summer intensity
-
సమ్మర్.. కాస్త కూల్! ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదా పు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఉక్కపోత.. వీటికి తోడు వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా, గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. సగటున 2 డిగ్రీల సెల్సీయస్ నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39 డిగ్రీల సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 20.2 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా మరో రెండ్రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవొచ్చని సూచించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. -
గొంతెండుతోంది..!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఉషోగ్రతలు పెరిగిపోవడంతో గ్రామాలు, పట్టణాలు దాహంతో కేకలు వేస్తున్నాయి. దప్పికతో ప్రజల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, రక్షిత మంచినీటి పథకాలు విఫలమవడంతో తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాలు, తండాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చెలమల్లో, కుంటల్లో అపరిశుభ్ర నీరే దిక్కవడంతో ప్రజలు వ్యాధులబారినపడుతున్నారు. ఇక పట్టణాలు, నగరాల్లో తాగునీటిని సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేయడంతో దాహం తీరే దారి లేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వేసవి మరింత ముదరనున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మన్యంలో పరిస్థితి తీవ్రం శ్రీకాకుళం జిల్లాలో వేసవి తీవ్రతతో మంచినీటికి కటకటగా ఉంది. ఏజెన్సీలో గెడ్డలు ఎండిపోయి గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సీతంపేట అటవీ ప్రాంతంలో పలు గెడ్డలు అడుగంటాయి. ఎత్తయిన కొండలపై నివసిస్తున్న కొన్ని గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం గెడ్డలపై ఆధారపడతారు. వీరు నీరు కరువై అల్లాడుతున్నారు. విశాఖ మన్యంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రక్షిత మంచి నీటి పథకాలు అలంకారప్రాయంగా మిగలడంతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. పాడేరులో ఇటీవల నీరు కలుషితమై సుమారు 18 మంది డయేరియా బారినపడ్డారు. లంబసింగి, మేడూరు, అన్నవరంలో కూడా తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేయడం లేదు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక బృందాలతో సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ జున్నుల ప్రాంత గిరిజనులకు దశాబ్దాల తరబడి ఊటగెడ్డలే దిక్కు. డుంబ్రిగుడ మండలంలో దాహం కేకలతో గిరిజనులు అల్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎండలు ముదరకముందే తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పోతుమర్రు గ్రామ ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో 4000 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఏడు ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి చెరువు ఉంది. ఈ చెరువుకు గుడ్లవల్లేరు లాకుల నుంచి క్వాంప్‌బెల్ ఛానల్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇంకా నీటిని సరఫరా చేయలేదు. మరోవైపు తాగునీటి చెరువులో ఉప్పునీటి శాతం అధికంగా పెరిగిపోయింది. దీంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. రాయలసీమ క‘న్నీటి’ కష్టాలు దేశంలోనే కరువు జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో ఏటా కరువే. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరా మార్చి నాటికే బంద్ కాగా జనం సమీప ప్రాంతాల్లోని పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రభుత్వ స్కీమ్ బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో గుక్కెడునీటికి ప్రజలు గుటకలు వేయాల్సిన దుస్థితి. గ్రామాల్లో అరకొరగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసినప్పటికి అవి చాలక, ప్రజలు నీరు పట్టుకునే సమయంలో ఘర్షణ కూడా పడుతున్నారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం క్రిష్టిపాడులో దాదాపు 1,600 ఇళ్లు ఉన్నాయి. పక్కనే కుందూ నది ఉంది. నది నుంచి నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి గ్రామస్తులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం నది ఎండిపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు నదిలో చెలమలు తవ్వుకుని నీటిని పట్టుకుంటున్నారు. నీళ్ల కోసం పైపులను నోటిలో పెట్టుకొని పీల్చుతున్న మహిళలు గోదావరి చెంత.. తాగునీటికి చింత గోదావరి చెంతనే ఉన్న రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల రోజుకు ఒక్క పూట మాత్రమే నీటిని అందిస్తున్నారు. మామూలు రోజుల్లో 1 నుంచి 44వ డివిజన్ వరకూ రోజుకు రెండుసార్లు, 45వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకూ రోజుకు ఒక్కసారి నీటిని సరఫరా చేస్తారు. కానీ, ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో రోజుకు ఒక్కసారి నీటిని అందించడమే కష్టంగా ఉంది. నగర శివారు ప్రాంతాలైన 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్లలో కొన్నిసార్లు రోజులో ఒకసారి కూడా మంచినీటి సరఫరా జరగడం లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురంలో ట్యాంకర్ వద్ద గుమికూడి నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు పట్టణాల్లో దాహం కేకలు రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోవడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాల్లో జాప్యం, పెరిగిన విలీన గ్రామాల కారణంగా నీటిఎద్దడి రోజురోజుకీ పెరుగుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్‌లోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. 30 మున్సిపాల్టీల్లో రెండు రోజులకు ఒకసారి, 12 మున్సిపాల్టీల్లో నాలుగు రోజులకు ఒకసారి, 68 మున్సిపాల్టీల్లో రోజుకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో రాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాగునీటి సరఫరాకు కష్టాలెన్నో.. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 40 మున్సిపాల్టీల్లో అమృత్ పథకం పనులను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. వాస్తవానికి గత డిసెంబర్లోనే వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులు ఆలస్యం కావడంతో అ పథకాలేవీ అందుబాటులోకి రాలేదు. విలీన గ్రామాలు కలిగిన విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో కొత్తగా రక్షిత మంచినీటి పథకాలు నిర్మించలేదు. ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు కూడా పనిచేయడం లేదు. మున్సిపాల్టీల్లో 41,615 బోరుబావుల్లో 3 వేలు పూర్తిగా ఎండిపోయాయి. పాత పంపుసెట్లు, పంపిణీ పైపులైన్లు, వాల్వులు, మోటార్ల మరమ్మతులు, కొత్తవి కొనుగోలుకు ఈ ఏడాది ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. నీటి సరఫరాకు సంబంధించి సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిక్, కాపలాదారులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే అవకాశం కల్పించాలని అధికారులు పంపిన ప్రతిపాదనల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలోని దాదాపు 2,500 డివిజన్లలో రోజుకు ఒకసారి, 612 డివిజన్లలో రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. తిరుపతికి ఇబ్బందులు తప్పవా? చిత్తూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకొకసారి నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్లలో మరో 25–30 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. ఈ లోపు వర్షాలు పడకపోతే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. తిరుపతికి నీరు సరఫరా చేసే కల్యాణి డ్యామ్, కైలాసగిరి రిజర్వాయర్లలో నీరు దాదాపు అడుగంటింది. తిరుపతిలో నీటి సరఫరాపై అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్కడక్కడ నాలుగు, 7 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో గంట పాటు కూడా సరఫరా చేయడంలేదు. నీటి కొరతతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్లో మూడు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఐదారు రోజులకు ఒకసారి సరఫరా జరుగుతోంది. మచిలీపట్నం మున్సిపాల్టీ, గుంటూరు కార్పొరేషన్లలోని శివారు ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలను నాలుగేళ్లగా నీటిఎద్దడి సమస్య వెంటాడుతోంది. పట్టణానికి నీటిని సరఫరా చేసే సింగరకొండ చెరువులో నీటిమట్టం పడిపోవడంతో నాలుగు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. మరో పదిరోజుల్లో చెరువుల్లోని నీటిమట్టం పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొంది. గతేడాది వినుకొండ పట్టణ ప్రజలు ఒక్కో ట్యాంకరు నీటిని రూ.500 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగరాల్లో నీటికొరతతోప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ట్యాంకరు నీరు కావాలంటే రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. వివాహాలు, రిసెప్షన్లకు ట్యాంకర్ నీటిని రూ.1000 వరకు అమ్ముతున్నారు. దుకాణాన్ని మూయాల్సి వస్తోంది మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట. చిన్నపాటి దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కొద్దిరోజులుగా మున్సిపాలిటీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ట్యాంకర్ల వద్ద నీరు పట్టుకునేందుకు దుకాణాన్ని మూసివేసి పడిగాపులు కాసి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. – ఎస్కే నిజాం, నాయుడుపేట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోర్ల నుంచి తెచ్చుకుంటున్నాం మాది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కల్లూరివారిపాలెం. ఊళ్లో నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కుళాయిలు, చేతిపంపుల్లో సరిగా నీళ్లు రాకపోవడంతో గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. పక్క గ్రామాలకు వెళ్లి 20 లీటర్ల నీటిని రూ.10కి కొనుగోలు చేస్తున్నాం. – ఈశ్వరమ్మ, కల్లూరివారిపాలెం, ప్రకాశం జిల్లా మంచినీటికి ఇబ్బంది పడుతున్నాం రాజమహేంద్రవరంలో రోజుకు ఒక్క పూటే మంచినీటిని వదులుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిన అవసరాల కోసం దూరం వెళ్లి బిందెలతో నీటిని పట్టుకొని వస్తున్నాం. – గొప్పిశెట్టి విజయ, రాజమహేంద్రవరం ఈమె పేరు.. సోనీ. ఊరు.. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు తండా. కుళాయి నీరు అప్పుడప్పుడు మాత్రమే వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని వాపోతోంది. పంపుల్లో వచ్చే నీళ్లు చాలక పొలాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి మంచినీరు తెచ్చుకుంటున్నామని చెబుతోంది. ట్యాంకు నుంచి వచ్చే నీళ్లు తాగితే కీళ్లనొప్పులొస్తున్నాయని, కిడ్నీ వ్యాధులతో తండాలో చాలామంది మంచాన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతోంది. ఈయన పేరు గౌడపేర ఏసోబు. ఊరు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముక్తేశ్వరం. తమ గ్రామానికి పది రోజులకొకసారి మాత్రమే మంచినీరు వస్తోందని వాపోతున్నాడు. ఉన్న ఒక్క చేతిపంపు కూడా భూగర్భ జలాలు అడుగంటి సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నాడు. పశువులకు తాపడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నాడు. -
హరీతహారం!
♦ ఎక్కడికక్కడే ఎండిపోయిన మొక్కలు ♦ జిల్లాలో నాటిన మొక్కలు 50 లక్షలు ♦ అందులో బతికింది పది శాతం మాత్రమే ♦ తీవ్ర వర్షాభావం, ఎండల తీవ్రతే కారణం ♦ రూ.3.59 కోట్ల నిధులు నిరుపయోగం ♦ ఈ యేడు హరితహారం లక్ష్యం సగమే జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నాటిన 50 లక్షల వృక్షజాతుల్లో కేవలం 5.12 లక్షలు మాత్రమే ఎదిగాయి. అంటే నాటిన మొక్కల్లో కేవలం పదిశాతమే బతికాయన్నమాట. హరితహారం కింద నాటే ప్రతి మొక్క సంరక్షణకు రూ.8 కేటాయించారు. డ్వామా నాటిన 4.48 లక్షల మొక్కలు బతకలేదు. దీంతో వీటిపై వెచ్చించిన రూ.3.59 కోట్లు వృథా అయ్యాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ లక్ష్యం ‘మోడు’వారిపోయింది. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటడం ద్వారా హరిత తోరణానికి నాంది పలకాలనే సర్కారు సంకల్పానికి వరుణుడు గండికొట్టాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య నాటిన మొక్కలు చిగురించకపోగా.. బతికిన కొన్ని మొక్కలకూ ఊపిరిలూదాలనే ప్రయత్నానికి ప్రచండ ఎండలు ప్రతిబంధకంగా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా గతేడాది 2.34 కోట్ల మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించిన అటవీ, డ్వామా, ఉద్యానశాఖలు.. సకాలంలో వర్షాలు కురవకపోడంతో అందులో సగం మొక్కలను నాటలేదు. ఈ నేపథ్యంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) నాటిన 50 లక్షల వృక్షజాతుల్లో కేవలం 5.12 లక్షలు మాత్రమే ఎదిగాయి. అంటే నాటిన మొక్కల్లో కేవలం పదిశాతమే బతికాయన్నమాట. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు మొక్కలు నాటాలని.. హరితవిరులు కురిపించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని అందిపుచ్చుకున్న జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో హరితహారం కోసం నిర్దేశించిన మొక్కలు వననర్సరీల్లోనే పెరిగి పెద్దవి కావడమో.. ఆఖరికి నీటి కొరతతో ఎండిపోవడమో జరిగిపోయింది. రూ.3.59 కోట్లు వృధా! జిల్లా వైశాల్యం 7.49 లక్షల హెకార్లు. అందులో 9.75 % మాత్రమే అట వీ విస్తీర్ణం ఉంది. అటవీ ప్రాంతం వెలుపల సుమారు 3.45% చెట్లు ఉన్నాయి. అంటే జిల్లాలో 14.50 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నమాట. జిల్లా భూభాగంలో 33.33 శాతం ఉద్యానం కావాలంటే మిగతా 19శాతం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 7వేల హెక్టార్లలో మొక్కలు నాటాలని భావించి.. 315 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆర్అండ్బీ రోడ్లకిరువైపులా ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. 2,982 కి.మీ. మేర పంచాయతీరాజ్ మార్గాలు, 60 కి.మీ. మున్సిపల్ రహదారులు ఇలా ప్రతి దారికి రెండువైపులా పచ్చదనం విరిసేలా ప్రణాళికలు తయారు చే సింది. ఈ మేరకు హరితహారం కింద 2.34 కోట్ల మొక్కల (26 వృక్ష జాతులు)కు ప్రాణం పోయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు హరితహారం కింద నాటే ప్రతి మొక్క సంరక్షణకు రూ.8 కేటాయించింది. అయితే, డ్వామా నాటిన మొక్కల్లో 4.48 లక్షల మొక్కలు బతకలేదు. దీంతో ఈ మొక్కలపై వెచ్చించిన రూ.3.59 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని బతికిన మొక్కల్లోనూ అధికశాతం టేకు మొక్కలే ఉన్నాయి. లక్ష్యం సగానికి కుదింపు గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి హరితహారం లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించింది. ఈయేడాది 23 లక్షల మొక్కలు మాత్రమే నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు నీటి ఎద్దడిని తట్టుకోగలిగిన మొక్కలను వృద్ధి చేస్తోంది. వచ్చే సీజన్లో నాటేందుకు గల మొక్కల డిమాండ్‌ను గ్రామాలవారీగా సేకరించాలని ఎంపీడీఓలను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. మే నెలలో డిమాండ్‌కు తగ్గట్టుగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. -
మార్చిలోనే మంటలు
పెరుగుతున్న ఎండ తీవ్రత.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. శనివారం నిజామాబాద్‌లో అధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో మెదక్, ఆదిలాబాద్, భద్రాచలం పట్టణాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ పట్టణాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 39.2 డిగ్రీలు, రామగుండంలో 39, హన్మకొండలో 38 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 39, నల్లగొండ, ఖమ్మంలో 37 డి గ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి నుంచి వారానికి ఒక డిగ్రీ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ ప్రకారం గతంలో కంటే ఈ ఏడాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఎల్‌నినో కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయని, అయితే ఇప్పుడే దీన్ని నిర్ధారించలేమన్నారు. ఎండల తీవ్రత వల్ల రానున్న మూడు నెలల్లో అప్పుడప్పుడు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో మార్చి నెలలో అధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు -
తేలని లెక్క
వైద్య ఆరోగ్యశాఖ వద్ద నమోదైన వడదెబ్బ మృతుల సంఖ్య 156 అధికారికంగా భావిస్తున్నది తొమ్మిది మందే వాస్తవాల పరిశీలనకు మండల స్థాయిలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు సమాచార నివేదికలో జాప్యం.. అధికారుల చర్యలు శూన్యం? వేసవితీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకూ గడచిన వారం రోజులుగా వడదెబ్బతో మృత్యువాతపడుతున్నారు. వీటిని పేర్లతో సహా పత్రికలు ప్రచురిస్తున్నాయి. కానీ అధికారులు మార్గదర్శకాలంటూ మళ్లీ వడబోత మొదలెట్టారు. వందల్లో మృతులున్నా... అధికారిక లెక్కల్లో కనీసం పదికూడా దాటకపోవడం దారుణం. శ్రీకాకుళం సిటీ : జిల్లాలో ఈ ఏడాది మండువేసవివల్ల ఎండలు పెరిగాయి... ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. వేసవి తాపంతో వడదెబ్బవల్ల ప్రతి మండలంలోనూ రోజూ మృత్యువాతపడుతున్నారు. గత వారం రోజులుగా ఈ సంఖ్య రోజూ పెరుగుతూనే వస్తోంది. ఈ విషయాలు పేర్లతో సహా పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. కానీ కచ్చితమైన జాబితాను అధికారులు రూపొందించడంలో విఫలమయ్యారు. కలెక్టర్ ఆదేశాలన సైతం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. వైద్య ఆరోగ్యశాఖ గుర్తించినది 156 మంది ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద లభించిన సమాచారం ప్రకారం 156 మంది వరకు వడదెబ్బ మృతులు ఉన్నారు. వీరిలో 17 ఏళ్లలోపు వారు నలుగురు, 18 నుంచి 68 ఏళ్ల వయసు వారు 100 మంది, 69 సంవత్సరాలు పైబడిన వారు 52 మంది ఉన్నట్లు నమోదైంది. ఇది గత నెల 6వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నమోదు చేసింది. అధికారికంగా వడదెబ్బ మృతులు తొమ్మిది మందే .. అధికారికంగా ఇప్పటివరకూ తొమ్మిది మందే వడదెబ్బ వల్ల మృత్యువాత పడిన ట్టు పేర్కొంటున్నారు. జి.గౌరీసు(56, బడగ, మెళియాపుట్టి మండలం), కె.లక్ష్మణరావు(28, కోటబొమ్మాళి), వి.దానేసు(68, సింగుపురం, శ్రీకాకుళం మండలం), బి.లక్ష్మీనారాయణ(64, పెనుబాక, రాజాం మండలం), పి నారాయణమ్మ(74, రెడ్డిపేట, రేగిడి ఆమదాలవలస), పి సాయమ్మ(50, కె.వేణుగోపాలవలస, సీతంపేట మండలం), ఎ.గెడ్డయ్య(54, గుమ్మపాడు, సారవకోట మండలం), ఐ.లింగరాజు(59, కర్టాలిపాలెం, సోంపేట మండలం), హిరమండలం కె రోగోలు వాసి జి.లక్ష్ముడు(65, కె.రాగోలు, హిరమండలం మండలం) మృతుల జాబితాలో ఉన్నారు. మృతుల నిర్ధారణకు త్రిసభ్యకమిటీ వడదెబ్బ మృతులను నిర్ధారించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మండలస్థాయిలో తహశీల్దార్, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్ధాయిలో ఉండే వైద్యాధికారి ఇందులో ఉంటారు. వీరికి అవసరం అనుకుంటే ప్రత్యేక పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మృతుల నిర్ధారణలో జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు నిజమైన వడదెబ్బ మృతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. వడదెబ్బవల్ల మృతి చెందిన వ్యక్తికి సంబంధించి పంచనామా రిపోర్టు, ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధివిధానాల ప్రకారం మండలాల స్థాయిలో త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. అంతేగాకుండా వడదెబ్బ నివారణకు తీసుకోవల్సిన చర్యలు-వాటి లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా సూచించారు. సీహెచ్‌సీ, పీహెచ్సీ, సబ్‌సెంటర్, ఉపకేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో అత్యవసర సమయాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్స్ వివరాలు, వారి ఫోన్ నంబర్లు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. కానీ వాటిని సిబ్బంది పాటించిన దాఖలాలు లేవు. కనీసం మృతుల నిర్థారణలోనైనా కచ్చితంగా వ్యవహరించి అందరికీ న్యాయం జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పవర్ తెగవాడేశారు
- నగరంలో రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం - సగటున 2 మిలియన్ యూనిట్ల వాడకం - వేసవి తీవ్రతతో 4 మిలియన్ యూనిట్లు దాటిన వైనం - ఈనెల 26న రికార్డు స్థాయిలో 4.434 మిలియన్ యూనిట్లు ఖర్చు సాక్షి, విజయవాడ : నగరంలో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ కోటాకు మించి రెట్టింపు స్థాయిలో ప్రజలు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రోజు రోజుకూ పెరిగిన ఎండ తీవ్రతకు పోటీగా విద్యుత్ ఖర్చయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ నిరంతర సరఫరాకు తంటాలు పడుతోంది. వారం నుంచి రోజుకు 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది. ఈ నెల 26వ తేదీన డిస్కం చరిత్రలో అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను నగరవాసులు వినియోగించారు. నగరంలో సగటున రోజూ రెండు నుంచి 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతుంది. సాధారణంగా ఏడాది పొడవునా ఇలానే ఉన్నా వేసవిలో మాత్రం 3 నుంచి 3.5 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతుంది. అయితే విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారడం, దీనికి తోడు నగరానికి వచ్చి వెళ్లే వారి సంఖ్య పెరగడం, ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా షాపింగ్ మాల్స్ ఏర్పాటవడంతో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో రోజూ సుమారు రెండు లక్షల ఏసీలు పని చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో విద్యుత్ వాడకం పెరిగి అనేక ప్రాంతాల్లోని ప్రధాన ఫీడర్లపై ఓవర్‌లోడ్ పడుతోంది. నగరంలో సుమారు 2.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 33 కేవీ, 11కేవీ ఫీడర్ల ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుం టారు. ఈ క్రమంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలో 3, గుణదల సబ్‌డివిజన్ పరిధిలో మరో 3 సబ్స్టేషన్ల పరిధిలో ఓవర్‌లోడ్ అధికంగా ఉంది. అయితే ఈ వేసవికి ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఫీడర్లపై మార్పులు చేసి వోల్టేజ్ సమస్య రాకుండా నియంత్రించగలుగుతున్నారు. నగరంలో 11 కేవీ ఫీడర్లు 176 ఉన్నాయి. వీటిలో 18 ఫీడర్లకు నిత్యం ఓవర్‌లోడ్ సమస్య ఎదురవుతోంది. వచ్చే నెల 15వ తేదీ వరకు విద్యుత్ వినియోగం అధికంగానే ఉంటుందని అధికారులు నిర్ధారించి ఆమేరకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కోటాను కూడా వేసవి వరకు కొంత పెంచుకునే యోచనలో విద్యుత్ అధికారులు ఉన్నారు. వచ్చే నెల రెండో వారం నాటికి నగరంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఏర్పాటు కానున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం మరితం అధికమవుతుంది. ఈ నెల 26వ తేదీన డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 4.434 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. 27న 4.373 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అంతకు ముందు వారం రోజుల పాటు సగటున 3.75 మిలియన్ యూనిట్ల నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వాడకం జరిగింది. -
షహర్‌కీ షాన్ తటాకాల నగరం
భాగ్యనగరం ఒకప్పుడు తటాకాల నగరంగా ఉండేది. ఎక్కడికక్కడ ఉద్యానవనాలతో విరాజిల్లేది. మండు వేసవిలోనూ ఎండల తీవ్రత ఎరుగని చల్లని నగరంగా ప్రజలను సేదదీర్చేది. కాకతీయుల కాలంలో వర్ధిల్లిన గొలుసుకట్టు చెరువుల పరిజ్ఞానాన్ని ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులూ అందిపుచ్చుకోవడంతో ఇది సాధ్యమైంది. అప్పట్లో ప్రస్తుతం భాగ్యనగరం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల యాభై మైళ్ల వ్యాసం పరిధిలో దాదాపు మూడున్నర వేలకు పైగా చెరువులు ఉండేవి. వాటిని ఆసరా చేసుకుని వేలాది ఎకరాల్లో తోటలు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ నగరం వేసవి విడిదిగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు వేసవి తీవ్రతకు భగభగలాడిపోతున్నా, హైదరాబాద్ పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉండేవి. అప్పట్లో వేసవి కాలంలో చుట్టుపక్కల జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యేవి. చెరువులు, ఉద్యానవనాలు చాలా వరకు అంతరించడంతో ఇప్పుడీ వ్యత్యాసం 3-5 డిగ్రీలకు మించడం లేదు. జలసిరులు.. శుభకార్యాలకు ఆనవాళ్లు కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌కు ప్రాణం పోస్తే, నిజాం నవాబులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను తవ్వించారు. తాగునీటికి వనరులు పుష్కలంగా ఉన్నా, చెరువుల తవ్వకాన్ని ఆపలేదు. నవాబుల ఇంట శుభకార్యాలు జరిగినప్పుడు ఆ సందర్భాలకు గుర్తుగా చెరువును తవ్వించడం, వనాన్ని పెంచడం ఆనవాయితీగా ఉండేది. తర్వాతి కాలంలో చెరువులు అంతరించాయి. అప్పట్లో 3,750 చెరువులు ఉండగా, ఇప్పుడు 170 మాత్రమే మిగిలాయి. గుట్టల మధ్య వెలసిన భాగ్యనగరంలో అప్పటి నవాబులు గుట్టలపై వనాలను పెంచారు. ఇప్పటికీ వృక్షసంపద గణనీయంగానే ఉన్నందున సాయంత్రం కాగానే నగరం చల్లబడుతోంది. వికారాబాద్‌కు చేరువలోని అనంతగిరి హిల్స్ ప్రభావం కూడా ఇక్కడి వాతావరణంపై ఉంది. మూసీనది పుట్టిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ హార్స్లీ హిల్స్‌గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతం నగరానికి చల్లగాలులు పంచుతోంది. ఇప్పటికీ జూపార్కు, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, హరిణ వనస్థలి, చిలుకూరు అభయారణ్యం, బొల్లారం, గోల్కొండ మిలటరీ స్థావరాలు దట్టమైన చెట్లతో నిండి ఉన్నందునే వేసవి తీవ్రత నుంచి కొంతవరకైనా రక్షణ లభిస్తోంది.