అమ్మల దర్శనం.. అదృష్టం - బాలకృష్ణ
తల్లుల కరుణతో తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
ములుగు (వరంగల్) : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భార్య వసుంధరాదేవి, సోదరి ఉమామహేశ్వరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన మేడారానికి వచ్చారు. ఈ సందర్భంగా జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు.అనంతరం ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జాతర నిర్వహణ, చరిత్ర వివరాలు తెలుసుకున్నారు.