Qutub Shahi
-
ఆ సమాధుల పరిరక్షణకు సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నృత్యకారిణులు తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నామని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్ అన్నారు. ఆయన గురువారం సమాధులను సందర్శించారు. ఈ సందర్భంగా యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్‌సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. భారతదేశవ్యాప్తంగా అత్యున్నత మానవ నిర్మిత కట్టడాలను పరిరక్షించేందుకు అమెరికా ఇతోధికంగా ఆర్థికసాయం అందజేయడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని తారామతి, ప్రేమామతి సమాధుల వద్ద దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించేందుకు, వాటికి పూర్వపు రూపు తీసుకొచ్చేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. సమాధులపై ఉన్న సిమెంట్పూతను తొలగించి ప్లాస్టర్‌తో తిరిగి పునర్నిర్మిస్తామని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రాశిష్ నందా తెలిపారు. దేశవ్యాప్తంగా 2001 నుంచి అంబాసిడర్ల ఫండ్ నుంచి వెయ్యి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందజేసినట్లు తెలిపారు. కుతుబ్‌షాహీ సమాధులు, మౌలాలీలోని మహ్లేకా భాయ్ సమాధుల పరిరక్షణకు కూడా ఆర్థికసాయం అందజేశామన్నారు. కార్యక్రమంలో వారి వెంట నగరంలో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం పాల్గొన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ నగరంలో అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కెన్నెత్ ఐ జస్టర్ బుధవారం సందర్శించారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్, నగరంలో అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా తదితరులు పాల్గొన్నారు. ఫొటో ప్రదర్శన ద్వారా కాన్సులర్ జనరల్స్ పనితీరుతోపాటు రెండు దేశాల సమస్యలపై అవగాహన, పరిష్కారానికి దోహదం చేస్తాయన్నారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్లు్య.బుష్ పర్యటన, 2017లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ విశేషాలతో కూడిన ఫొటోలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. రెండు వారాలపాటు ఈ ప్రదర్శన జరగనుంది. అనంతరం ఏపీ, తెలంగాణ, ఒడిషా ప్రాంతాల్లో ఈ ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
జనగామలో కుతుబ్‌షాహీల శాసనం
సాక్షి, హైదరాబాద్: తెలుగు నేలను పాలించిన మహ్మదీయ రాజుల్లో ప్రముఖులైన కుతుబ్‌షాహీల కాలానికి చెందిన అరుదైన శాసనం వెలుగు చూసింది. రెండువందల ఏళ్లు కుతుబ్‌షాహీలు గోల్కొండ కేంద్రంగా పాలన సాగించగా వీరి శాసనాలు ఇప్పటివరకు వందలోపు లభ్యమయ్యాయి. ఇందులో ఒకటి నాగర్‌కర్నూల్ జిల్లాలో బయటపడగా, మరొకటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో చరిత్రకారులు కనుగొన్నారు. వల్మిడి గ్రామ చెరువుకట్ట సమీపంలో ఈ శాసనాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్, అరవింద్ ఆర్యా, చంటి, ముడావత్ రవీందర్, కమలాకర్ నాయక్‌లు కనుగొన్నారు. ఈ శాసనం శాలివాహన శకం సం.1489, ప్రభవ నామ సం.శ్రావణ శుద్ధ 12(ద్వాదశి) శుక్రవారం అంటే క్రీ.శ.1567 జూలై 18న వేశారు. ఈ శాసనం ఇబ్రహీం కుతుబ్‌షా, కులీకుతుబ్‌షా తండ్రి పాలనాకాలంనాటిది. ఇది తెలుగులో ఉంది. తొలుత రామకథను కీర్తించే ఒక సంస్కృత శ్లోకంతో మొదలైంది. ‘ఈ లోకంలో సూర్యచంద్రులు, భూమి, రామకథ ఉన్నంతదాకా రాజ్యం ఉంటుంది విభీషణా’అని అర్థమిచ్చే ఈ శ్లోకం కుతుబ్‌షాహీ రాజ్యానికి అన్వయిస్తూ శాసన రచయిత రాసినట్లుంది. అస్పష్టమైన పేరు (మీరా తాజనమియ్య)గల పాలకుడు తవ్వించిన ‘వలిమిడి ’చెరువు కింద ఒకటో పొలచంరాజు మర్తురు భూమిని పంట పండించుకుని ఫలం ఆచంద్రార్కంగా అనుభవించమని (ఎవరికి అన్నది శాసనంలో పేర్కొనలేదు) ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ శాసనాన్ని బట్టి ఆ కాలంలో జనగామ ప్రాంతాన్ని ఒకటో పొలచంరాజు పాలించాడనే విషయాన్ని బలపరిచేలా ఇక్కడికి సమీపంలో పాలంరాయుని పేట అనే పాటిగడ్డ (పాతవూరిగడ్డ) ఉంది. అక్కడ రాజభవనం నిర్మాణ శిథిలాలు అగుపిస్తున్నాయి. అక్కడ పూర్వం రాజెవరో ఉండేవారని ప్రజలు చెప్పుకుంటారు. ఆ రాజే పాలంరాయుడు కావచ్చు. వల్మిడి శాసనం విశేషాలు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం శాసన స్థానం: తాళ్ల చెరువు కట్ట కింద లిపి: తెలుగు , భాష: తెలుగు శాసనోద్దేశం: చెరువు కట్టడం, భూదానం శాసన సమయం: శక సంవత్సరం 1489, ప్రభవ నామ సం.శ్రావణ శు.12, 1567 జూలై 18 శుక్రవారం శాసన రాజవంశం: కుతుబ్‌షాహీలు శాసనకాలపు రాజు: ఇబ్రహీం కుతుబ్‌షా శాసనం వేయించింది: పొలచం రాజు -
హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్!
నగరం చుట్టూరా మహాకుడ్యం శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కుతుబ్‌షాహీలు 25 అడుగుల ఎత్తు.. 10 కిలోమీటర్ల పొడవున భారీ గోడ 12 దర్వాజాలు 12 కిటికీలు - నిజాం రాజుల కాలంనాటికి పూర్తయిన ప్రహరీ - సూర్యోదయమైతేనే నగర ప్రవేశం - సూర్యాస్తమయానికి మార్గాలన్నీ బంద్ - వందల ఏళ్లపాటు రాజసం పంచిన కుడ్యం - మూసీ వరద, కూల్చివేతలతో చాలా వరకు ధ్వంసం - ప్రస్తుతం మిగిలింది పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే నాలుగు వందల ఏళ్ల క్రితమే సకల సదుపాయాలతో తులతూగిన భాగ్యనగరికి ఎన్నో చారిత్రక ప్రత్యేకతలు ఉన్నాయి. మూసీ (ముచ్కుందా నది) ఒడ్డున 426 ఏళ్ల కింద పద్నాలుగు వేల భవనాలతో మహానగరాన్ని నిర్మించారు. ఆ సమయంలో నగరాన్ని నిర్మించిన కులీకుతుబ్‌షా ప్రార్థన చేస్తూ.. ‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. సకల జాతుల జనంతో చెరువులో చేపల్లా నిండిపోవాలి. ప్రపంచంలో కెల్లా మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి..’’అని వేడుకున్నారట. పుట్టుకతో నగరమైన హైదరాబాద్.. అనతికాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందింది. అలాంటి సమయంలో శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం నగరం చుట్టూ భారీ గోడను నిర్మించారు. దానిలో 12 దర్వాజాలు (మార్గాలు), 12 కిటికీలు (చిన్నపాటి తలుపులు) ఏర్పాటు చేశారు. చార్మినార్ కేంద్రంగా నగరం చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ గోడ ప్రత్యేకతలపై ఈ వారం ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాడు పన్నెండు తలుపులు.. చుట్టూరా కిటికీలు హైదరాబాద్ మహానగరం ఎన్నో అనుకూలతలకు నిలయం. సముద్ర మట్టానికి సుమారు 600 అడుగుల ఎత్తులో ఉండడంతో నెలకొన్న సమశీతోష్ణస్థితి ప్రత్యేకం. ఈ మహా నగరి.. మంత్ర నగరిని తలపించిందంటూ కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు మెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. మహా నగరానికి, ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు చార్మినార్ చుట్టూరా సుమారు పది కిలోమీటర్ల (ఆరు మైళ్ల)పొడవుతో 25 అడుగుల ఎత్తుతో గోడను నిర్మించారు. 1684లో కుతుబ్‌షాహీల హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఈ గోడ.. 1765లో అసఫ్ జాహీ నిజాం అలీఖాన్ ఆధ్వర్యంలో పూర్తయింది. నగరంలోకి వచ్చి, వెళ్లేందుకు ఈ గోడలో 12 చోట్ల ద్వారాలు ఏర్పాటు చేశారు. పురానాపూల్ దర్వాజా, పేట్లబురుజు (చంపా దర్వాజా), మోతిగల్లీ (దిల్లీ దర్వాజా), చాదర్‌ఘాట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, కట్టామీర్జుమ్లా (తలాబ్‌కట్ట), గౌలిపురా, లాల్‌దర్వాజా, ఆలియాబాద్, ఫతే దర్వాజా (శాలిబండ సమీపంలో), దూద్‌బౌలి దర్వాజాలతో పాటు మరో పన్నెండు కిటికీలు నిర్మించారు. ఆ సమయంలోనే.. హైదరాబాద్ మహానగరం లోపలికి వెళ్లాలన్నా.. బయటికి వెళ్లాలన్నా సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్యే జరగాలి. ఈ రెండు పూటలా గేట్లు తెరుచుకునే/మూసేసే సమయంలో అందరినీ అప్రమత్తం చేసేందుకు భారీ నగరాలు మోగించేవారు. ఇందుకు ప్రత్యేక యంత్రాంగం పనిచేసేది. ఇక పన్నెండు దర్వాజాల్లో అత్యధికం 1908 సెప్టెంబర్ వరదల్లో ధ్వంసమవగా.. మరికొన్నింటిని రాకపోకలకు అడ్డంకిగా మారాయంటూ 1954లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు తొలగించింది. ప్రస్తుతం పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే మిగిలాయి. అయితే నగర చరిత్ర ఇప్పటికే ధ్వంసమైందని... ఏ దర్వాజా, కిటికీ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం చుట్టారా ధ్వంసమైన చరిత్రను ముందుతరాలకు అందించేందుకు ప్రత్యేక కృషి మొదలుపెట్టామని తెలిపారు. దర్వాజాల మధ్య 12 కిటికీలు నగరం చుట్టూ దర్వాజాల మధ్య 12 కిటికీలను నిర్మించారు. అయితే ఇవి మామూలు కిటికీలు కావు.. పెద్ద ద్వారాల్లా కాకుండా చిన్న తలుపుల మాదిరిగా ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో శ్మశానాలన్నీ నగరం బయట ఉండేవి. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు జరపడానికి దర్వాజా ద్వారా తీసుకెళ్లడాన్ని అపశకునంగా భావించేవారు. ఇక రాజ కుటుంబం, ఉన్నతాధికారులు వెళ్లే దర్వాజాల ద్వారా అంత్యక్రియల ఊరేగింపులకు అనుమతి ఉండేదికాదు. దాంతో కిటికీలను ఏర్పాటు చేసి.. వాటిని దీనికి వినియోగించారు. అందువల్లే కిటికీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ çశ్మశానాలు ఉన్నాయి. ఇక అత్యవసర సమయాల్లోనూ రాకపోకలకు కిటికీలను ఉపయోగించుకునేవారు. ఎక్కడెక్కడ ఉన్నాయి..? చంపా దర్వాజా–ఢిల్లీ దర్వాజా మధ్యలో చార్మహల్ కిటికీ; ఢిల్లీ దర్వాజా–చాదర్‌ఘాట్ మధ్య హత్తి కిటికీ; చాదర్‌ఘాట్–డబీర్‌పురా మధ్య బొదే అలీషా కిటికీ; డబీర్‌పుర–యాకుత్‌పురా దర్వాజాల మధ్య మాతా కిటికీ; యాకుత్‌పుర–కట్టమీర్‌జుమ్లా మధ్య రంగేలీషా కిటికీ; కట్టమీర్‌జుమ్లా–గౌలిపుర మధ్య కమాన్దాన్ కిటిæకీ; ఆలియాబాద్–ఫతే దర్వాజా మధ్య గాజిబండ కిటికీ, ఫతే దర్వాజా–పురానాపూల్ మధ్య బొహోరోకి కిటికీలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు గొల్ల కిటిæకీ, మంగళ కిటికీ, కిటికీ బవహీర్, కిటిæకీ కార్వాన్లను నిర్మించారు. నేడు ఏదారి.. ఎవరిది? హైదరాబాద్ నగరం చుట్టూ ఏర్పాటు చేసిన దర్వాజాలకు ప్రత్యేకత ఉండేది. సాధారణ ప్రజలు, అధికారులు, సైనికులు ఇలా ఎవరెవరు ఏయే దర్వాజాల నుంచి ఎవరు రాకపోకలు సాగించాలన్న నిబంధనలు ఉండేవి. 1. పురానాపూల్ దర్వాజా నగరానికి ప్రధాన ద్వారంగా పరిగణించే పురానాపూల్ దర్వాజా నుంచి సాధారణ జనానికి అనుమతి ఉండేది. మూసీపై నిర్మించిన పురానాపూల్ వంతెన ద్వారా వచ్చేవారు ఈ దర్వాజా నుంచే నగరంలోకి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండేది. 2. చంపా దర్వాజా పురానాపూల్–దిల్లీ దర్వాజాల మధ్యలో ప్రస్తుతం పేట్లబురుజు ప్రాంతంలో ఉండేది. దీని ద్వారా కళాకారులు, పండితులు వెళ్లేవారు. 3. దిల్లీ దర్వాజా నయాపూల్ సమీపంలో ఉండే ఈ దర్వాజా ద్వారా దిల్లీ రాజ్యం నుంచి వచ్చేవారికి, ఇక్కడి నుంచి దిల్లీ వెళ్లేవారికి, మంత్రులు, రాజవంశీకులు, రాయబారులకు అనుమతి ఉండేది. 4. చాదర్‌ఘాట్ దర్వాజా హైదరాబాద్ సంస్థానం మొత్తంలో పండించే పంటలు,« ధాన్యం ఇతర వస్తువులను ఈ దర్వాజా ద్వారా తీసుకొని వచ్చేవారు. 5.డబీర్‌పురా దర్వాజా దీని ద్వారా మిలటరీ, పోలీసు ఉన్నతాధికారులే వచ్చేవారు. ఇది పురానీ హవేలీకి దగ్గరగా ఉండేది. 6.యాకుత్‌పురా దర్వాజా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం నగరంలోకి వచ్చే వారి కోసం, విదేశీయులు, యాత్రికుల కోసం వినియోగించేవారు. 7. కట్ట మీర్‌జుమ్లా దర్వాజా ఈ దర్వాజా తలాబ్ అంటే చెరువుకు నీటి కోసం వెళ్లే వారి కోసం ఉండేది. పురానా హవేలీలోని నిజాం నివాసానికి, ఉన్నతాధికారుల నివాసాలకు ఈ దర్వాజా ద్వారా ఏనుగులపై నీళ్లు తీసుకొని వచ్చే వారు. 8. గౌలిపురా దర్వాజా దీని ద్వారా పశువులను నగరం బయటికి మేత కోసం తీసుకెళ్లి, తీసుకొచ్చే వారు. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఎక్కువగా యాదవులు ఉండడం గమనార్హం. 9. లాల్ దర్వాజా హిందువుల పండుగలు, ఊరేగింపులు, ఇతర వేడుకలు, రథాల ఊరేగింపులు దీని ద్వారానే జరిగేవి. అందువల్లే ఈ దర్వాజా సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. 10. ఆలియాబాద్ దర్వాజా జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ఉండేది. నగరంలో ఏర్పాటు చేసే సంతలకు వచ్చి సరుకులు విక్రయించుకునేవారు, ప్రజలు దీనిని వినియోగించేవారు. 11. ఫతే దర్వాజా ఇది గోల్కొండ కోట నుంచి వచ్చే వారి కోసం ఉండేది. దీనిద్వారా రాజ కుటుంబీకులు, సుబేదారులు, సైనికులు రాకపోకలు సాగించేవారు. 12. దూద్‌బౌలి దర్వాజా ఈ దర్వాజా చుట్టుపక్కల పెద్ద సంఖ్యలు గుళ్లు, దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో పూజలు చేసే అర్చకులు, పురోహితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేద పండితులు ఈ మార్గాన్ని వినియోగించేవారు. -
కుతుబ్‌షాహీలు
గోల్కొండ కేంద్రంగా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు పాలించిన కుతుబ్‌షాహీలు విశిష్ట సాంస్కృతిక సేవలు అందించారు. పారశీకులైనాతెలుగు వారి సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాస్తు నిర్మాణాల్లో వీరి కాలం నాటి సాంస్కృతిక వికాసం ప్రతిబింబిస్తుంది. కుతుబ్‌షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్‌షా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ. 1543 వరకు పాలించాడు. తెలుగు సర్దార్ల సాయంతో ఆంధ్ర దేశాన్ని సమైక్యం చేశాడు. వీరి రాజభాష పారశీకం అయినా గోల్కొండలో ఉర్దూ భాష ఆదరణకు నోచుకుంది. అరబ్బీ, టర్కీ, పారశీక, హిందీ భాషా పదాల సమ్మేళనమే ఉర్దూగా ప్రసిద్ధి పొందింది. ఉత్తర భారతదేశంలోని సైనిక శిబిరాల్లో ఉర్దూను అధికార భాషగా ఉపయోగించారు. తర్వాత గోల్కొండలో దక్కనీ భాషగా ప్రసిద్ధి చెందింది. ఉర్దూ సాహిత్యానికి పితామహుడిగా ఇబ్రహీం కుతుబ్‌షా కీర్తి పొందాడు. అతడిని ‘ఛాజర్ ఆఫ్ ఉర్దూ’గా పేర్కొంటారు. సుల్తానులు తాము రాయించిన ‘సనడులు’ పారశీక భాషలో ఉన్నా, వాటిని తెలుగులోకి అనువదింపజేశారు. తెలుగు మండలాల్లో తెలుగులోనే రాజ్య వ్యవహారాలు నిర్వహించేవారని ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచయిత సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. సుల్తాన్ కులీ కుతుబ్‌షా కాలంలో కవులు, పండితులకు మాన్యాలు దానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఇతడి కాలంలో శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానం తెలుగులో రచించి కోర్కొల జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. కుతుబ్‌షాహీల ఆస్థానానికి పర్షియా, మధ్యాసియా ప్రాంతాల నుంచి కవి పండితులు వచ్చేవారు. కుతుబ్‌షాహీ వంశంలో మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా గోల్కొండను క్రీ.శ.1550 నుంచి క్రీ.శ.1580 వరకు పాలించాడు. ఇతడి కాలంలో తెలుగు ఒక వెలుగు వెలిగింది. ఇతడు తెలుగు కవులు, పండితులను పోషించి, వారు అంకితమిచ్చిన తెలుగు కృతులను స్వీకరించాడు. తెలుగు కవుల సాహిత్యంలో ఇబ్రహీం కుతుబ్‌షా ‘ఇభరాముడు’ అయ్యాడు. ప్రభువు ముస్లిం అయినా అతడిని హైందవ దేవతలు రక్షింతురు గాక అని కవులు దీవించినట్లు ప్రముఖ రచయిత ఆరుద్ర పేర్కొన్నాడు. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో అద్దంకి గంగాధరుడు ఆస్థాన కవిగా నియమితుడయ్యాడు. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానం అనే కావ్యం రచించి ఇబ్రహీంకు అంకితమిచ్చాడు. మహ్మదీయ సుల్తానులకు కావ్యాలను అంకితమిచ్చిన మొదటివాడు గంగాధరుడని ప్రతీతి. కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అనే శృంగార కావ్యాన్ని తెలుగులో రాశాడు. ఇతనిది నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామ మని తెలుస్తోంది. కందుకూరి సోమేశ్వర స్వామి కి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ తెలుగులో మొట్టమొదటి యక్షగాన నాటకమని సాహిత్యకారులు భావిస్తారు. దీన్ని కరుణభాసుర యక్షగాన ప్రబంధం అని కవి పేర్కొన్నాడు. ఈ గ్రంథాన్ని ‘కందుకూరి జనార్దన స్వామికి’ అంకితమిచ్చాడు. రుద్రకవి మరో రచన ‘జనార్దనాష్టకం’. జనార్దనుడిపై దేశవాళీ భాషలో అష్టకం రచించిన మొదటి కవిగా రుద్రకవిని సాహిత్యకారులు గుర్తించారు. ఇతడి భాషా సేవలకు మెచ్చి ఇబ్రహీం కుతుబ్‌షా ఇతనికి చింతపాలెం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మరింగంటి సింగనాచార్యుడు ‘దశరథరాజ నందన చరిత్ర’, ‘శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతా కల్యాణం’ అనే రెండు కావ్యాలు తెలుగులో రచించాడు.‘రాజనీతి రత్నాకరం’ పేరుతో వైష్ణవ ప్రబంధంగా ‘పంచతంత్రాన్ని’ రచించిన కృష్ణయామాత్యుడు ఈ కాలం నాటి వాడే. ఇబ్రహీం కుతుబ్‌షా కాలం నాటి మరో ప్రముఖ కవి పొన్నెగంటి తెలగనార్యుడు. తెలుగులో తొలి వ్యాకరణం ‘ఆంధ్ర భాషా భూషణం’ గ్రంథాన్ని మూలఘటక కేతన రచించాడు. అదే ఒరవడితో తెలగనార్యుడు అచ్చ తెలుగు కావ్యంగా ‘యయాతి చరిత్ర’ రాశాడు. ఈ కావ్యాన్ని గోల్కొండ ప్రాంత తరఫ్‌దారు (గవర్నర్) అమీన్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. అమీన్‌ఖాన్ పఠాన్‌చెరు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు సాహిత్య పోషకుడు. కుతుబ్‌షాహీ వంశంలో ఐదో సుల్తాన్‌గా పేరుగాంచిన మహ్మద్ కులీకుతుబ్‌షా క్రీ.శ 1580 నుంచి క్రీ.శ.1612 వరకు గోల్కొండను పాలించాడు. ఇతడే హైదరాబాద్ నిర్మాత. హైదరాబాద్‌లో క్రీ.శ.1591లో చార్మినార్‌ను, తన ప్రేయసి భాగమతి పేరుతో భాగ్యనగరం నిర్మించాడు. ఇతడి కాలంలో గోల్కొండ కరణంగా పనిచేసిన సారంగు తమ్మయ వైజయంతీ విలాసం అనే శృంగార రస కావ్యాన్ని రచించాడు. దీన్ని తన కులదైవం శ్రీరాముడికి అంకితమిచ్చాడు. ‘హరిభక్త శుభోదయం’ అనే 20 అధ్యాయాల గ్రంథానికి సంస్కృత భాషలో సారంగు తమ్మయ వ్యాఖ్యానం రాశాడు. దానికి ‘భక్తి సంజీవని’ అని పేరు పెట్టాడు. తాను భాగ్యనగర పట్టణానికి మంత్రినని చెప్పుకొన్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పర్షియన్ భాషలో మొదటిసారిగా ‘గజల్స్’ ప్రవేశపెడితే, మహ్మద్ కులీ కుతుబ్‌షా ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో హిందువుల పండగలన్నింటినీ వర్ణించాడు. ఇతని కలం పేరు ‘మానిని’. పారశీక గజల్స్‌తోపాటు, ఆశు కవిత్వం అయిన ‘ప్రాయిరీలు’ వీరి కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుతుబ్‌షాహీ వంశంలో ఆరో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా. ఇతడి కాలంలో ప్రసిద్ధ శృంగార పదకర్త క్షేత్రయ్య గోల్కొండను సందర్శించాడు. సుల్తాన్‌పై ‘వేయి పదాలు’ కవిత్వం చెప్పాడు. క్షేత్రయ్య పదాలనే మొవ్వ గోపాల శృంగార పదాలంటారు. క్షేత్రయ్యది కృష్ణాజిల్లా మొవ్వ గ్రామం. మొవ్వలోని గోపాలకృష్ణుడిపై చెప్పిన కవితలు మొవ్వ గోపాల పదాలుగా ప్రసిద్ధి చెందాయి. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను దర్శించడంతో అతడికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇతడి అసలు పేరు వరదయ్య. కుతుబ్‌షాహీ వంశంలో ఏడోవాడైన అబుల్ హసన్ తానీషా క్రీ.శ.1672-క్రీ.శ.1687 వరకు పాలించాడు. క్రీ.శ.1687లో గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జయించి, తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. తానీషా కాలంలో భద్రాచలం తహశీల్దార్ కంచర్ల గోపన్న (రామదాసు) భద్రాద్రి రాముడిపై భక్తి కీర్తనలు రచించి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. భక్త రామదాసు) ‘దాశరథీ శతకం’ రచించాడు. ప్రజాకవిగా పేరుగాంచిన ‘యోగి వేమన’ వీరి కాలానికే చెందినవాడే. అబుల్ హసన్ తానీషా కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి నాట్య కళాకారులకు(భామాకలాపం) అగ్రహారంగా దానం చేశాడు. దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి లఘుచిత్రాలు.. దక్కనీ లఘు చిత్రాలుగా చిత్రించారు. షాషాద్ షాహీ దక్కన్ అనే గ్రంథం 15 లఘు చిత్రాలతో కూడుకొని ఉంది. వాస్తుపరంగా విశిష్టమైన ‘కుతుబ్ షాహీ శైలి’ వెలుగులోకి వచ్చింది. ఈ శైలి బహమనీ సుల్తానుల నుంచి ఆవిర్భవించింది. పెద్ద పెద్ద గుమ్మటాలు, విశాల ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు, కోణాకృతి నిర్మాణాలు కట్టడాల్లో కనిపిస్తాయి. మహ్మద్ కులీ కుతుబ్‌షా భాగ్యనగరం, చార్మినార్ కట్టించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంబాగ్లు నిర్మించాడు. భాగ్యనగరంలో చార్మినార్, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు కుతుబ్‌షాహీల ప్రసిద్ధ స్మారక నిర్మాణాలు. గోల్కొండ కోటలో రామదాసు బందీఖానా, రాణీమహల్, స్నానవాటికలు నేటికీ నిలిచి ఉన్నాయి. కుతుబ్‌షాహీల నిర్మాణాల్లోకెల్లా అత్యంత విశాలమైన ఏడు సమాధులు ‘కుతుబ్‌షాహీ టూంబ్స్’గా ప్రసిద్ధి పొందాయి. ఒక్క అబుల్ హసన్ తానీషా తప్ప, మిగిలిన సుల్తానులను ఇక్కడే సమాధి చేశారు. అబుల్ హసన్ తానీషా సమాధి దౌలతాబాద్ వద్ద ఉంది. కుతుబ్‌షాహీలు పారశీకులైనా ఆంధ్రుల సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సుమారు 171 ఏళ్లు ఈ సుల్తానులు తూర్పు తీరాంధ్ర వరకు పరిపాలించారు. మాదిరి ప్రశ్నలు 1. మహ్మద్ కులీ కుతుబ్‌షా ఏ సంవత్సరంలో చార్మినార్‌ను నిర్మించాడు? 1) 1591 2) 1592 3) 1593 4) 1594 2. మహ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరి పేరు మీద హైదరాబాద్ నగరం నిర్మించాడు? 1) భాగీరథి 2) తారామతి 3) ప్రేమావతి 4) భాగమతి 3. ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? 1. ఇబ్రహీం కుతుబ్‌షా 2. మహ్మద్ కులీ కుతుబ్‌షా 3. అబ్దుల్లా కుతుబ్‌షా 4. ఇబ్రహీం కుతుబ్‌షా 4. ‘ఖైరతాబాద్ మసీదు’ను నిర్మించిన కుతుబ్‌షాహీ పాలకుడు? 1) మహ్మద్ కులీ కుతుబ్‌షా 2) తానీషా 3) ఇబ్రహీం కుతుబ్‌షా 4) మహ్మద్ కుతుబ్‌షా 5. ఎవరి పాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో మొఘల్ అధికారుల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది? 1) మహ్మద్ కులీ కుతుబ్‌షా 2) అబ్దుల్లా కుతుబ్‌షా 3) మహ్మద్ కుతుబ్‌షా 4) ఇబ్రహీం కుతుబ్‌షా 6. గోల్కొండ రాజ్యం ఏ సంవత్సరంలో మొగల్ సామ్రాజ్య వశమైంది? 1) 1685 2) 1683 3) 1687 4) 1689 సమాధానాలు 1) 1; 2) 4; 3) 2; 4) 4; 5) 2; 6) 3. డా॥పి. జోగినాయుడు డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్) ఆర్కియాలజీ - మ్యూజియమ్ -
షహర్‌కీ షాన్ తటాకాల నగరం
భాగ్యనగరం ఒకప్పుడు తటాకాల నగరంగా ఉండేది. ఎక్కడికక్కడ ఉద్యానవనాలతో విరాజిల్లేది. మండు వేసవిలోనూ ఎండల తీవ్రత ఎరుగని చల్లని నగరంగా ప్రజలను సేదదీర్చేది. కాకతీయుల కాలంలో వర్ధిల్లిన గొలుసుకట్టు చెరువుల పరిజ్ఞానాన్ని ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులూ అందిపుచ్చుకోవడంతో ఇది సాధ్యమైంది. అప్పట్లో ప్రస్తుతం భాగ్యనగరం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల యాభై మైళ్ల వ్యాసం పరిధిలో దాదాపు మూడున్నర వేలకు పైగా చెరువులు ఉండేవి. వాటిని ఆసరా చేసుకుని వేలాది ఎకరాల్లో తోటలు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ నగరం వేసవి విడిదిగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు వేసవి తీవ్రతకు భగభగలాడిపోతున్నా, హైదరాబాద్ పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉండేవి. అప్పట్లో వేసవి కాలంలో చుట్టుపక్కల జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యేవి. చెరువులు, ఉద్యానవనాలు చాలా వరకు అంతరించడంతో ఇప్పుడీ వ్యత్యాసం 3-5 డిగ్రీలకు మించడం లేదు. జలసిరులు.. శుభకార్యాలకు ఆనవాళ్లు కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌కు ప్రాణం పోస్తే, నిజాం నవాబులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను తవ్వించారు. తాగునీటికి వనరులు పుష్కలంగా ఉన్నా, చెరువుల తవ్వకాన్ని ఆపలేదు. నవాబుల ఇంట శుభకార్యాలు జరిగినప్పుడు ఆ సందర్భాలకు గుర్తుగా చెరువును తవ్వించడం, వనాన్ని పెంచడం ఆనవాయితీగా ఉండేది. తర్వాతి కాలంలో చెరువులు అంతరించాయి. అప్పట్లో 3,750 చెరువులు ఉండగా, ఇప్పుడు 170 మాత్రమే మిగిలాయి. గుట్టల మధ్య వెలసిన భాగ్యనగరంలో అప్పటి నవాబులు గుట్టలపై వనాలను పెంచారు. ఇప్పటికీ వృక్షసంపద గణనీయంగానే ఉన్నందున సాయంత్రం కాగానే నగరం చల్లబడుతోంది. వికారాబాద్‌కు చేరువలోని అనంతగిరి హిల్స్ ప్రభావం కూడా ఇక్కడి వాతావరణంపై ఉంది. మూసీనది పుట్టిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ హార్స్లీ హిల్స్‌గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతం నగరానికి చల్లగాలులు పంచుతోంది. ఇప్పటికీ జూపార్కు, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, హరిణ వనస్థలి, చిలుకూరు అభయారణ్యం, బొల్లారం, గోల్కొండ మిలటరీ స్థావరాలు దట్టమైన చెట్లతో నిండి ఉన్నందునే వేసవి తీవ్రత నుంచి కొంతవరకైనా రక్షణ లభిస్తోంది. -
ఆంధ్రుల చరిత్ర.. మాదిరి ప్రశ్నలు
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి 2. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ను శంకరకవి ఏ భాషలో రచించాడు? తెలుగు 3. కుతుబ్‌షాహీల రాజభాష ఏది? పారశీకం 4. ఏ గోల్కొండ నవాబును కవులు తమ రచనల్లో ఇభరాముడని కీర్తించారు? ఇబ్రహీం కుతుబ్‌షా (మూడో నవాబు) 5. ‘సుగ్రీవ విజయం’ యక్షగాన నాటకం తెలుగుభాషలో మొదటిది. దాని రచయిత ఎవరు? కందుకూరి రుద్రకవి 6. ‘నిరంకుశోపాఖ్యానం’ అనే శృంగార కావ్యాన్ని తెలుగుభాషలో ఎవరు రచించారు? కందుకూరి రుద్రకవి 7. పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చతెలుగు కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు? గోల్కొండ తరఫీదార్ అమీన్‌ఖాన్ 8. మహ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ పాలకుల్లో ఎన్నో సుల్తాన్? ఐదు 9. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని రచించిన సారంగు తమ్మయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? మహ్మద్ కులీ కుతుబ్‌షా 10. ప్రసిద్ధ పదకర్త, మువ్వగోపాల పదాలు రచయిత క్షేత్రయ్య ఏ కుతుబ్‌షాహీ పాలకుడికి సమకాలీకుడు? అబ్దుల్లా కుతుబ్‌షా 11. దాశరథీ శతకం రచయిత? కంచర్ల గోపన్న 12. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ఏ గోల్కొండ నవాబు ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు? అబుల్ హసన్ తానీషా 13. మూసీ నదిపై పురానాపూల్ (వంతెన)ను క్రీ.శ. 1578లో ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు? ఇబ్రహీం కుతుబ్‌షా 14. మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్ని ఎప్పుడు నిర్మించాడు? క్రీ.శ. 1591లో 15. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన మక్కా మసీదును హైదరాబాద్‌లో ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు? మహ్మద్ కుతుబ్‌షా 16. తొలి ఉర్దూ గ్రంథంగా పేరు పొందిన ‘కుల్లియత్’ను ఎవరు రచించారు? మహ్మద్ కులీ కుతుబ్‌షా 17. గోల్కొండ సుల్తాన్లలో చివరి నవాబు? అబుల్ హసన్ తానీషా 18. గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి 1687లో మొగలు చక్రవర్తి ఔరంగజేబుకు ఎన్ని నెలల కాలం పట్టింది? 8 నెలలు 19. కుతుబ్‌షాహీ - గోల్కొండ రాజ్యస్థాపకుడు? సుల్తాన్ కుతుబ్ - ఉల్- ముల్క్ 20. కైఫీయతులు అంటే ఏమిటి? స్థానిక కథనాలు 21. కుతుబ్‌షాహీలు ఏ మహ్మదీయ శాఖకు చెందినవారు? షియా మతస్థులు 22. మజ్లిస్ - దివాన్ దరి - మజ్లిస్ - ఇ - కింగాష్లు దేన్ని సూచిస్తాయి? సుల్తాన్‌కు సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన పండిత పరిషత్తులు 23. పీష్వా, దివాన్ పదాలు దేన్ని సూచిస్తాయి? ప్రధానమంత్రి పదవి 24. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ప్రధాన మంత్రి ఎవరు? మాదన్న 25. అబుల్హసన్ తానీషా సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? అక్కన్న 26. మీర్ జుమ్లా అంటే ఎవరు? మంత్రి (ఆర్థిక - రెవెన్యూ శాఖల అధిపతి) 27. కుతుబ్‌షాహీల కాలంలో మజుందార్ అంటే ఎవరు? గణాంకాధికారి 28. కుతుబ్‌షాహీల తరఫీలు (రాష్ట్రాలకు) అధిపతి ఎవరు? తరఫీదార్ (గవర్నర్) 29. కొత్వాల్ అంటే ఎవరు? రక్షక భటాధికారి 30. కుతుబ్‌షాహీల పాలనలో ప్రధాన రేవు అధికారిని ఏమని పిలిచేవారు? షా బందర్ 31. గోల్కొండ రాజ్యంలో గ్రామ వ్యవహారా లను ఎవరు నిర్వహించేవారు? బారా బలవంతులు (పన్నిద్ధరు ఆయగాండ్రు) 32. గోల్కొండ సైన్యం ఎవరి పర్యవేక్షణలో ఉండేది? ఐనుల్ ముల్క్ 33. క్రీ.శ. 1687లో ఔరంగజేబు కాలంలో గోల్కొండ కోటను ముట్టడించారు. అప్పటి కుతుబ్‌షాహీ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా సైన్యాధ్యక్షుడు? అబ్దుల్ రజాక్ లారీ -
మక్కామసీదును నిర్మించినవారు ఎవరు?
ఏపీ హిస్టరీ డా॥పి. జోగినాయుడు డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్) ఆర్కియాలజీ - మ్యూజియమ్స్ కుతుబ్‌షాహీల కాలంనాటి సాంఘిక పరిస్థితులు: యూరోపియన్ యాత్రికులు, వర్తకులు, రాయబారులు రాసిన గ్రంథాల ద్వారా కుతుబ్‌షాహీల కాలంనాటి మత-సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. గోల్కొండ నవాబుల రాజభాష పారశీకం అయినా, తెలుగు భాష కూడా వారి పాలనలో మంచి అభివృద్ధినే సాధించింది. తెలుగు, దక్కనీ ఉర్దూ, పారశీక భాషలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ యుగంలో మతమౌఢ్యాలు, మూఢాచారాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. జ్యోతిషం, ముహూర్త బలాలు, దుష్టఘడియల ప్రమాదాలు, సూర్య చంద్రులను, నక్షత్రాల్ని దేవతలుగా నమ్మడం లాంటివి ఉన్నట్లు బెర్నియర్ రాశాడు. బ్రాహ్మణులకు గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాల్లో మంచి పరిజ్ఞానం ఉందని మూర్‌ల్యాండ్ పేర్కొన్నాడు. వైశ్యులు వర్తకం చేసేవారని, గణితంలో వీరికి మంచి పట్టు ఉండేదని బౌరే రాశాడు. శూద్రులు ప్రభువుల వద్ద సేవకులుగా, సైనికులుగా పనిచేసేవారని మెత్‌హాల్డ్ పేర్కొన్నాడు. సంఘంలో వితంతువులది బాధాకరమైన స్థితి. నగలు పెట్టుకోకూడదు, శుభ్రమైన దుస్తు లు ధరించకూడదు. బంధువులకు దూరంగా ఉండేవారు. సమాజంలో వేశ్యలకు గౌరవం ఉండేది. వారికి అండగా పాలకవర్గం ఉండేది. గోల్కొండలో 20 వేల మంది వేశ్యలు ఉండే వారని టావెర్నియర్ రాశాడు. వారికి ప్రభుత్వం లెసైన్సులు ఇచ్చేది. వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు కాదు. దేవదాసీలకు సంఘంలో మంచి గౌరవం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా ‘కుల్లియత్’ అనే గ్రంథాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇందులో హిందువుల, ముస్లింల పండగల గురించి వివరించాడు. మొహర్రం, రంజాన్, దీపావళి, హోళీ, వసంతోత్సవం లాంటి పండగలను వర్ణించాడు. మహమ్మదీయుల వాస్తు కట్టడాల్లో పూర్ణ కుంభం, లతాపద్మాలు, హంసలు, ఏనుగులు లాంటి హిందూ వాస్తు సంప్రదాయాలు ప్రవేశించాయి. కుతుబ్‌షాహీలు పారశీక దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు. షియా సంప్రదాయానికి సహజమైన సహనాన్ని పరిపాలనలో ప్రదర్శించారు. జాతి, మత విభేదాలు పాటించకుండా, అర్హత ఉన్నవాళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, తెలుగువారి సహాయంతో ఆంధ్రదేశాన్ని సమైక్యం చేశారు. వాస్తు - స్మారక నిర్మాణాలు గోల్కొండ కుతుబ్‌షాహీల కట్టడాలు, షియామత సూత్రాలకు అనుగుణంగా పారశీక, బహమనీ హిందూ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటాయి. ఈ శైలిలో గుమ్మటాలు, కమాన్లు, మీనార్లు ఉంటాయి. పుష్పాలు, లతలు, పక్షులు ఈ నిర్మాణాల్లో కన్పిస్తాయి. వాస్తుపరంగా విశిష్టమైన కుతుబ్‌షాహీ శైలి వెలుగులోకి వచ్చింది. వీరు ప్రధానంగా పారశీక వాస్తుతో పాటు బహమనీ సుల్తానుల వాస్తునే అనుసరించారు. పెద్ద గుమ్మటాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు అష్ట కోణాకృతి నిర్మాణాలు ఈ శైలికి ముఖ్య లక్షణాలు. హైదరాబాద్‌లోని చార్మినార్, చార్‌కమాన్, మక్కామసీదు, టోలీ మసీదు, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల సమాధులు, బాదుషాహీ అసూర్‌ఖానా లాంటి నిర్మాణాలు, కుతుబ్‌షాహీ వాస్తుకు అద్దం పడతాయి. కుతుబ్‌షాహీ మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మూసీనదిపై క్రీ.శ. 1578 పురానాఫూల్ (పాతవంతెన)ను నిర్మించారు. ఇతడి కాలంలోనే హుస్సేన్ సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ కోటలోని ఇబ్రహీం మసీదులను నిర్మించారు. మహ్మద్ కులీకుతుబ్ తన ప్రేయసి భాగమతి పేరుపై మూసీ నది దక్షిణ ప్రాంతంలో క్రీ.శ. 1591లో చిచిలం గ్రామం (ప్రస్తుత షా-ఆలి-బండ ప్రాంతం)లో ప్లేగు వ్యాధి నివారణకు జ్ఞాపకంగా నాలుగురోడ్ల కూడలి మధ్య చార్మినార్‌ను నిర్మించాడు. చార్మినార్ పక్కనే ఉన్న జమామసీదును 1594లో కులీ నిర్మించాడు. దీంతోపాటు మహ్మద్ కులీ పత్తర్‌గట్టి ప్రాంతం (హైదరాబాద్)లో బాదుషాహీ అసూర్‌ఖానా, దారుల్షిఫా(ఆసుపత్రి), చార్ కమాన్ లాంటి నిర్మాణాలు చేశాడు. వీటిని రాయి, సున్నంతో నిర్మించారు. కులీ కుతుబ్‌షా అల్లుడైన మహ్మద్ కుతుబ్‌షా (క్రీ.శ. 1612- 1626) దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మక్కా మసీదును క్రీ.శ. 1617లో నిర్మించాడు. కుతుబ్‌షాహీల ఇతర స్మారక నిర్మాణాలు, గోల్కొండ కోట అంతర్భాగంలో భక్తరామదాసు బందిఖానా, రాణీమహల్‌లు, సుల్తాన్ల మరణాంతరం ఖననానికి ముందు స్నానం చేయించే గదులు నేటికీ ఉన్నాయి. సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన కుతుబ్‌షాహీల సమాధులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాస్తు నిర్మాణాలు. ఒకే రాజవంశానికి చెందిన సుల్తానుల సమాధులన్నీ (అబుల్ హసన్ తానీషా తప్ప) ఒకే ప్రాంగణంలో నిర్మించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కన్పించదు. సమాధుల డోమ్ అంతర్భాగాన్ని అష్టకోణాకృతిలో ప్రత్యేక పరిజ్ఞానంతో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలంనాటి చిత్రకళ, మొగలులు, హిందూ- పారశీక సంప్రదాయం లో దక్కనీ చిత్రకళ చరిత్రలో పేరుగాంచింది. తారీక్ హుస్సేన్ ‘షాహిద్ -షాహీ దక్కన్’ గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. మహమ్మద్ కులీకుతుబ్‌షా రచించిన ‘కుల్లియత్’ గ్రంథంలో 14 సూక్ష్మచిత్రాలు (మీనియేచర్ చిత్రాలు) ఉన్నాయి. దక్కను ఉర్దూలో రాసిన మొదటి గ్రంథంగా ‘కుల్లియత్’ను పేర్కొంటారు.