షహర్‌కీ షాన్ తటాకాల నగరం
భాగ్యనగరం ఒకప్పుడు తటాకాల నగరంగా ఉండేది. ఎక్కడికక్కడ ఉద్యానవనాలతో విరాజిల్లేది. మండు వేసవిలోనూ ఎండల తీవ్రత ఎరుగని చల్లని నగరంగా ప్రజలను సేదదీర్చేది. కాకతీయుల కాలంలో వర్ధిల్లిన గొలుసుకట్టు చెరువుల పరిజ్ఞానాన్ని ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులూ అందిపుచ్చుకోవడంతో ఇది సాధ్యమైంది. అప్పట్లో ప్రస్తుతం భాగ్యనగరం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల యాభై మైళ్ల వ్యాసం పరిధిలో దాదాపు మూడున్నర వేలకు పైగా చెరువులు ఉండేవి.
వాటిని ఆసరా చేసుకుని వేలాది ఎకరాల్లో తోటలు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ నగరం వేసవి విడిదిగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు వేసవి తీవ్రతకు భగభగలాడిపోతున్నా, హైదరాబాద్ పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉండేవి. అప్పట్లో వేసవి కాలంలో చుట్టుపక్కల జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యేవి. చెరువులు, ఉద్యానవనాలు చాలా వరకు అంతరించడంతో ఇప్పుడీ వ్యత్యాసం 3-5 డిగ్రీలకు మించడం లేదు.
జలసిరులు.. శుభకార్యాలకు ఆనవాళ్లు
కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌కు ప్రాణం పోస్తే, నిజాం నవాబులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను తవ్వించారు. తాగునీటికి వనరులు పుష్కలంగా ఉన్నా, చెరువుల తవ్వకాన్ని ఆపలేదు. నవాబుల ఇంట శుభకార్యాలు జరిగినప్పుడు ఆ సందర్భాలకు గుర్తుగా చెరువును తవ్వించడం, వనాన్ని పెంచడం ఆనవాయితీగా ఉండేది. తర్వాతి కాలంలో చెరువులు అంతరించాయి. అప్పట్లో 3,750 చెరువులు ఉండగా, ఇప్పుడు 170 మాత్రమే మిగిలాయి. గుట్టల మధ్య వెలసిన భాగ్యనగరంలో అప్పటి నవాబులు గుట్టలపై వనాలను పెంచారు. ఇప్పటికీ వృక్షసంపద గణనీయంగానే ఉన్నందున సాయంత్రం కాగానే నగరం చల్లబడుతోంది.
వికారాబాద్‌కు చేరువలోని అనంతగిరి హిల్స్ ప్రభావం కూడా ఇక్కడి వాతావరణంపై ఉంది. మూసీనది పుట్టిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ హార్స్‌లీ హిల్స్‌గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతం నగరానికి చల్లగాలులు పంచుతోంది. ఇప్పటికీ జూపార్కు, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, హరిణ వనస్థలి, చిలుకూరు అభయారణ్యం, బొల్లారం, గోల్కొండ మిలటరీ స్థావరాలు దట్టమైన చెట్లతో నిండి ఉన్నందునే వేసవి తీవ్రత నుంచి కొంతవరకైనా రక్షణ లభిస్తోంది.