సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల పైకి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. రాన్రాను మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వారం రోజుల్లో వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. వచ్చే వారం మొత్తం అనేక చోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రత పెరిగితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. గతేడాది 23 రోజులున్న వడగాడ్పులు ఈసారి అంతకుమించి ఎక్కువ రోజులు నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మధ్యమధ్యలో ఉపరితల ద్రోణులు, ఆవర్తనాలు ఏర్పడుతాయని, దానివల్ల వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు.
ఎండల్లో తిరగొద్దు...
రాష్ట్రంలో అన్నిచోట్లా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఎండలకు తోడు నగరాలు, పట్టణాల్లో సిమెంటు రోడ్లు, భవనాలు, వాయు కాలుష్యం కారణంగా మరో ఒకట్రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment