ఈదురుగాలుల బీభత్సం
సాక్షి, యాదాద్రి, జగిత్యాల: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల కోళ్ల ఫారాలు నేలమట్టం కావడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. విద్యుత్ తీగలు తెగిపోవడంతో పునరుద్ధరణకు రెండు రోజులు పడుతుంది. పలుచోట్ల భారీ చెట్లు కూలడంతో ఇళ్లు ధ్వంస మయ్యాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు 8 మంది మృతి చెందారు.
ఉమ్మడి నల్లగొండలో...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండ లాల్లో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు మేళ్లచెరువులో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కూలింది. అనంతగిరి గోల్‌తండాలో పిడుగు పాటుకు భూక్యా నరేశ్ (24), రాజాపేట కుర్రారంలో కత్తుల శోభ(37), ఆలేరులో బోందయ్య(65) పిడుగుపాటుకు మృతి చెం దారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయా యి. నల్లగొండ మండలం నర్సింగ్‌బట్లలో ఈదురుగాలులకు పశువుల కొట్టం కూలి చంద్రకళ అనే మహిళ మృత్యువాత పడింది. చండూరులోని తేరట్‌పల్లి గ్రామంలో కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
జగిత్యాల జలమయం
జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. సాయం త్రం 6 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిప డ్డాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలు ముకుంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి.
రాయికల్ మండలం అల్లీపూర్‌లో గొర్లకాపరి పతంగి వెంకన్న(36), ఖమ్మంజిల్లా కామేపల్లి పొన్నెకల్లులో మాధవరావు(55), వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లికి చెందిన సురుగురి రాజకొంరయ్య(55) పిడుగుపా టుకు మరణించారు. నిర్మల్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ధాన్యం తడిసిపో యింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు వెల్దుర్తి పరిధిలోని శేరివాడకు చెందిన ఆంజనేయులు(18), సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం స్వాపూర్‌కి చెందిన లక్ష్మారెడ్డి(65) పిడుగు పాటుకు మృతి చెందారు.