హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హరితహారానికి ప్రాధాన్యత ఇచ్చామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఈ హరితహారం కార్యక్రమం జూలై మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు... అడవుల పెంపకానికి బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించామన్నారు.
రాష్ట్రంలోని అడవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే అడవుల కోసం రూ. 155 కోట్లు విడుదల చేశామన్నారు. 35 రకాల మొక్కలు హరితహారంలో భాగంగా పెంచుతున్నట్లు చెప్పారు. అలాగే 120 కోట్ల మొక్కలు హరితహారం కింద నాటుతామని జోగు రామన్న పేర్కొన్నారు.