కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నృత్యకారిణులు తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నామని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్ అన్నారు. ఆయన గురువారం సమాధులను సందర్శించారు. ఈ సందర్భంగా యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్‌సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. భారతదేశవ్యాప్తంగా అత్యున్నత మానవ నిర్మిత కట్టడాలను పరిరక్షించేందుకు అమెరికా ఇతోధికంగా ఆర్థికసాయం అందజేయడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని తారామతి, ప్రేమామతి సమాధుల వద్ద దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించేందుకు, వాటికి పూర్వపు రూపు తీసుకొచ్చేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. సమాధులపై ఉన్న సిమెంట్‌పూతను తొలగించి ప్లాస్టర్‌తో తిరిగి పునర్నిర్మిస్తామని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రాశిష్ నందా తెలిపారు. దేశవ్యాప్తంగా 2001 నుంచి అంబాసిడర్ల ఫండ్ నుంచి వెయ్యి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. కుతుబ్‌షాహీ సమాధులు, మౌలాలీలోని మహ్‌లేకా భాయ్ సమాధుల పరిరక్షణకు కూడా ఆర్థికసాయం అందజేశామన్నారు. కార్యక్రమంలో వారి వెంట నగరంలో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం పాల్గొన్నారు.
ఫొటో ఎగ్జిబిషన్
నగరంలో అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కెన్నెత్ ఐ జస్టర్ బుధవారం సందర్శించారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్, నగరంలో అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా తదితరులు పాల్గొన్నారు. ఫొటో ప్రదర్శన ద్వారా కాన్సులర్ జనరల్స్ పనితీరుతోపాటు రెండు దేశాల సమస్యలపై అవగాహన, పరిష్కారానికి దోహదం చేస్తాయన్నారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్లు్య.బుష్ పర్యటన, 2017లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ విశేషాలతో కూడిన ఫొటోలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. రెండు వారాలపాటు ఈ ప్రదర్శన జరగనుంది. అనంతరం ఏపీ, తెలంగాణ, ఒడిషా ప్రాంతాల్లో ఈ ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment