సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియను తప్పుపడుతూ దాఖలైన రెండు వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో 2014 డిసెంబర్‌లో రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జారీ చేసిన 11,613 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. కానిస్టేబుళ్ల ఎంపికను సవాలు చేస్తూ బి.శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తితోపాటు ఒక సామాజిక సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు మరోసారి విచారించింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలపై వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు చట్టంలో వీలులేదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాజ్యాల్లో ఎంపిక విధానాన్ని ప్రశ్నించనందున రెండు వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఇటీవలే తీర్పు చెప్పింది. ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లుగా అభ్యర్థులు ఎవరైనా భావిస్తే వారు నేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని, రిట్లు దాఖలు చేస్తే వాటిని విచారించేందుకు వీలుంటుందని పేర్కొంది.
రాష్ట్ర స్థాయిలో వివిధ కేటగిరీల్లో 11,613 పోస్టుల భర్తీ కోసం 5.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 4.92 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1.92 లక్షల మంది అభ్యర్థులు శరీర దారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి బోర్డు నిర్వహించిన శరీర దారుఢ్య పరీక్షలో 81 వేల 70 మంది అర్హత పొందారు. వీరికి మాత్రమే బోర్డు రాత పరీక్షకు ఆహ్వానించింది. ఈ సమయంలో (2017లో) బి.శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, ఒక సామాజిక సంస్థ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిల్స్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం.. సర్వీస్ రూల్స్‌పై పిల్స్ దాఖలు చేయడానికి వీల్లేదని ఇలాంటి కేసుల్లో అభ్యర్థులు మాత్రమే ఎంపిక విధానంపై ప్రశ్నిస్తూ కేసులు వేసేందుకు వీలుందని హైకోర్టుకు విన్నవించింది. పైగా, శ్రీనివాస్‌గౌడ్ కానిస్టేబుల్ పోస్టు కోసం జరిగిన ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారని, ఆయన శరీర దారుఢ్య పరీక్షలో అర్హత సాధించలేదని తెలిసిన తర్వాతే పిల్ వేసి మొత్తం ఎంపిక విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించింది. దీనిపై వాదనల సమయంలోనే ధర్మాసనం..ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 40%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% కంటే తక్కువ కటాఫ్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది. గతంలోనే వాదనలు ముగియడంతో ఇటీవల హైకోర్టు రెండు పిల్స్‌ను తోసిపుచ్చడంతో కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియకు న్యాయపరమైన అడ్డుంకులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 2016లో 332 పోస్టులకు, 2017లో రెండు వేల పోస్టుల భర్తీకి బోర్డు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానిస్టేబుళ్ల ఎంపికపై పిల్స్ కొట్టివేత
Published Sun, Oct 14 2018 1:16 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment