
మొక్కలు పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి శుక్రవారం హరితహారం నిర్వహించాలనే లక్ష్యంతో తొలి శుక్రవారం జరిగిన హరితహారంలో మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటడంతోపాటు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో వెరసి 6 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. మేయర్ రామ్మోహన్ మియాపూర్‌లోని ప్రశాంతనగర్‌లో హరితహారంలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఫీవర్ ఆసుపత్రిలో, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట్ విద్యుత్ దహనవాటిక ఖాలీ స్థలంలో మొక్కలు నాటారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్ తో కలిసి మొక్కలు నాటారు. ఎల్బీనగర్ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం స్థానిక కార్పొరేటర్లతో కలిసి బండ్లగూడ జి.ఎస్.ఐ లో మొక్కలు నాటారు.
ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ లోని సాయి కాలనీ, టి.బి కాలనీలలోఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మొక్కలను నాటడంతో పాటు స్థానికులకు ఉచితంగా పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుద్వేల్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి వెంకటేశ్వరకాలనీ, జె.వి.ఆర్ పార్కులో మొక్కలు నాటడంతో పాటు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రముఖ చలన చిత్ర నటుడు నరేష్ జూబ్లిహిల్స్ లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ , డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తదితర ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ఉచితంగా పంపిణీ చేశారు.జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ గురునాథం చెరువుకట్టపై నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. జోనల్, అడిషనల్ కమిషన్లు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment