
‘హెరిటేజ్’పై తేల్చేదాకా దాని జోలికెళ్లొద్దు
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రస్తుతమున్న భవనాన్ని వారసత్వ సంపద (హెరిటేజ్) జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చే దాకా ఆ భవనం జోలికి వెళ్లొద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనం ఉందని, అందువల్ల కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ హెచ్‌ఎండీఏ రూపొందిం చిన నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను తయారు చేసిన కమిటీ (హెరిటేజ్ సర్వీస్ కమిటీ) పాతదని, ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ కమిటీ స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఆ భవనం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని పేర్కొంటూ దీన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.