
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని 14, 19 అధికరణల ద్వారా ప్రజలకు లభించిన నిరసన తెలియజేసే హక్కు అమలుకు రాష్ట్రంలో పోలీసులు అవరోధం కల్పిస్తున్నారని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నిరసన కార్యక్రమాలు తెలియజేసే హక్కులు అమలు కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి షఫీకుజ్జమాన్, సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ఖాద్రీ దాఖలు చేసిన ‘పిల్’లో ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
ఎక్కడైనా నిరసన కార్యక్రమం చేసేందుకు దరఖాస్తు చేసుకుంటే పోలీసులు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడమో, గడువు ముగిసే దశలో ఫలానా చోట నిరసన కాకుండా మరో చోట చేసుకోవాలని సూచన చేసి ఆందోళనకారుల స్ఫూర్తిని నీరుగార్చేలాగనో వారి చర్యలున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేసేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోగా పోలీసులు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలని ‘పిల్’లో కోరారు. కాగా, ఇదే తరహాలో తాము నిరసన ర్యాలీ, సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతికి తగిన మార్గదర్శకాలను రూపొందించాలని హోం శాఖను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment