సాక్షి, హైదరాబాద్: తమను దారుణంగా హింసించారని ‘నేరెళ్ల’బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత పోలీసులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏమీ జరగకపోతే ఎస్సైని ఎందుకు సస్పెండ్ చేశారని నిలదీసింది. ఏదో జరిగిందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినందునే ఎస్సైని సస్పెండ్ చేసి ఉంటారని, అలాంటప్పుడు కేసు నమోదు చేసి ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, సస్పెండ్ చేసిన ఎస్సైపై ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాల దళితులపై పోలీసులు జరిపిన దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ రాసిన లేఖపైనా కోర్టు స్పందించి విచారణ జరుపుతోంది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment