హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్! | Great Wall of Hyderabad! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్!

Published Sun, Sep 17 2017 2:40 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్!

హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్!

నగరం చుట్టూరా మహాకుడ్యం 
శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కుతుబ్‌షాహీలు 
25 అడుగుల ఎత్తు.. 10 కిలోమీటర్ల పొడవున భారీ గోడ
12 దర్వాజాలు 12 కిటికీలు
 
- నిజాం రాజుల కాలంనాటికి పూర్తయిన ప్రహరీ
సూర్యోదయమైతేనే నగర ప్రవేశం
సూర్యాస్తమయానికి మార్గాలన్నీ బంద్‌
వందల ఏళ్లపాటు రాజసం పంచిన కుడ్యం
మూసీ వరద, కూల్చివేతలతో చాలా వరకు ధ్వంసం
ప్రస్తుతం మిగిలింది పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే  
 
నాలుగు వందల ఏళ్ల క్రితమే సకల సదుపాయాలతో తులతూగిన భాగ్యనగరికి ఎన్నో చారిత్రక ప్రత్యేకతలు ఉన్నాయి. మూసీ (ముచ్కుందా నది) ఒడ్డున 426 ఏళ్ల కింద పద్నాలుగు వేల భవనాలతో మహానగరాన్ని నిర్మించారు. ఆ సమయంలో నగరాన్ని నిర్మించిన కులీకుతుబ్‌షా ప్రార్థన చేస్తూ.. ‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. సకల జాతుల జనంతో చెరువులో చేపల్లా నిండిపోవాలి. ప్రపంచంలో కెల్లా మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి..’’అని వేడుకున్నారట. పుట్టుకతో నగరమైన హైదరాబాద్‌.. అనతికాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందింది.   అలాంటి సమయంలో శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం నగరం చుట్టూ భారీ గోడను నిర్మించారు. దానిలో 12 దర్వాజాలు (మార్గాలు), 12 కిటికీలు (చిన్నపాటి తలుపులు) ఏర్పాటు చేశారు. చార్మినార్‌ కేంద్రంగా నగరం చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ గోడ ప్రత్యేకతలపై ఈ వారం ఫోకస్‌.. 
– సాక్షి, హైదరాబాద్‌
 
నాడు  
పన్నెండు తలుపులు.. చుట్టూరా కిటికీలు 
హైదరాబాద్‌ మహానగరం ఎన్నో అనుకూలతలకు నిలయం. సముద్ర మట్టానికి సుమారు 600 అడుగుల ఎత్తులో ఉండడంతో నెలకొన్న సమశీతోష్ణస్థితి ప్రత్యేకం. ఈ మహా నగరి.. మంత్ర నగరిని తలపించిందంటూ కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు మెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. మహా నగరానికి, ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు చార్మినార్‌ చుట్టూరా సుమారు పది కిలోమీటర్ల (ఆరు మైళ్ల)పొడవుతో 25 అడుగుల ఎత్తుతో గోడను నిర్మించారు. 1684లో కుతుబ్‌షాహీల హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఈ గోడ.. 1765లో అసఫ్‌ జాహీ నిజాం అలీఖాన్‌ ఆధ్వర్యంలో పూర్తయింది. నగరంలోకి వచ్చి, వెళ్లేందుకు ఈ గోడలో 12 చోట్ల ద్వారాలు ఏర్పాటు చేశారు. పురానాపూల్‌ దర్వాజా, పేట్లబురుజు (చంపా దర్వాజా), మోతిగల్లీ (దిల్లీ దర్వాజా), చాదర్‌ఘాట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, కట్టామీర్‌జుమ్లా (తలాబ్‌కట్ట), గౌలిపురా, లాల్‌దర్వాజా, ఆలియాబాద్, ఫతే దర్వాజా (శాలిబండ సమీపంలో), దూద్‌బౌలి దర్వాజాలతో పాటు మరో పన్నెండు కిటికీలు నిర్మించారు.  
 
ఆ సమయంలోనే.. 
హైదరాబాద్‌ మహానగరం లోపలికి వెళ్లాలన్నా.. బయటికి వెళ్లాలన్నా సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్యే జరగాలి. ఈ రెండు పూటలా గేట్లు తెరుచుకునే/మూసేసే సమయంలో అందరినీ అప్రమత్తం చేసేందుకు భారీ నగరాలు మోగించేవారు. ఇందుకు ప్రత్యేక యంత్రాంగం పనిచేసేది. ఇక పన్నెండు దర్వాజాల్లో అత్యధికం 1908 సెప్టెంబర్‌ వరదల్లో ధ్వంసమవగా.. మరికొన్నింటిని రాకపోకలకు అడ్డంకిగా మారాయంటూ 1954లో సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు తొలగించింది. ప్రస్తుతం పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే మిగిలాయి. అయితే నగర చరిత్ర ఇప్పటికే ధ్వంసమైందని... ఏ దర్వాజా, కిటికీ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఇంటాక్‌ కన్వీనర్‌ అనురాధారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం చుట్టారా ధ్వంసమైన చరిత్రను ముందుతరాలకు అందించేందుకు ప్రత్యేక కృషి మొదలుపెట్టామని తెలిపారు. 
 
దర్వాజాల మధ్య 12 కిటికీలు 
నగరం చుట్టూ దర్వాజాల మధ్య 12 కిటికీలను నిర్మించారు. అయితే ఇవి మామూలు కిటికీలు కావు.. పెద్ద ద్వారాల్లా కాకుండా చిన్న తలుపుల మాదిరిగా ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో శ్మశానాలన్నీ నగరం బయట ఉండేవి. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు జరపడానికి దర్వాజా ద్వారా తీసుకెళ్లడాన్ని అపశకునంగా భావించేవారు. ఇక రాజ కుటుంబం, ఉన్నతాధికారులు వెళ్లే దర్వాజాల ద్వారా అంత్యక్రియల ఊరేగింపులకు అనుమతి ఉండేదికాదు. దాంతో కిటికీలను ఏర్పాటు చేసి.. వాటిని దీనికి వినియోగించారు. అందువల్లే కిటికీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ çశ్మశానాలు ఉన్నాయి. ఇక అత్యవసర సమయాల్లోనూ రాకపోకలకు కిటికీలను ఉపయోగించుకునేవారు. 
 
ఎక్కడెక్కడ ఉన్నాయి..? 
చంపా దర్వాజా–ఢిల్లీ దర్వాజా మధ్యలో చార్‌మహల్‌ కిటికీ; ఢిల్లీ దర్వాజా–చాదర్‌ఘాట్‌ మధ్య హత్తి కిటికీ; చాదర్‌ఘాట్‌–డబీర్‌పురా మధ్య బొదే అలీషా కిటికీ; డబీర్‌పుర–యాకుత్‌పురా దర్వాజాల మధ్య మాతా కిటికీ; యాకుత్‌పుర–కట్టమీర్‌జుమ్లా మధ్య రంగేలీషా కిటికీ; కట్టమీర్‌జుమ్లా–గౌలిపుర మధ్య కమాన్‌దాన్‌ కిటిæకీ; ఆలియాబాద్‌–ఫతే దర్వాజా మధ్య గాజిబండ కిటికీ, ఫతే దర్వాజా–పురానాపూల్‌ మధ్య బొహోరోకి కిటికీలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు గొల్ల కిటిæకీ, మంగళ కిటికీ, కిటికీ బవహీర్, కిటిæకీ కార్వాన్‌లను నిర్మించారు.  

నేడు  
ఏదారి.. ఎవరిది? 
హైదరాబాద్‌ నగరం చుట్టూ ఏర్పాటు చేసిన దర్వాజాలకు ప్రత్యేకత ఉండేది. సాధారణ ప్రజలు, అధికారులు, సైనికులు ఇలా ఎవరెవరు ఏయే దర్వాజాల నుంచి ఎవరు రాకపోకలు సాగించాలన్న నిబంధనలు ఉండేవి. 
1. పురానాపూల్‌ దర్వాజా 
నగరానికి ప్రధాన ద్వారంగా పరిగణించే పురానాపూల్‌ దర్వాజా నుంచి సాధారణ జనానికి అనుమతి ఉండేది. మూసీపై నిర్మించిన పురానాపూల్‌ వంతెన ద్వారా వచ్చేవారు ఈ దర్వాజా నుంచే నగరంలోకి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండేది. 
2. చంపా దర్వాజా 
పురానాపూల్‌–దిల్లీ దర్వాజాల మధ్యలో ప్రస్తుతం పేట్లబురుజు ప్రాంతంలో ఉండేది. దీని ద్వారా కళాకారులు, పండితులు వెళ్లేవారు. 
3. దిల్లీ దర్వాజా 
నయాపూల్‌ సమీపంలో ఉండే ఈ దర్వాజా ద్వారా దిల్లీ రాజ్యం నుంచి వచ్చేవారికి, ఇక్కడి నుంచి దిల్లీ వెళ్లేవారికి, మంత్రులు, రాజవంశీకులు, రాయబారులకు అనుమతి ఉండేది. 
4. చాదర్‌ఘాట్‌ దర్వాజా 
హైదరాబాద్‌ సంస్థానం మొత్తంలో పండించే పంటలు,« ధాన్యం ఇతర వస్తువులను ఈ దర్వాజా ద్వారా తీసుకొని వచ్చేవారు.  
5.డబీర్‌పురా దర్వాజా 
దీని ద్వారా మిలటరీ, పోలీసు ఉన్నతాధికారులే వచ్చేవారు. ఇది పురానీ హవేలీకి దగ్గరగా ఉండేది. 
6.యాకుత్‌పురా దర్వాజా 
నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం నగరంలోకి వచ్చే వారి కోసం, విదేశీయులు, యాత్రికుల కోసం వినియోగించేవారు. 
7. కట్ట మీర్‌జుమ్లా దర్వాజా 
ఈ దర్వాజా తలాబ్‌ అంటే చెరువుకు నీటి కోసం వెళ్లే వారి కోసం ఉండేది. పురానా హవేలీలోని నిజాం నివాసానికి, ఉన్నతాధికారుల నివాసాలకు ఈ దర్వాజా ద్వారా ఏనుగులపై నీళ్లు తీసుకొని వచ్చే వారు. 
8. గౌలిపురా దర్వాజా 
దీని ద్వారా పశువులను నగరం బయటికి మేత కోసం తీసుకెళ్లి, తీసుకొచ్చే వారు. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఎక్కువగా యాదవులు ఉండడం గమనార్హం. 
9. లాల్‌ దర్వాజా 
హిందువుల పండుగలు, ఊరేగింపులు, ఇతర వేడుకలు, రథాల ఊరేగింపులు దీని ద్వారానే జరిగేవి. అందువల్లే ఈ దర్వాజా సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. 
10. ఆలియాబాద్‌ దర్వాజా 
జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ఉండేది. నగరంలో ఏర్పాటు చేసే సంతలకు వచ్చి సరుకులు విక్రయించుకునేవారు, ప్రజలు దీనిని వినియోగించేవారు. 
11. ఫతే దర్వాజా 
ఇది గోల్కొండ కోట నుంచి వచ్చే వారి కోసం ఉండేది. దీనిద్వారా రాజ కుటుంబీకులు, సుబేదారులు, సైనికులు రాకపోకలు సాగించేవారు. 
12. దూద్‌బౌలి దర్వాజా 
ఈ దర్వాజా చుట్టుపక్కల పెద్ద సంఖ్యలు గుళ్లు, దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో పూజలు చేసే అర్చకులు, పురోహితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేద పండితులు ఈ మార్గాన్ని వినియోగించేవారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement