ఎన్ కన్వెన్షన్‌పై హైకోర్టు స్టే
* కఠినచర్యలు తీసుకోకుండా నియంత్రించాలని నాగార్జున పిటిషన్
* మరో పిటిషన్ దాఖలు చేసిన లీజుదారు
* రెండింటిపై విచారణ నేడు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై యథాతథస్థితిని కొనసాగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్‌చేస్తూ సినీనటుడు అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.
ఎన్ కన్వెన్షన్‌పై కఠినచర్యలు తీసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని నాగార్జున సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి స్టే మంజూరు చేశారు. ఇదే అభ్యర్థనతో నాగార్జున నుంచి ఎన్ కన్వెన్షన్‌ను లీజ్‌కు తీసుకున్న ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.
న్యాయబద్ధంగానే కొన్నాను...
గురుకుల్ ఘట్‌కేసర్ ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్‌లాల్ నుంచి 1982లో కొందరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేయగా, 1992లో వారి నుంచి తాను 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నట్టు నాగార్జున తన పిటిషన్‌లో వివరించారు. చట్టపరంగా, న్యాయబద్ధంగానే కొన్న ఈ స్థలంలో హుడా అనుమతితో ప్రహరీగోడ నిర్మించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి జీహెచ్‌ఎంసీ నుంచి లెసైన్స్ తీసుకున్నట్టు, ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు నాగార్జున తెలిపారు.
భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. తన బీఆర్‌ఎస్ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఫంక్షన్‌హాల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆ వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఫంక్షన్‌హాల్‌ను వివిధకార్యక్రమాలకు పలువురు ఇప్పటికే బుక్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
బఫర్‌జోన్‌లో లేదు...
తన ఫంక్షన్‌హాల్ బఫర్‌జోన్‌కి వస్తుందని అధికారులు మార్క్ చేసినట్టు తెలిసిందని, 1992లో తాను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బఫర్‌జోన్‌ను ఎందుకు నిర్ణయించలేదని ఆయన తన పిటిషన్‌లో ప్రశ్నించారు. అంతేకాక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ప్రక్రియంతా చేస్తున్నారు. ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు.
10 హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే, 30 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తిస్తారని, రికార్డుల ప్రకారం, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ ప్రకారం తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లలోపే ఉందని, దీంతో తన నిర్మాణాలు బఫర్‌జోన్ వెలుపలే ఉన్నాయన్నారు. అధికారుల తాజా మార్కింగ్‌ల వల్ల వారికి, తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.