
సాక్షి, హైదరాబాద్: వరుసగా కురుస్తోన్న కుండపోత వర్షాలతో రాష్ట్ర రాజధాని నగరం మళ్లీ అస్తవ్యస్తమైంది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో జనజీవనం స్తంభించింది. రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా శ్రీనగర్‌కాలనీలో 6.4 సెం.మీ., అమీర్‌పేటలో 5.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం పూర్తిగా నీటమునిగింది. దీంతో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలోకి వరదనీరు చేరడంతో ఇప్పటికే మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్‌లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులు నిరాశ చెందుతున్నారు.
నగరవాసికి ట్రాఫిక్ కష్టాలు..
ఇక ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఉప్పల్, బేగంపేట్, బోయిన్‌పల్లి, పార్శీగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా గంటల సమయం పట్టడంతో నగరవాసులకు నరకం కనిపించింది. పలు రహదారులు చెరువులను తలపించాయి. మహానగరం పరిధిలో 1,500 కి.మీ మేర విస్తరించిన నాలాలు, 119 చెరువులు ఉప్పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 60 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. నగరానికి ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోనూ ఐదు అడుగుల మేర నీటిమట్టాలు పెరిగినట్లు జలమండలి అధికారులు తెలిపారు. మరోవైపు జగిత్యాలలోనూ భారీ వర్షం కురిసింది.
నాలాలో మృతదేహం
అమీర్‌పేట మైత్రివనం నాలాలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద రాత్రి వరదనీటిలో మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment