
మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు ముప్పు ఉండదని ఎస్పీ బి.అనురాధ అన్నారు. హెల్మెట్ ధరించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే 80శాతం ప్రమాదాలకు కారణమని ఆమె పేర్కొన్నారు. పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఎస్పీ కార్యాలయంలో ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే ప్రమాద కారణాలను విశ్లేషించుకుని జాగ్రత్త పడితే ఎన్నో కుటుంబాలను కాపాడొచ్చని తెలిపారు. పోలీసులందరూ తప్పక హెల్మెట్ ధరించాలని.. తద్వారా ఇతర వాహనదారులు స్ఫూర్తి పొందుతారని చెప్పారు.
కాగా, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి పోలీస్ శాఖ తరఫున నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. అయితే, అవగాహన కార్యక్రమాల ద్వారా ఆశించిన మార్పు రావడం లేదని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలపై బయటకు వెళ్లే వారు హెల్మెట్ ధరించేలా భార్యాపిల్లలు, కుటుంబీకులు గుర్తు చేయాలని కోరారు. కాగా, ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, క్లాక్‌టవర్, అశోక్ టాకీస్, వన్‌టౌన్ వరకు సాగింది. డీఎస్పీ భాస్కర్, సీఐలు సీతయ్య, అమరేందర్‌నాథ్‌రెడ్డి, వీరేష్, దిలీప్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment