‘ట్రాక్‌లో కాదు..రోడ్లపై సక్రమంగా నడపాలి’ | high court serious on driving license in telangana transport | Sakshi
Sakshi News home page

‘ట్రాక్‌లో కాదు..రోడ్లపై సక్రమంగా నడపాలి’

Jul 4 2016 8:58 PM | Updated on Aug 31 2018 8:31 PM

డ్రైవింగ్ లెసైన్సుల మంజూరు వ్యవహారంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులకు తావుండరాదని తెలంగాణ రవాణాశాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది.

హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్సుల మంజూరు వ్యవహారంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులకు తావుండరాదని తెలంగాణ రవాణాశాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ క్రాఫ్ట్ సొసైటీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది.

లెసైన్సుల మంజూరు విషయంలో అధికారులు నిబంధనల మేర వ్యవహరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌లో వాహనం నడిపితే చాలని, వారికి లెసైన్స్ మంజూరు చేస్తున్నారన్నారు. రోడ్లపై వాహనం ఎలా నడుపుతున్నారన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోడం లేదని, దీని వల్ల అనేక సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ, డ్రైవింగ్ ట్రాక్‌లో నడిపినంత మాత్రాన లెసైన్స్ మంజూరు చేయడం సరికాదని, రోడ్లపై కూడా సక్రమంగా వాహనం నడుపుతున్నారా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రోడ్డు ప్రమాదాలు రోజు రోజకు పెరిగిపోతున్న నేపథ్యంలో లెసైన్స్ మంజూరు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement