సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇన్నాళ్లు మూటల్లో మూలిగిన డబ్బంతా బయటకు వస్తోంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు సిద్దమయ్యారు. దానిలో భాగంగానే భారీగా నగదును తరలిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు వివిధ రూపాల్లో లభించిన మొత్తం రూ. 100 కోట్లు దాటింది. ప్రచారం చివరిదశ కావడంతో అక్రమ నగదును అడ్డుకునేందుకు అధికారులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.
మంగళవారం ఒక్కరోజే ఆలేరులో 6 కోట్లు, పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద 5.80 కోట్లు, జూబ్లీహిల్స్‌లో 2 కోట్ల నగదును తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదే కాకుండా 9 కోట్లు విలువ చేసే మద్యం కూడా పట్టుబడింది. ఓటర్లను ఆకర్షించేందుకు కేవలం డబ్బు మాత్రమే కాకుండా నేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. దానిలో భాగంగా మోబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికారాలు, చీరలు, చేతి వాచీలను నేతలు ఎరగా చూపిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇదివరకే అధిక మొత్తంలో తనిఖీల్లో నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.75 కోట్లు, ఐటీ అధికారులకు రూ. 25కోట్లు పట్టుబడింది. పోలింగ్‌కు మరో రెండు రోజుల గడవు మాత్రమే ఉండటంతో మరింత నగదు తరిలించే అవకాశం ఉందిని అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment