ఓ ప్రబుద్ధుడు తనకు హెచ్‌ఐవీ (పాజిటివ్) ఉన్నప్పటికీ దాన్ని కప్పి పుచ్చి వివాహానికి సిద్ధమయ్యాడు.
హసన్‌పర్తి (వరంగల్): ఓ ప్రబుద్ధుడు తనకు హెచ్‌ఐవీ (పాజిటివ్) ఉన్నప్పటికీ దాన్ని కప్పి పుచ్చి వివాహానికి సిద్ధమయ్యాడు. భాజా భజంత్రీలతో వధువు గ్రామానికి వచ్చాడు. వరుడిని తీసుకెళ్లడానికి వధువు తరఫున ఎదురుకోళ్లకు వచ్చారు. మరో ఇరవై నిమిషాల్లో వధూవరులు పెళ్లిపీటల మీద కూర్చునేవారు. అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వాతావరణం మారిపోయింది. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి హసన్‌పర్తి మండలానికి ఓ యువతితో 20 రోజుల క్రితం వివాహం నిశ్చితార్థమైంది. వివాహానికి వధువు తల్లిదండ్రులు రూ.4.50 లక్షల వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. నిశ్చితార్థం రోజున రూ.50 వేలు ఇచ్చారు. గురువారం (ఫిబ్రవరి 5న) పెళ్లికి సిద్ధమయ్యూరు. కాగా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడైన వరుడు మెడిసిన్ వాడడం లేదని, అసలు కారణాలు తెలుసుకునేందుకు వరంగల్‌లోని స్నేహ స్వచ్ఛంద సంస్థ, కరుణ మైత్రి సంస్థల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ ద్వారా హసన్‌పర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వివాహ వేదిక వద్దకు వెళ్్లి పెళ్లి తతంగాన్ని నిలిపివేశారు. కాగా, వరుడికి హెచ్‌ఐవీ సోకినట్లు కుటుంబ సభ్యులకు తెలియదు. తమను చీటింగ్ చేసిన వరుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.