సీజీఎస్టీ నిబంధనల అధికారం కేంద్రానిదే | high court on cgst | Sakshi
Sakshi News home page

సీజీఎస్టీ నిబంధనల అధికారం కేంద్రానిదే

Published Sun, Dec 17 2017 2:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

high court on cgst - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) చట్టం కింద ఈ–వే బిల్లులకు సంబంధించి అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ చట్టం కింద ఈ–వే బిల్లుల విషయంలో వ్యాపారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలను హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. సీజీఎస్టీ కింద రాష్ట్రాల మధ్య (ఇంటర్‌స్టేట్‌) జరిగే వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి వ్యాపార, వాణిజ్యాల విషయంలో నిబంధనలు రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహజసిద్ధ అధికారాలేవీ లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కేవలం ఆయా రాష్ట్రాల్లో (ఇంట్రాస్టేట్‌) జరిగే వ్యాపార, వాణిజ్యాల నిబంధనలు రూపొందించే అధికారం మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఉందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

గమ్యస్థానంలో సరుకును అందుకునే వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు లేదన్న కారణంతో తమ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను ఉభయ రాష్ట్రాల అధికారులు స్వాధీనం చేసుకుంటుండటాన్ని సవాల్‌ చేస్తూ పలువురు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది.

సరుకు, వాహనాల స్వాధీనం వద్దు...
గమ్యస్థానంలో సరుకు అందుకునే వ్యాపారులు ఈ–వే బిల్లులు సమర్పించలేదన్న కారణంతో ఆ సరుకును, వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీన్ని అడ్డంపెట్టుకుని కొందరు వ్యాపారులు పన్ను ఎగవేసే అవకాశం ఉండటంతో వే బిల్లులకు సంబంధించి అధికారులకు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సరుకు ఏ రాష్ట్రం నుంచి అయితే తీసుకెళుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఈ–వే బిల్లు లేదా ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ లేదా డెలవరీ చలాన్‌ను ఆ సరుకుకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి చూపితే, ఆ సరుకును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది.

గమ్యస్థానంలో సరుకులు తీసుకుంటున్న వ్యాపారి నుంచి ఈ–వే బిల్లు రాలేదన్న కారణంతో అతని సరుకు ను, వాహనాలను స్వాధీనం చేసుకోరాదని పే ర్కొంది. వాహనాలను తనిఖీ చేసిన అధికారి ఆ వాహనంలోని సరుకు, ఈ–వే బిల్లు, ట్యాక్స్‌ ఇన్వాయిస్, డెలివరీ చలాన్లకు సంబంధించిన వివరాలను ఏ రాష్ట్రం నుంచి ఆ సరుకులు బయలుదేరా యో ఆ రాష్ట్ర అధికారులతోపాటు గమ్యస్థాన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారులకు కూడా తెలియచేయాలని ఆదేశించింది. అలాగే ఆ సరుకుకు సం రక్షకుడిగా ఉన్న వ్యక్తి వద్ద నుంచి బాండ్‌ తీసుకునేందుకు నిర్దిష్ట నమూనాను తయారు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement