పాలకుర్తిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందా? రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించే ప్రయత్నం జరుగుతోందా? కర్నాటక ఫలితాలతో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ గూటిలో గుబులు పుట్టించేలా పాలకుర్తిలో పావులు కదుపుతున్న నేతలు ఎవరు? మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారు?
ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించేందకు
రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించేవారు. ప్రజాభిమానం ఉన్నందునే ఎర్రబెల్లిని పార్టీలోకి ఆహ్వానించి కేబినెట్లో చోటు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసిఆర్ మాదిరిగానే ఓటమి ఎరగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందని టాక్ నడుస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయడానికి ఢోకా లేని మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఝాన్సీరెడ్డి కొనసాగుతున్నారు. గత 30ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమి ఎకరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కెటాయించారు.
చదవండి: జీవో 111 రద్దు.. 80 శాతం భూములు కేసీఆర్ బినామీ చేతుల్లోనే: రేవంత్‌రెడ్డి
ఝాన్సీ రెడ్డి దంపతులను కలిసిన రేవంత్‌రెడ్డి
తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అమెరికా వెళ్ళిన టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపారట. వారి ఇంట్లోనే షెల్టర్ తీసుకున్న రేవంత్ రెడ్డి పార్టీలోకి అహ్వానించగా అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఇండియాకు రానున్న ఝాన్సీరాజేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతారని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
రాహుల్‌తో భేటీ?
ఈనెల 30న అమెరికాకు వెళ్ళనున్న రాహుల్ గాంధీతో సైతం ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు భేటి కానున్నారని సమాచారం. ఓటమి ఎరగని నేతగా రికార్డు సృష్టించిన మంత్రి ఎర్రబెల్లిని ఢీ కొట్టి కాంగ్రెస సత్తా చాటడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత, సేవా కార్యక్రమాలు వర్క్ అవుట్ అవుతాయని భావిస్తున్నారు. ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నప్పటికి ఆయన స్వగ్రామం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో పాలకుర్తికి స్థానికేతరుడనే భావన కలుగుతుంది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో ఈ మధ్యన ఎర్రబెల్లి మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాలతో గడుపుతున్నారు. ఝాన్సీరెడ్డి వచ్చినా మరెవ్వరు వచ్చినా ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికి లేదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లికి దీటైన వ్యక్తిని బరిలో దింపి రికార్డును తిరగరాస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment