జనగామలో కుతుబ్‌షాహీల శాసనం  | Qutub Shahi ordinance in the Jangaon | Sakshi
Sakshi News home page

జనగామలో కుతుబ్‌షాహీల శాసనం 

Published Sat, Jul 14 2018 2:09 AM | Last Updated on Sat, Jul 14 2018 2:09 AM

Qutub Shahi ordinance in the Jangaon - Sakshi

వల్మిడిలో గుర్తించిన తెలుగు శాసనం

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు నేలను పాలించిన మహ్మదీయ రాజుల్లో ప్రముఖులైన కుతుబ్‌షాహీల కాలానికి చెందిన అరుదైన శాసనం వెలుగు చూసింది. రెండువందల ఏళ్లు కుతుబ్‌షాహీలు గోల్కొండ కేంద్రంగా పాలన సాగించగా వీరి శాసనాలు ఇప్పటివరకు వందలోపు లభ్యమయ్యాయి. ఇందులో ఒకటి నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బయటపడగా, మరొకటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో చరిత్రకారులు కనుగొన్నారు. వల్మిడి గ్రామ చెరువుకట్ట సమీపంలో ఈ శాసనాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్, అరవింద్‌ ఆర్యా, చంటి, ముడావత్‌ రవీందర్, కమలాకర్‌ నాయక్‌లు కనుగొన్నారు. ఈ శాసనం శాలివాహన శకం సం.1489, ప్రభవ నామ సం.శ్రావణ శుద్ధ 12(ద్వాదశి) శుక్రవారం అంటే క్రీ.శ.1567 జూలై 18న వేశారు.

ఈ శాసనం ఇబ్రహీం కుతుబ్‌షా, కులీకుతుబ్‌షా తండ్రి పాలనాకాలంనాటిది. ఇది తెలుగులో ఉంది. తొలుత రామకథను కీర్తించే ఒక సంస్కృత శ్లోకంతో మొదలైంది. ‘ఈ లోకంలో సూర్యచంద్రులు, భూమి, రామకథ ఉన్నంతదాకా రాజ్యం ఉంటుంది విభీషణా’అని అర్థమిచ్చే ఈ శ్లోకం కుతుబ్‌షాహీ రాజ్యానికి అన్వయిస్తూ శాసన రచయిత రాసినట్లుంది. అస్పష్టమైన పేరు (మీరా తాజనమియ్య)గల పాలకుడు తవ్వించిన ‘వలిమిడి ’చెరువు కింద ఒకటో పొలచంరాజు మర్తురు భూమిని పంట పండించుకుని ఫలం ఆచంద్రార్కంగా అనుభవించమని (ఎవరికి అన్నది శాసనంలో పేర్కొనలేదు) ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ శాసనాన్ని బట్టి ఆ కాలంలో జనగామ ప్రాంతాన్ని ఒకటో పొలచంరాజు పాలించాడనే  విషయాన్ని బలపరిచేలా ఇక్కడికి సమీపంలో పాలంరాయుని పేట అనే పాటిగడ్డ (పాతవూరిగడ్డ) ఉంది. అక్కడ రాజభవనం నిర్మాణ శిథిలాలు అగుపిస్తున్నాయి. అక్కడ పూర్వం రాజెవరో ఉండేవారని ప్రజలు చెప్పుకుంటారు. ఆ రాజే పాలంరాయుడు కావచ్చు.  

వల్మిడి శాసనం విశేషాలు: 
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం 
శాసన స్థానం: తాళ్ల చెరువు కట్ట కింద 
లిపి: తెలుగు , భాష: తెలుగు 
శాసనోద్దేశం: చెరువు కట్టడం, భూదానం 
శాసన సమయం: శక సంవత్సరం 1489, ప్రభవ నామ సం.శ్రావణ శు.12, 1567 
జూలై 18 శుక్రవారం 
శాసన రాజవంశం: కుతుబ్షాహీలు 
శాసనకాలపు రాజు: ఇబ్రహీం కుతుబ్షా 
శాసనం వేయించింది: పొలచం రాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement