
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మేఘాలు భారీగా విస్తరించి ఉన్నాయని, మరో మూడు గంటల పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
హబ్సీగూడ, తార్నాక, నాచారం, పెద అంబర్ పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది. వానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, నెరెడ్ మెట్ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వాన కురుస్తుంది.
ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం!
భారీ వర్షాలతో ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నల్లచెరువు కట్టపై 13 చెట్లు నేలకూలాయి. చెరువు పొంగి రోడ్లపైకి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. నల్లచెరువు పొంగిపొర్లుతుండటంతో చెంగిచర్ల వైపు రహదారి పూర్తిగా మునిగిపోయింది. దీంతో అటు నుంచి వచ్చే భారీ వాహనాలు, ట్రక్కులు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లడం సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు.