ఉప్పొంగి పారుతున్న భీమేశ్వర వాగు
తాడ్వాయి(నిజామాబాద్) : తాడ్వాయి మండలంలో గురువారం భారీ వర్షం కురవడంతో మండలంలోని సంతాయిపేట్ శివారులోని భీమేశ్వర వాగు ఉప్పొగింది. ప్రతిరోజు మాదిరి గానే గ్రామానికి చెందిన 18 మహిళ కూలీలు, ఆరుగురు వ్యవసాయ కూలీలు గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటి వెళ్లారు. కానీ సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా వాగు పెద్ద ఎత్తున పొంగుతూ పారింది. భయపడి కూలీలు వాగు అవతల నిలిచిపోయారు. ఎనిమిది గంటల పాటు వాగు అవతల ఉన్న భీమేశ్వరాలయంలో తల దాచుకున్నారు. మహిళలు అధికంగా ఉండటంతో ఆందోళన చెందారు. ఎప్పుడు నీళ్లు తగ్గుతాయో.. ఎప్పుడు తెల్లవారుతుందా.. అని నిరీక్షించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు, గ్రామ పెద్దలు, యువకులు భీమేశ్వరా వాగు వద్దకు వెళ్లారు. యువకులు ముందుకు వచ్చి వాగులో దిగి కర్రల సహాయంతో అక్కడి ఒడ్డుకు వెళ్లి తాడు కట్టారు. ఆ తాడు సహాయంతో కూలీలను ఒక్కొక్కరిని వాగు దాటించారు. దీంతో 24 మంది కూలీలు క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు. శుక్రవారం వాగులో నీరు పారడం తగ్గుముఖం పట్టింది. వాగు అవతల గ్రామానికి చెందిన 100 మంది రైతులకు సంబధించిన 200ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే ప్రసిద్ధి గాంచిన భీమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాడు సహాయంతో వాగు దాటుతున్న కూలీలు
భయం భయంగా..
ఎప్పుడు తెల్లారుతుందోనని భయంభయంతో ఎదురుచూశాం. మా కుటుంబ సభ్యుల వద్దకు ఎప్పుడు చేరుతామోనని ఆందోళన చెందాము.
– గొల్ల సాయవ్వ, కూలీ
ఎనిమిది గంటల పాటు..
భయంతో శివున్ని ప్రార్థించుకుంటూ ఉన్నాను. 8 గంటల పాటు నిద్ర లేకుండా ఉండి పోయా. రాత్రి కావడంతో చాలా భయం వేసింది. వాగు దాటి కూలీ చేయాలంటే భయమైతుంది.
– మ్యాదరి బాలమణి, కూలీ
Comments
Please login to add a commentAdd a comment