కుతుబ్‌షాహీలు | తెలుగు భాషా సాహిత్య వికాసం | Sakshi
Sakshi News home page

కుతుబ్‌షాహీలు

Published Wed, Sep 14 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

కుతుబ్‌షాహీలు

కుతుబ్‌షాహీలు

గోల్కొండ కేంద్రంగా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు పాలించిన కుతుబ్‌షాహీలు విశిష్ట సాంస్కృతిక సేవలు అందించారు. పారశీకులైనాతెలుగు వారి సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాస్తు నిర్మాణాల్లో వీరి కాలం నాటి సాంస్కృతిక వికాసం ప్రతిబింబిస్తుంది.
 
 కుతుబ్‌షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్‌షా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ. 1543 వరకు పాలించాడు. తెలుగు సర్దార్ల సాయంతో ఆంధ్ర దేశాన్ని సమైక్యం చేశాడు. వీరి రాజభాష పారశీకం అయినా గోల్కొండలో ఉర్దూ భాష ఆదరణకు నోచుకుంది. అరబ్బీ, టర్కీ, పారశీక, హిందీ భాషా పదాల సమ్మేళనమే ఉర్దూగా ప్రసిద్ధి పొందింది. ఉత్తర భారతదేశంలోని సైనిక శిబిరాల్లో ఉర్దూను అధికార భాషగా ఉపయోగించారు. తర్వాత గోల్కొండలో దక్కనీ భాషగా ప్రసిద్ధి చెందింది. ఉర్దూ సాహిత్యానికి పితామహుడిగా ఇబ్రహీం కుతుబ్‌షా కీర్తి పొందాడు. అతడిని ‘ఛాజర్ ఆఫ్ ఉర్దూ’గా పేర్కొంటారు.
 
 సుల్తానులు తాము రాయించిన ‘సనడులు’ పారశీక భాషలో ఉన్నా, వాటిని తెలుగులోకి అనువదింపజేశారు. తెలుగు మండలాల్లో తెలుగులోనే రాజ్య వ్యవహారాలు నిర్వహించేవారని ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచయిత సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. సుల్తాన్ కులీ కుతుబ్‌షా కాలంలో కవులు, పండితులకు మాన్యాలు దానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఇతడి కాలంలో శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానం తెలుగులో రచించి కోర్కొల జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. కుతుబ్‌షాహీల ఆస్థానానికి పర్షియా, మధ్యాసియా ప్రాంతాల నుంచి కవి పండితులు వచ్చేవారు.
 
 కుతుబ్‌షాహీ వంశంలో మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా గోల్కొండను క్రీ.శ.1550 నుంచి క్రీ.శ.1580 వరకు పాలించాడు. ఇతడి కాలంలో తెలుగు ఒక వెలుగు వెలిగింది. ఇతడు తెలుగు కవులు, పండితులను పోషించి, వారు అంకితమిచ్చిన తెలుగు కృతులను స్వీకరించాడు. తెలుగు కవుల సాహిత్యంలో ఇబ్రహీం కుతుబ్‌షా ‘ఇభరాముడు’ అయ్యాడు. ప్రభువు ముస్లిం అయినా అతడిని హైందవ దేవతలు రక్షింతురు గాక అని కవులు దీవించినట్లు ప్రముఖ రచయిత ఆరుద్ర పేర్కొన్నాడు.
 
  ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో అద్దంకి గంగాధరుడు ఆస్థాన కవిగా నియమితుడయ్యాడు. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానం అనే కావ్యం రచించి ఇబ్రహీంకు అంకితమిచ్చాడు. మహ్మదీయ సుల్తానులకు కావ్యాలను అంకితమిచ్చిన మొదటివాడు గంగాధరుడని ప్రతీతి. కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అనే శృంగార కావ్యాన్ని తెలుగులో రాశాడు. ఇతనిది నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామ మని తెలుస్తోంది. కందుకూరి సోమేశ్వర స్వామి కి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ తెలుగులో మొట్టమొదటి యక్షగాన నాటకమని సాహిత్యకారులు భావిస్తారు. దీన్ని కరుణభాసుర యక్షగాన ప్రబంధం అని కవి పేర్కొన్నాడు.
 
 ఈ గ్రంథాన్ని ‘కందుకూరి జనార్దన స్వామికి’ అంకితమిచ్చాడు. రుద్రకవి మరో రచన ‘జనార్దనాష్టకం’. జనార్దనుడిపై దేశవాళీ భాషలో అష్టకం రచించిన మొదటి కవిగా రుద్రకవిని సాహిత్యకారులు గుర్తించారు. ఇతడి భాషా సేవలకు మెచ్చి ఇబ్రహీం కుతుబ్‌షా ఇతనికి చింతపాలెం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మరింగంటి సింగనాచార్యుడు ‘దశరథరాజ నందన చరిత్ర’, ‘శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతా కల్యాణం’ అనే రెండు కావ్యాలు తెలుగులో రచించాడు.‘రాజనీతి రత్నాకరం’ పేరుతో వైష్ణవ ప్రబంధంగా ‘పంచతంత్రాన్ని’ రచించిన కృష్ణయామాత్యుడు ఈ కాలం నాటి వాడే.
 
 ఇబ్రహీం కుతుబ్‌షా కాలం నాటి మరో ప్రముఖ కవి పొన్నెగంటి తెలగనార్యుడు. తెలుగులో తొలి వ్యాకరణం ‘ఆంధ్ర భాషా భూషణం’ గ్రంథాన్ని మూలఘటక కేతన రచించాడు. అదే ఒరవడితో తెలగనార్యుడు అచ్చ తెలుగు కావ్యంగా ‘యయాతి చరిత్ర’ రాశాడు. ఈ కావ్యాన్ని గోల్కొండ ప్రాంత తరఫ్‌దారు (గవర్నర్) అమీన్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. అమీన్‌ఖాన్ పఠాన్‌చెరు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు సాహిత్య పోషకుడు.
 
 కుతుబ్‌షాహీ వంశంలో ఐదో సుల్తాన్‌గా పేరుగాంచిన మహ్మద్ కులీకుతుబ్‌షా క్రీ.శ 1580 నుంచి క్రీ.శ.1612 వరకు గోల్కొండను పాలించాడు. ఇతడే హైదరాబాద్ నిర్మాత. హైదరాబాద్‌లో క్రీ.శ.1591లో చార్మినార్‌ను, తన ప్రేయసి భాగమతి పేరుతో భాగ్యనగరం నిర్మించాడు. ఇతడి కాలంలో గోల్కొండ కరణంగా పనిచేసిన సారంగు తమ్మయ వైజయంతీ విలాసం అనే శృంగార రస కావ్యాన్ని రచించాడు.
 
 దీన్ని తన కులదైవం శ్రీరాముడికి అంకితమిచ్చాడు. ‘హరిభక్త శుభోదయం’ అనే 20 అధ్యాయాల గ్రంథానికి సంస్కృత భాషలో సారంగు తమ్మయ వ్యాఖ్యానం రాశాడు. దానికి ‘భక్తి సంజీవని’ అని పేరు పెట్టాడు. తాను భాగ్యనగర పట్టణానికి మంత్రినని చెప్పుకొన్నాడు.
 ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పర్షియన్ భాషలో మొదటిసారిగా ‘గజల్స్’ ప్రవేశపెడితే, మహ్మద్ కులీ కుతుబ్‌షా ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో హిందువుల పండగలన్నింటినీ వర్ణించాడు. ఇతని కలం పేరు ‘మానిని’. పారశీక గజల్స్‌తోపాటు, ఆశు కవిత్వం అయిన ‘ప్రాయిరీలు’ వీరి కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి.
 
 కుతుబ్‌షాహీ వంశంలో ఆరో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా. ఇతడి కాలంలో ప్రసిద్ధ శృంగార పదకర్త క్షేత్రయ్య గోల్కొండను సందర్శించాడు. సుల్తాన్‌పై ‘వేయి పదాలు’ కవిత్వం చెప్పాడు. క్షేత్రయ్య పదాలనే మొవ్వ గోపాల శృంగార పదాలంటారు. క్షేత్రయ్యది కృష్ణాజిల్లా మొవ్వ గ్రామం. మొవ్వలోని గోపాలకృష్ణుడిపై చెప్పిన కవితలు మొవ్వ గోపాల పదాలుగా ప్రసిద్ధి చెందాయి. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను దర్శించడంతో అతడికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇతడి అసలు పేరు వరదయ్య.
 
 కుతుబ్‌షాహీ వంశంలో ఏడోవాడైన అబుల్ హసన్ తానీషా క్రీ.శ.1672-క్రీ.శ.1687 వరకు పాలించాడు. క్రీ.శ.1687లో గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జయించి, తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. తానీషా కాలంలో భద్రాచలం తహశీల్దార్ కంచర్ల గోపన్న (రామదాసు) భద్రాద్రి రాముడిపై భక్తి కీర్తనలు రచించి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. భక్త రామదాసు) ‘దాశరథీ శతకం’ రచించాడు.
 
 ప్రజాకవిగా పేరుగాంచిన ‘యోగి వేమన’ వీరి కాలానికే చెందినవాడే. అబుల్ హసన్ తానీషా కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి నాట్య కళాకారులకు(భామాకలాపం) అగ్రహారంగా దానం చేశాడు. దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి లఘుచిత్రాలు.. దక్కనీ లఘు చిత్రాలుగా చిత్రించారు. షాషాద్  షాహీ దక్కన్ అనే గ్రంథం 15 లఘు చిత్రాలతో కూడుకొని ఉంది.
 
 వాస్తుపరంగా విశిష్టమైన ‘కుతుబ్ షాహీ శైలి’ వెలుగులోకి వచ్చింది. ఈ శైలి బహమనీ సుల్తానుల నుంచి ఆవిర్భవించింది. పెద్ద పెద్ద గుమ్మటాలు, విశాల ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు, కోణాకృతి నిర్మాణాలు కట్టడాల్లో కనిపిస్తాయి.
 
 మహ్మద్ కులీ కుతుబ్‌షా భాగ్యనగరం, చార్మినార్ కట్టించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంబాగ్‌లు నిర్మించాడు.
 
 భాగ్యనగరంలో చార్మినార్, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు కుతుబ్‌షాహీల ప్రసిద్ధ స్మారక నిర్మాణాలు. గోల్కొండ కోటలో రామదాసు బందీఖానా, రాణీమహల్, స్నానవాటికలు నేటికీ నిలిచి ఉన్నాయి.
 
 కుతుబ్‌షాహీల నిర్మాణాల్లోకెల్లా అత్యంత విశాలమైన ఏడు సమాధులు ‘కుతుబ్‌షాహీ టూంబ్స్’గా ప్రసిద్ధి పొందాయి. ఒక్క అబుల్ హసన్ తానీషా తప్ప, మిగిలిన సుల్తానులను ఇక్కడే సమాధి చేశారు. అబుల్ హసన్ తానీషా సమాధి దౌలతాబాద్ వద్ద ఉంది.
 
 కుతుబ్‌షాహీలు పారశీకులైనా ఆంధ్రుల సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సుమారు 171 ఏళ్లు ఈ సుల్తానులు తూర్పు తీరాంధ్ర వరకు పరిపాలించారు.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    మహ్మద్ కులీ కుతుబ్‌షా ఏ సంవత్సరంలో చార్మినార్‌ను నిర్మించాడు?
     1) 1591    2) 1592
     3) 1593    4) 1594
 2. మహ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరి పేరు మీద హైదరాబాద్ నగరం నిర్మించాడు?
     1) భాగీరథి    2) తారామతి
     3) ప్రేమావతి    4) భాగమతి
 3.    ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
     1. ఇబ్రహీం కుతుబ్‌షా
     2. మహ్మద్ కులీ కుతుబ్‌షా
     3. అబ్దుల్లా కుతుబ్‌షా
     4. ఇబ్రహీం కుతుబ్‌షా
 4.    ‘ఖైరతాబాద్ మసీదు’ను నిర్మించిన కుతుబ్‌షాహీ పాలకుడు?
     1) మహ్మద్ కులీ కుతుబ్‌షా
     2) తానీషా        3) ఇబ్రహీం కుతుబ్‌షా
     4) మహ్మద్ కుతుబ్‌షా
 5.    ఎవరి పాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో మొఘల్ అధికారుల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది?
     1) మహ్మద్ కులీ కుతుబ్‌షా
     2) అబ్దుల్లా కుతుబ్‌షా
     3) మహ్మద్ కుతుబ్‌షా
     4) ఇబ్రహీం కుతుబ్‌షా
 6.    గోల్కొండ రాజ్యం ఏ సంవత్సరంలో మొగల్ సామ్రాజ్య వశమైంది?
     1) 1685  2) 1683     3) 1687 4) 1689
 
     సమాధానాలు
     1) 1; 2) 4; 3) 2; 4) 4; 5) 2; 6) 3.

 
 డా॥పి. జోగినాయుడు
 డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్)
 ఆర్కియాలజీ - మ్యూజియమ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement