
భగభగలు
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు
► భారీగా పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు
► సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికం
► కొత్తగూడెంలో అత్యధికంగా 47.5 డిగ్రీలు
► దాదాపు అన్ని చోట్లా 43–44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
► పెరిగిన వడగాడ్పుల తీవ్రత.. నేడూ కొనసాగే అవకాశం
► ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. భానుడు ప్రతాపం చూపించడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 – 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తుండ డంతో రాష్ట్రంలో జనం అల్లాడిపోతున్నారు. మంగళవారం కొత్తగూడెంలో అత్యధికంగా 47.5 గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. నల్లగొండ, భద్రాచలం, ఖమ్మంలలో 46 డిగ్రీలుగా నమోదైంది. ప్రస్తుత వేసవి సీజన్‌లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది. నల్లగొండలో ఇదే తేదీన సాధారణంగా 41.2 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదు కావాల్సి ఉండగా... ఏకంగా 5.2 డిగ్రీలు అధికంగా 46.4 డిగ్రీలుగా నమోదైం దని తెలిపింది. ఖమ్మంలో 40.2 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతకుగాను 5.4 డిగ్రీలు అధికంగా రికార్డయింది. ఒకట్రెండు ప్రాం తాలు తప్పించి అంతటా 43–46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.
మరింతగా వడగాడ్పులు
దేశ పశ్చిమ, వాయవ్య దిశల రాష్ట్రంపైకి వేడి గాలులు వీస్తుండటం, పొడి వాతావరణం నెలకొనడంతో ఎండలు మండిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. బుధవారం కూడా వడగా డ్పులు వీస్తాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు చోట్ల 47 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 250 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ల నుంచి నివేదిక వచ్చిందని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వీలైనంత మేరకు ప్రజలు ఆరుబయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విపత్తు నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి, జలుబు, జ్వరాలు, వాంతులు, గొంతునొప్పి, దగ్గుతో అనేకమంది బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారని పేర్కొంటున్నారు.
విలవిల్లాడుతున్న జనం..
భానుడి భగభగల వల్ల రాష్ట్రంలో జనం విలవిల్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం పారిశ్రామిక ప్రాంతం కావడంతో అక్కడ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్త గూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచ, సారపాక, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో, ఓపెన్‌కాస్ట్ గనుల సమీపంలో ఎండ వేడిమి కారణంగా విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య తగ్గింది. ఇక ఖమ్మం జిల్లా అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఖమ్మం నగరం తోపాటు సత్తుపల్లి, వైరా, మధిర తదితర ప్రాంతాల్లో సాధారణానికి మించి ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ బోసిపోయాయి. కాగా ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి మంగళవారం ఐదుగురు మృత్యువాతపడ్డారు.
ఏపీలోనూ భానుడి ప్రతాపం..
భానుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోనూ తన ప్రతాపం చూపించాడు. వడదెబ్బ బారినపడి మంగళవారం ఒక్కరోజే 39 మంది మరణించారు. ఏపీలోని చాలాS ప్రాంతాల్లో మంగళవారం 44 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా రెంటచింతలలో అత్యధికంగా 46.7 డిగ్రీలు, ఆ తర్వాత బాపట్లలో 46.3, విజయవాడలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రభావం
ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పుల కారణంగా ఆరుబయటకు వెళ్లేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా నీరసించిపోతారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, రక్తపోటు పెరగడం, స్పృహతప్పి పోవడంతో పాటు కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్ తీవ్ర స్థాయి సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వడదెబ్బకు లోనైతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి శరీరాన్ని చల్లబరిచేలా చూడడంతోపాటు ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ లేదా ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగించాలి.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త..
♦ రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం.
♦ జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉండటం.
♦ ఐదారు గంటలుగా మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక తడారిపోవడం.
♦ ఒక్కోసారి పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం.
♦ పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
♦ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బ యట తిరగడం, ఆడటం వంటివి చేయకూడదు.
♦ తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోకి వెళితే టోపీ, తెల్లటి నూలు వస్త్రాలు ధరించడం మంచిది.
♦ నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
♦ మద్యం, టీ, కాఫీల వంటి వాటిని తగ్గించడం మంచిది.
వన్యప్రాణులకూ తప్పని కష్టాలు
వేడి తీవ్రతకు నీటి వనరులన్నీ ఎండిపోవడంతో వణ్యప్రాణులు జనావా సాల వైపు వస్తున్నాయి. అలా వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఎండ వేడికి వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండ లం పెర్కవేడులో 300 వరకు సైబీరియా పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ నెల 6న ఇదే జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో నీటి కోసం వచ్చిన 2 నక్కలు బావిలో పడిపోయాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పరమేశ్వరస్వామి చెరువు సమీపంలోకి వచ్చిన 12 నెమళ్లు కలుషిత నీరు తాగి చనిపోయాయి. భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చిన 5 దుప్పులు వేటగాళ్ల బారిన పడ్డాయి.
బయటకు వెళ్లలేకపోతున్నాం
‘‘మండుతున్న ఎండల కారణంగా బయటకు వెళ్లలేకపో తున్నాం. మంగళవారమైతే బయట నిప్పుల వర్షం కురిసినట్లు అనిపించింది. హైదరాబాద్‌లో ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్ తో పరిస్థితి ఘోరంగా ఉంది..’’ – పృథ్వీ, మార్కెటింగ్ ఉద్యోగి
ఎండలో తిరగొద్దు
‘‘వడగాడ్పులు వీస్తున్నందున ప్రజలు ఎండలో తిరగవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండకు తిరగడం వల్ల డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి బీపీ పడిపోతుంది. అందువల్ల అత్యధికంగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి..’’ – డాక్టర్ శేషగిరిరావు, నిమ్స్ గుండె వైద్య నిపుణులు
వేసవి ప్రణాళిక అమలు చేయాలి
‘‘వడగాడ్పుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. వేసవి ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించాం. జనం కూడా ఎండపూట ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి..’’
– సదా భార్గవి, విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక కమిషనర్