సాగర్‌లో వినాయకుడు | Krishnudu to support sakshi Cityplus and speaks about Vinayaka statues | Sakshi
Sakshi News home page

సాగర్‌లో వినాయకుడు

Published Sun, Sep 7 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

సాగర్‌లో వినాయకుడు

సాగర్‌లో వినాయకుడు

నగరంలో ఒకప్పుడు తళతళ మెరిసిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. నిత్యం వచ్చి పడే చెత్తా చెదారానికి తోడు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వేలాది వినాయక విగ్రహాలు ఏటా సాగర్‌లో వచ్చి పడుతున్నాయి. బొజ్జగణపయ్యకు హంగులద్దిన కెమికల్ రంగులు స్వచ్ఛమైన నీటి రంగు మార్చేశాయి. మానవ తప్పిదాలన్నీ మన సాగరాన్ని మురికి తటాకంలా మార్చేస్తున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌ను కాపాడుతుంటారు కొందరు కార్మికులు. నిత్యం టన్నుల కొద్దీ చెత్తను వెలికి తీస్తున్నారు. నిమజ్జనం రోజు.. వేలాది విగ్రహాలను ఒంటి చేత్తో బయటకు తీస్తున్నారు. సాగర్ కంపులో చిక్కుకున్న  గౌరీసుతుడ్ని కాపాడేందుకు వచ్చిన ప్రమధగణాలు వీళ్లు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లు లేకపోతే సాగర్ ఇంకెంత ఉప‘ద్రవం’గా మారిపోయేదో! తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సాగర్ ప్రక్షాళనకు నడుం బిగించినవారిలో కొందరిని ‘సిటీ ప్లస్’ తరఫున హీరో కృష్ణుడు ‘స్టార్ రిపోర్టర్’ రూపంలో పలకరించారు.
 - రిపోర్టర్ కృష్ణుడు
 
 కృష్ణుడు: రోజుకి ఎన్ని విగ్రహాలు పడతయి భయ్యా?
 రామచందర్: ఇన్నని ఏం చెబుతాం సార్. వేల విగ్రహాలు పడుతుంటాయి సార్. పోలీసులేమో 1,500 పెద్ద విగ్రహాలు అని చెప్తరు. కానీ వాటికి రెండు మూడు రెట్లు నిమజ్జనం అయితయి. చిన్నాపెద్దా విగ్రహాలు కలసి ఈ 11 రోజుల్లో ఓ ల క్ష వరకు పడతయి.
 కృష్ణుడు: విగ్రహాలను, మిగతా చెత్తను తొలగించడానికి ఎంత మంది పని చేస్తున్నారు ?
 నాగేష్: నిమజ్జనం టైం కదా సార్. వంద మందిమి ఉంటం.
 కృష్ణుడు: ఇప్పుడు రోజుకి ఎన్ని విగ్రహాలు బయటికి తీస్తున్నారు?
 రాజు: విగ్రహాలు, పత్రి, మిగతా చెత్త అంతా కలిపి పది నుంచి పదిహేను లారీల వరకూ ఉంటది. పెద్ద నిమజ్జనం రోజైతే దానికి డబుల్ ఉంటది.
 కృష్ణుడు: నిమజ్జనం చేసిన విగ్రహాల సంగతేంటి?
 రామచందర్: విగ్రహాలన్నీ తీసేస్తం. చిన్న విగ్రహాలను ఉన్నవున్నట్టు లారీలకెక్కిస్తం. పెద్దవయితే ముక్కలు చేసి తీస్తం.
 నాగేష్: ఖైరతాబాద్ వినాయకుడ్ని బయటికి తీసే సరికి మాకు చుక్కలు కనిపిస్తయ్! విగ్రహం లోపల పెట్టిన పీచు బాగా నానిపోతుంది. దాన్ని బయటకు తీసే సరికి చేతులన్నీ ఒరిసిపోతయి.
 కృష్ణుడు: విగ్రహాల సంగతి అటుంచండి.. మిగిలిన చెత్త ఎలా బయటకు తీస్తారు ?
 సాగర్: పదేళ్లుగా ఈ పనే చేస్తున్నం సార్. ఒకప్పుడు చెత్తని చేతులతో తీసేవాళ్లం. రెండేళ్ల కిందట క్లీన్ చేసే మిషన్లు వచ్చినయ్.
 పొక్లైన్‌లా ఉంటది. నీళ్ల నుంచి చెత్త తీసి ఒడ్డు వరకు తెస్తరు. దాన్ని మేం లారీల్లో లోడ్ చేస్తం. దగ్గర్లోని డంపింగ్ యార్డ్‌కు పంపిస్తరు.
 కృష్ణుడు: ఎంత మిషన్‌ని ఉపయోగించినా.. ఈ పని వల్ల మీకు
 ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా..!
 నాగేష్ : నిజమే సార్. ఎలర్జీలు వస్తయి. వానాకాలంలో అందులోనూ.. వర్షం బాగా వచ్చిన రోజుల్లో ఒకేసారి వందల టన్నుల చెత్త కొట్టుకొస్తది. అప్పటి వరకు నాలాల్లో ఉన్న చెత్తాచెదారమంతా బయటకు వస్తుంది. ఆ టైంలో మేం ముందూవెనుక చూడకుండా క్లీనింగ్‌లో మునిగిపోతం. పనికి తోడు కంపు. అప్పుడప్పుడు దవాఖానాకు పోతనే ఉంటం.
 రామచందర్: హుడావారి పుణ్యాన ఇప్పుడు కాస్త నయం. నాలుగైదేళ్ల కిందట ఇంకా దారుణంగా ఉండేది. ఏ రోజుకారోజు క్లీనింగ్ చేయవట్టి ఈ మాత్రమైనా ప్రశాంతంగా ఉంది.
 కృష్ణుడు:  ఇంకా దుర్వాసన వస్తుంది క దా !
 నాగేష్: అప్పటితో పోల్చుకుంటే ఇదెంత.
 రామచందర్: సిగరెట్ వాసన తాగేటోడికి రాదు, కానీ పీల్చేటోడికి వస్తది. అట్లనే మేం పొద్దంతా ఇక్కడే ఉండి పని చేస్తం కదా.. అందుకే మాకీ వాసన అంతగా అనిపించదు. కొత్తోళ్లు ఎవ్వరొచ్చినా ముక్కుకు బట్ట అడ్డం పెట్టుకుంటరు.
 కృష్ణుడు: భాగ్యనగరానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హుస్సేన్‌సాగర్‌కి వచ్చి ముక్కకు కర్చీఫ్  అడ్డం పెట్టుకునే పరిస్థితికి కారణం ఎవరంటారు? మనమే కదా! కెమికల్ కలర్స్ వాడిన విగ్రహాలు, చెత్తాచెదారం కారణంగా సాగర్ కలుషితమైపోతోందని నెత్తి, నోరు బాదుకున్నా.. ఎవరూ వినడం లేదు.
 రాజు: అవును సార్. వాటితో పాటు తెచ్చే పత్రి వల్ల నీరంతా పాడైతది.
 కృష్ణుడు: కొన్ని వేల ప్లాస్టిక్ కవర్లని ఇందులో వేస్తున్నారు. వాటివల్ల నీరు మరింత కలుషితమవుతుంది. నేను హైదరాబాద్ వచ్చి 30 ఏళ్లు దాటింది. అప్పట్లో హుస్సేన్‌సాగర్ చాలా బాగుండేది. రోజూ సాయంత్రం మా అమ్మానాన్నలతో వచ్చి సరదాగా గడిపేవాడ్ని. ఈ చెత్త, దుర్వాసన అప్పడు లేవు.
 మహేందర్: అవును సార్. అప్పట్లో ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉండేవి. మళ్లీ అలాంటి సాగర్‌ని చూడాలంటే చాలా కష్టం.
 కృష్ణుడు: ఆ సమస్యకు పరిష్కారంగా చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మార్పు మనలో రావాలి. ఈ సాగర్ మనది అనే ఫీలింగ్ వస్తే.. దీని శుభ్రత గురించి ఆలోచిస్తాం.
 మహేందర్: మన ఇంటిని ఎలా చూసుకుంటామో.. సాగర్ గురించి కూడా అట్లనే ఆలోచించాలి. వినాయకుడితో పాటు బస్తాలు బస్తాలు పత్రి వేస్తరు. దాన్ని పైననే ఉంచమంటే ఊకోరు. గొడవపడతారు.
 రామచందర్: చాలా మంది తాగొస్తరు. మర్యాదగా వద్దని చెప్పినా వినరు. ఒకసారి విగ్రహంతో పది బస్తల నిండా పత్రి పట్టుకొచ్చిండ్రు. దాన్ని పక్కన పెట్టమంటే కొట్టనీకి వచ్చిండ్రు. ‘నీదారా.. సాగర్’ అన్నరు. నాది కాకపోవచ్చు. కాని మనందరిదీ కదా సార్.
 కృష్ణుడు: అంతే కదా ఇది మనందరిదీ. సాగర్ సంక్షేమం గురించి, దీన్ని శుభ్రంగా ఉంచుతున్న మీ గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది.
 సాగర్: నిమజ్జనం టైంలో ఉన్న శ్రద్ధ తర్వాత ఎవరికీ ఉండదు. ఈ పదకొండు రోజులైపోయినాంక అంతా మామూలే.
 కృష్ణుడు: సినిమాల్లోకి రాకముందు మేం ఇక్కడే బేగంపేటలో ఉండేవాళ్లం. నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సాయంత్రం, రాత్రి వేళల్లో  సాగర్ అందాలు కెమెరాలో బంధించేవాడ్ని. ఓ 15 ఏళ్ల కిందట కూడా సాగర్ కొంత బాగానే ఉండేది. మట్టి విగ్రహాల సంఖ్య  పెరిగితే పూర్వపు స్థితి మళ్లీ చూడొచ్చు.
 నాగేష్: అవును సార్. ఓ పది పెద్ద విగ్రహాలు కూడా మట్టితో చేసినవే వచ్చినయ్! వాటిని చూడంగనే మాకు ఆనందం అన్పించింది. చిన్న విగ్రహాలు రంగుల్లో ఉంటే ఇబ్బంది సార్. అవి నీళ్ల అడుగుభాగానికి చేరుకుంటయ్. తీయడం కష్టం.
 కృష్ణుడు: ఇప్పుడు చిన్న సైజు రంగుల విగ్రహాల సంఖ్య తగ్గుతోంది. ఈ  విషయంలో స్కూలు యాజమాన్యాలకు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలతో
 తయారుచేయించి మరీ పంచుతున్నారు.
 రామచందర్: ఈ సారి మట్టి విగ్రహాల సంఖ్య బాగా పెరిగింది.
 కృష్ణుడు: నాకింకో డౌట్.. సాగర్‌లో దూకి ఆత్మహత్యలు చేసుకునే వారి మాటేమిటి ?
 నాగేష్ : స్పాట్‌లో మేముంటే వెంటనే రక్షిస్తం. మొన్నీమధ్యనే టూరిజం శాఖవారు ఒకర్ని కాపాడారు. ఎవరూ చూడకపోతే.. దూకినోళ్ల ప్రాణాలు అంతే. శవాన్ని మేమే తీస్తం. వెంటనే అయితే ఫర్వాలేదు. ఒకోసారి నాలుగైదు రోజుల తర్వాత శవం దొరుకుతుంది. ఆ టైంలో మా తిప్పలు దేవుడికెరుక.
 సాగర్: మా కష్టం గురించి చెబితే ఎవరైనా అర్థం చేసుకుంటరు సార్. కాకపోతే మా విషయంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి.
 కృష్ణుడు: మీ డిమాండ్లు ఏంటి?
 రామచందర్: మాకు హెల్త్ కార్డులు కావాలి సార్. ఎప్పుడు ఆస్పత్రికి  వెళ్లినా డాక్టర్లు ముందు ఈ పని మానేయమంటున్నరు.
 నాగేష్: మా ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాలి.
 కృష్ణుడు: హైదరాబాద్ నడిబొడ్డున నిలువెత్తు బుద్ధుడి విగ్రహంతో కళకళలాడుతూ కనిపించే హుస్సేన్‌సాగర్, అందులోని నీళ్లు పరిశుభ్రంగా మార్చే
 ప్రయత్నం చేద్దాం. ఈ కార్మికుల జీవితాలు పచ్చగా ఉండాలని కోరుకుందాం.
 థ్యాంక్యూ వెరీమచ్.
 
 ఆపరేషన్ గణేశ
 సోమవారం ఒక్కరోజే నిమజ్జనం అయ్యే విగ్రహాల సంఖ్య: 35 వేలు
 ఇప్పటి వరకు నిమజ్జనం అయినవి : 16 వేలు (అధికారికంగా)
 ‘ఆపరేషన్ గణేష’కు అయ్యే వ్యయం: రూ.18.56 లక్షలు
 పాల్గొంటున్న కార్మికుల సంఖ్య: 200 మంది
 వినియోగిస్తున్నవి:
 2 డీయూసీలు, 4 జేసీబీలు, ఒక పాంటోన్ ఎక్స్‌లేటర్, 20 టిప్పర్లు
 నిన్నటి వరకు తొలగించిన వ్యర్థాలు: 1,100 టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement