సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు పరీక్ష సమయంలో హాల్‌టికెట్ నంబర్, బుక్‌లెట్ నంబర్, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినంత మాత్రాన వారి సమాధానపత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బబ్లింగ్ ద్వారా వివరాలు పూరించేటప్పుడు చేసే పొరపాట్లకు, అభ్యర్థుల ప్రతిభకు సంబంధం లేదని పేర్కొంది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేసిన అభ్యర్థుల సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అనంతరం వారి మార్కులను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం కీలక తీర్పు వెలువరించారు.
ఏమిటీ వివాదం..?
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. రాతపరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో పలువురు అభ్యర్థులు బబ్లింగ్ (సున్నాను పెన్నుతో నింపడం) ద్వారా బుక్‌లెట్ నంబర్, హాల్‌టికెట్ నంబర్‌ను పూరించేటప్పుడు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశారు. దీంతో అధికారులు ఆ సమాధాన పత్రాలను మూల్యాంకనానికి పంపకుండా పక్కన పెట్టేశారు.
ఆ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఇన్విజిలేటర్ ఏ సిరీస్ బుక్‌లెట్‌కు బదులు బీ సిరీస్ బుక్‌లెట్ ఇచ్చారని.. ఇందులో తన తప్పులేదంటూ ఓ అభ్యర్థి సర్వీస్ కమిషన్ అధికారులకు తెలిపారు. మిగతా అభ్యర్థులు కూడా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని, తమ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయా లని కోరారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన నాలుగు వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. అభ్యర్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పొరపాటు మానవ సహజం..!
తరువాత ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తుది విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లది ఉద్దేశపూర్వక తప్పు కాదని కోర్టుకు విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గురువారం ఉదయం తీర్పు వెలువరించారు. పొరపాటు మానవ సహజమని అందులో పేర్కొన్నారు. పిటిషనర్లు చేసిన పొరపాట్లన్నీ కూడా కేవలం హాల్‌టికెట్, బుక్‌లెట్ బబ్లింగ్ తదితరాలకు సంబంధించినవి మాత్రమేనని... ఇవి వారి ప్రతిభను ప్రభావితం చేసేవి కానప్పుడు వాటిని విస్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లుగా ఉన్న అభ్యర్థుల సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి అంశాలపైనే గతంలో పిటిషన్లు దాఖలైనప్పుడు హైకోర్టు ధర్మాసనాలు కొట్టివేశాయని çపబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొనగా.. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆ ధర్మాసనాలు ట్రిబ్యునల్ ఉత్తర్వులను సమర్థించాయే తప్ప, ఎటువంటి కారణాలను రాయలేదని స్పష్టం చేశారు. ఇటువంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో ధర్మాసనాల నుంచి ఎటువంటి మార్గదర్శనం లేదని, అందువల్ల ఆ తీర్పులను తాను అనుసరించడం లేదని జస్టిస్ రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు.
అవకాశాన్ని దూరం చేయొద్దు..
‘‘ఉద్యోగం అనేది చాలా మందికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. కావాలని చేయని పొరపాటును కారణంగా చూపుతూ ఆ అవకాశాన్ని వారి నుంచి దూరం చేయడానికి వీల్లేదు. ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షల్లోనైనా, కాలేజీల్లో సీట్ల భర్తీకోసమైనా పోటీతత్వం ఉంటుంది. చేయని పొరపాటు ఆధారంగా ఆ పోటీ నుంచి ఆయా వ్యక్తులను దూరం చేయడం సరికాదు.
ఆ పొరపాటు ప్రతిభకు సంబంధించిన వ్యవహారం కానప్పుడు.. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో చూడాలి. చేసిన పొరపాటు బుక్‌లెట్ నంబర్, ప్రశ్న నంబర్, హాల్ టికెట్ నంబర్, వ్యక్తిగత వివరాల నమోదుకు సంబంధించినది అయితే.. దానికి, అభ్యర్థి ప్రతిభకు ఎలాంటి సంబంధం లేదు. పరీక్షా హాలులో అభ్యర్థుల మానసిక స్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పొరపాట్లు చేసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ పొరపాట్లు ప్రతిభను ప్రభావితం చేయనివి అయితే.. వాటిని విస్మరించి, ఇతరులతో పోటీ పడేందుకు వారికి మరో అవకాశం ఇవ్వొచ్చు..’’ – న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment