హరీతహారం!
♦ ఎక్కడికక్కడే ఎండిపోయిన మొక్కలు
♦ జిల్లాలో నాటిన మొక్కలు 50 లక్షలు
♦ అందులో బతికింది పది శాతం మాత్రమే
♦ తీవ్ర వర్షాభావం, ఎండల తీవ్రతే కారణం
♦ రూ.3.59 కోట్ల నిధులు నిరుపయోగం
♦ ఈ యేడు హరితహారం లక్ష్యం సగమే
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నాటిన 50 లక్షల వృక్షజాతుల్లో కేవలం 5.12 లక్షలు మాత్రమే ఎదిగాయి. అంటే నాటిన మొక్కల్లో కేవలం పదిశాతమే బతికాయన్నమాట.
హరితహారం కింద నాటే ప్రతి మొక్క సంరక్షణకు రూ.8 కేటాయించారు. డ్వామా నాటిన 4.48 లక్షల మొక్కలు బతకలేదు. దీంతో వీటిపై వెచ్చించిన రూ.3.59 కోట్లు వృథా అయ్యాయి.
ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ లక్ష్యం ‘మోడు’వారిపోయింది. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటడం ద్వారా హరిత తోరణానికి నాంది పలకాలనే సర్కారు సంకల్పానికి వరుణుడు గండికొట్టాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య నాటిన మొక్కలు చిగురించకపోగా.. బతికిన కొన్ని మొక్కలకూ ఊపిరిలూదాలనే ప్రయత్నానికి ప్రచండ ఎండలు ప్రతిబంధకంగా మారాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా గతేడాది 2.34 కోట్ల మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించిన అటవీ, డ్వామా, ఉద్యానశాఖలు.. సకాలంలో వర్షాలు కురవకపోడంతో అందులో సగం మొక్కలను నాటలేదు. ఈ నేపథ్యంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) నాటిన 50 లక్షల వృక్షజాతుల్లో కేవలం 5.12 లక్షలు మాత్రమే ఎదిగాయి. అంటే నాటిన మొక్కల్లో కేవలం పదిశాతమే బతికాయన్నమాట. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు మొక్కలు నాటాలని.. హరితవిరులు కురిపించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని అందిపుచ్చుకున్న జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో హరితహారం కోసం నిర్దేశించిన మొక్కలు వననర్సరీల్లోనే పెరిగి పెద్దవి కావడమో.. ఆఖరికి నీటి కొరతతో ఎండిపోవడమో జరిగిపోయింది.
రూ.3.59 కోట్లు వృధా!
జిల్లా వైశాల్యం 7.49 లక్షల హెకార్లు. అందులో 9.75 % మాత్రమే అట వీ విస్తీర్ణం ఉంది. అటవీ ప్రాంతం వెలుపల సుమారు 3.45% చెట్లు ఉన్నాయి. అంటే జిల్లాలో 14.50 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నమాట. జిల్లా భూభాగంలో 33.33 శాతం ఉద్యానం కావాలంటే మిగతా 19శాతం ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 7వేల హెక్టార్లలో మొక్కలు నాటాలని భావించి.. 315 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకిరువైపులా ఈ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
2,982 కి.మీ. మేర పంచాయతీరాజ్ మార్గాలు, 60 కి.మీ. మున్సిపల్ రహదారులు ఇలా ప్రతి దారికి రెండువైపులా పచ్చదనం విరిసేలా ప్రణాళికలు తయారు చే సింది. ఈ మేరకు హరితహారం కింద 2.34 కోట్ల మొక్కల (26 వృక్ష జాతులు)కు ప్రాణం పోయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు హరితహారం కింద నాటే ప్రతి మొక్క సంరక్షణకు రూ.8 కేటాయించింది. అయితే, డ్వామా నాటిన మొక్కల్లో 4.48 లక్షల మొక్కలు బతకలేదు. దీంతో ఈ మొక్కలపై వెచ్చించిన రూ.3.59 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని బతికిన మొక్కల్లోనూ అధికశాతం టేకు మొక్కలే ఉన్నాయి.
లక్ష్యం సగానికి కుదింపు
గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి హరితహారం లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించింది. ఈయేడాది 23 లక్షల మొక్కలు మాత్రమే నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. ఈ మేరకు నీటి ఎద్దడిని తట్టుకోగలిగిన మొక్కలను వృద్ధి చేస్తోంది. వచ్చే సీజన్‌లో నాటేందుకు గల మొక్కల డిమాండ్‌ను గ్రామాలవారీగా సేకరించాలని ఎంపీడీఓలను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. మే నెలలో డిమాండ్‌కు తగ్గట్టుగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది.