రాజన్న గర్భగుడి ప్రవేశాలు నిలిపివేత
వేములవాడ : వేములవాడ రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు పూర్తి చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు గర్భగుడి ప్రవేశాలను నిలిపివేశారు. సోమవారం సైతం గర్భగుడి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం రూ.32 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు మహారుద్రాభిషేకాన్ని వైభవంగా జరిపించారు. తొలుత పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వీయ పర్యవేక్షణలు ఇక్కడి అనువంశిక అర్చకస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణలతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో గౌరీనాథ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
గోవులకు ఎండు గడ్డి దానం
రాజరాజేశ్వరస్వామి గోశాలలో ఉన్న కోడెలకు వరి గడ్డిని ఓ రైతు ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. ఇల్లంతకుంట మండలం రైకనపేట గ్రామానికి చెందిన కె.అంజయ్య అనే రైతు 8 క్వింటాళ్ల ఎండు గడ్డిని తన సొంత ఖర్చుతో తిప్పాపురంలో ఉన్న గోశాలకు ట్రాక్టర్‌లో తెచ్చి అధికారులకు అప్పగించారు. ఆలయ అధికారులు వెంకటేశ్వరశర్మ, శంకర్‌లు రైతును అభినందించారు.