సాక్షి, హైదరాబాద్: రాము పలు కేసుల్లో నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఒక కేసులో అతడికి బెయిల్ వచ్చింది. అయితే పోలీసులు మరో కేసులో అతడిపై పీటీ వారంట్ (ప్రిజన్ ఇన్ ట్రాన్సిట్) దాఖలు చేసి కస్టడీకి కోరారు. ఆ కేసులో కూడా రాముకు బెయిల్ వచ్చింది. పోలీసులు మరో కేసులో పీటీ వారంట్ వేశారు. అందులో బెయిల్ వచ్చినా మరో కేసులో పీటీ వారంట్. ఇలా ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేస్తుండటంతో చాలా కాలం నుంచి రాము జైల్లోనే మగ్గుతున్నాడు. ఒక కేసు తర్వాత మరో కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాములాగే వేల మంది జైళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. మిగిలిన కేసుల గురించి తెలిసి కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పీటీ వారంట్ కింద కస్డడీ కోరుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రాములాంటి ఎందరికో ఈ పరిస్థితి నుంచి ఊరటనిస్తూ ఇటీవల హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
నెలకోసారి సమీక్షించాలి..
ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ, ఏపీల డీజీపీలు కూడా అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. నెలకోసారి సమీక్ష నిర్వహించి నిందితుడిపై ఒక కేసే ఉందా లేదా పలు కేసులున్నాయా.. ఇతర కేసుల్లో అతడిని కోర్టు ముందు హాజరుపర్చకుండా ఉంటే పీటీ వారంట్ కింద కోర్టు ముందు హాజరుపర్చేలా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఇరు రాష్ట్రాల డీజీపీలకు తేల్చి చెప్పింది. నిందితుడు బెయిల్ పొందే అవకాశం లేకుండా చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు స్పష్టం చేశారు.
డీమ్డ్ కస్టడీ కింద బెయిల్..
తమిళనాడు, తిరువన్నామలైకి చెందిన విశ్వనాథంపై వైఎస్సార్ కడప జిల్లా పరిధిలో పలు కేసులున్నాయి. ఓ కేసులో బెయిల్ రాగానే, పోలీసులు మరో కేసులో పీటీ వారంట్ దాఖలు చేస్తూ, తనను కస్టడీలోనే ఉండేలా చేస్తున్నారని, అందువల్ల డీమ్డ్ కస్టడీ కింద బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలివ్వాలంటూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించలేదు. దీనిపై విశ్వనాథం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఏకకాలంలో బెయిల్ పిటిషన్లు..
నిందితుడిని ఓ కేసులో కస్టడీలోకి తీసుకున్న వెంటనే, అతడు మిగిలిన కేసులన్నింటిలో కస్టడీలో ఉన్నట్లుగానే (డీమ్డ్ కస్టడీ) భావించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన కేసుల్లో పీటీ వారంట్ కింద హాజరుపర్చినా.. హాజరుపర్చకున్నా.. అతడు మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఏక కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. డీమ్డ్ కస్టడీ కింద నిందితులు దాఖలు చేసే రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను విచారించాలని సెషన్స్ జడ్జీలు, మెజిస్ట్రేట్‌లను ఆదేశించింది. పోలీసుల తీరు వల్ల నిందితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు, జీవించే హక్కుకు సైతం భంగం వాటిల్లుతోందని తెలిపింది. పోలీసుల తీరు వల్ల నిందితులు జైళ్లలోనే మగ్గాల్సి వస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment