
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్ సైతం ట్రాఫిక్‌లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనం సైతం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది.
మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మీర్‌పేట్, వనస్థలిపురం, ఎల్బీనగరలో భారీ వర్షం కురుస్తోంది.
కాగా వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
మెట్రో సర్వీసులకు అంతరాయం
భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ రూట్‌లో మెట్రో సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాక్‌పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment