వైద్య ఆరోగ్యశాఖ వద్ద నమోదైన వడదెబ్బ మృతుల సంఖ్య 156
అధికారికంగా భావిస్తున్నది తొమ్మిది మందే
వాస్తవాల పరిశీలనకు మండల స్థాయిలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు
సమాచార నివేదికలో జాప్యం.. అధికారుల చర్యలు శూన్యం?
వేసవితీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకూ గడచిన వారం రోజులుగా వడదెబ్బతో మృత్యువాతపడుతున్నారు. వీటిని పేర్లతో సహా పత్రికలు ప్రచురిస్తున్నాయి. కానీ అధికారులు మార్గదర్శకాలంటూ మళ్లీ వడబోత మొదలెట్టారు. వందల్లో మృతులున్నా... అధికారిక లెక్కల్లో కనీసం పదికూడా దాటకపోవడం దారుణం.
శ్రీకాకుళం సిటీ : జిల్లాలో ఈ ఏడాది మండువేసవివల్ల ఎండలు పెరిగాయి... ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. వేసవి తాపంతో వడదెబ్బవల్ల ప్రతి మండలంలోనూ రోజూ మృత్యువాతపడుతున్నారు. గత వారం రోజులుగా ఈ సంఖ్య రోజూ పెరుగుతూనే వస్తోంది. ఈ విషయాలు పేర్లతో సహా పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి. కానీ కచ్చితమైన జాబితాను అధికారులు రూపొందించడంలో విఫలమయ్యారు. కలెక్టర్ ఆదేశాలన సైతం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
వైద్య ఆరోగ్యశాఖ గుర్తించినది 156 మంది
ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద లభించిన సమాచారం ప్రకారం 156 మంది వరకు వడదెబ్బ మృతులు ఉన్నారు. వీరిలో 17 ఏళ్లలోపు వారు నలుగురు, 18 నుంచి 68 ఏళ్ల వయసు వారు 100 మంది, 69 సంవత్సరాలు పైబడిన వారు 52 మంది ఉన్నట్లు నమోదైంది. ఇది గత నెల 6వ తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నమోదు చేసింది.
అధికారికంగా వడదెబ్బ మృతులు తొమ్మిది మందే ..
అధికారికంగా ఇప్పటివరకూ తొమ్మిది మందే వడదెబ్బ వల్ల మృత్యువాత పడిన ట్టు పేర్కొంటున్నారు. జి.గౌరీసు(56, బడగ, మెళియాపుట్టి మండలం), కె.లక్ష్మణరావు(28, కోటబొమ్మాళి), వి.దానేసు(68, సింగుపురం, శ్రీకాకుళం మండలం), బి.లక్ష్మీనారాయణ(64, పెనుబాక, రాజాం మండలం), పి నారాయణమ్మ(74, రెడ్డిపేట, రేగిడి ఆమదాలవలస), పి సాయమ్మ(50, కె.వేణుగోపాలవలస, సీతంపేట మండలం), ఎ.గెడ్డయ్య(54, గుమ్మపాడు, సారవకోట మండలం), ఐ.లింగరాజు(59, కర్టాలిపాలెం, సోంపేట మండలం), హిరమండలం కె రోగోలు వాసి జి.లక్ష్ముడు(65, కె.రాగోలు, హిరమండలం మండలం) మృతుల జాబితాలో ఉన్నారు.
మృతుల నిర్ధారణకు త్రిసభ్యకమిటీ
వడదెబ్బ మృతులను నిర్ధారించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మండలస్థాయిలో తహశీల్దార్, సబ్‌ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్ధాయిలో ఉండే వైద్యాధికారి ఇందులో ఉంటారు. వీరికి అవసరం అనుకుంటే ప్రత్యేక పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మృతుల నిర్ధారణలో జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు నిజమైన వడదెబ్బ మృతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
వడదెబ్బవల్ల మృతి చెందిన వ్యక్తికి సంబంధించి పంచనామా రిపోర్టు, ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధివిధానాల ప్రకారం మండలాల స్థాయిలో త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. అంతేగాకుండా వడదెబ్బ నివారణకు తీసుకోవల్సిన చర్యలు-వాటి లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా సూచించారు.
సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్, ఉపకేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో అత్యవసర సమయాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్స్ వివరాలు, వారి ఫోన్ నంబర్‌లు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. కానీ వాటిని సిబ్బంది పాటించిన దాఖలాలు లేవు. కనీసం మృతుల నిర్థారణలోనైనా కచ్చితంగా వ్యవహరించి అందరికీ న్యాయం జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తేలని లెక్క
Published Fri, May 29 2015 5:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement