున్నాడు. హెలికాప్టర్ ద్వారా అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మంత్రి జగదీశ్‌రెడ్డి రిసీవ్ చేసుకుని కార్లో కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దుర్ఘటన తీరును, వైద్య సేవలను మంత్రి సీఎంకు కార్లో వివరించారు. అంతకుముందు మంత్రి హరికృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు.
హరికృష్ణ కుటుంబ సభ్యులను కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నటుడు బాలకృష్ణను మంత్రి ఓదార్చారు. మంత్రి కామినేనిలో ఉన్న సమయంలోనే హరికృష్ణ పార్థివదేహం వెంట హైదరాబాద్‌కు తరలిరావాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించడంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హరికృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు తలపెట్టిన విషయాన్ని ఏపీ సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ హరికృష్ణ ఇంటికి చేరుకోగా.. సంఘటన వివరాలను ఆయనకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment