
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఉన్న చెరువులను పరిరక్షించి తీరాల్సిందేనని, దీనిపై ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న విధంగా చెరువులను వదిలిస్తే.. అనగనగా ఒకప్పుడు ఫలానా చోట ఓ చెరువుండేది.. అని భవిష్యత్ తరాలకు చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందంది. తమకు చెరువుల సుందరీకరణ ముఖ్యం కాదని, వాటిని పూర్వస్థితికి తీసుకురావడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఆయా విభాగాలు చట్టం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి పట్టిందని, దీనిని తాము ఇకపై అనుమతించే ప్రసక్తే లేదంది.
మొదటి దశ కింద ఏవైనా పది చెరువులను ఎంపిక చేసుకుని, వాటిని పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లతో కలసి పనిచేయాలంది. ఇందుకు ఏం చేయబోతున్నారో వివరిస్తూ తమకు వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, హెచ్‌ఎండీఏ, పీసీబీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనంఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిని మరోసారి విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment