
'సస్పెండ్ చేసైనా సరే సభ జరిపి తీరుతాం'
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని జరిపి తీరుతామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపినా.. కొంతమంది పదే పదే అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే సభలో గందరగోళం సృష్టించేవారిని సస్పెండ్ చేసైనా సభ జరిపి తీరుతామని హరీశ్ అన్నారు. టీటీడీపీ నేతలు తెలంగాణ గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ చంద్రబాబు పాటపాడుతున్నారని విమర్శించారు. కావేరి జలాల కోసం తమిళనాడు అంతా ఏకమైన సంగతి టీటీడీపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలని హరీశ్ పేర్కొన్నారు.
రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం గురవింద చందమేనన్నారు. గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించినప్పుడు జానారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు.