తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక | home minister rajnath singh talks about september 17th | Sakshi
Sakshi News home page

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

Published Mon, Sep 18 2017 1:45 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

► విమోచన దినంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌
► అవినీతిని అరికట్టే చర్యలు చేపట్టాం
► అధికారికంగా నిర్వహిస్తాం: హన్స్‌రాజ్‌
► బీజేపీలో చేరిన డీఎస్‌ తనయుడు
► నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సంకల్ప సభ


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవ మైన సెప్టెంబర్‌ 17 ఈ ప్రాంత ప్రజల అస్తిత్వానికి ప్రతీక అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సుమారు అరగంటపాటు మాట్లాడారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, మోదీ పుట్టిన రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు, దేశ ప్రజలకు సౌభాగ్యమైన రోజు అని పేర్కొన్నారు.

యూపీఏ సర్కారులో మంత్రులు అవినీతిలో కూరుకు పోయారని, కానీ, మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక కూడా లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. అవినీతిని అరికట్టే చర్యలు చేసి చూపించామని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ ప్రతిపక్ష పార్టీ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి స్పందిస్తూ పాక్‌ హింసను ప్రేరేపిస్తుంటే చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. అహింసామార్గంలో పయనిస్తున్నందున సహనం పాటిస్తున్నామని, అందుకే మొదటి తూటాను మనం ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు.

అధికారికంగా నిర్వహిస్తాం: హన్స్‌రాజ్‌
తెలంగాణ సాయుధ పోరాట యోధులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినట్లుగానే, తెలంగాణకు 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్య్రం లభించిందని అన్నారు. మండలిలో బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రభాకర్, మాజీ మంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, పుష్పలీల తదితరులు ప్రసంగించారు.

బీజేపీలోకి డీఎస్‌ తనయుడు
టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి అరవింద్‌ ఈ సభ సందర్భంగా బీజేపీలో చేరుతున్నట్లు రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. అయితే, మంచి రోజు కాదని అరవింద్‌ పార్టీ కండువాను కప్పుకోలేదు.

టీఆర్‌ఎస్‌.. మజ్లిస్‌ తొత్తు: లక్ష్మణ్‌
నిజామాబాద్‌ అర్బన్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి, మజ్లిస్‌ నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ చరిత్రను టీఆర్‌ఎస్‌ వక్రీకరిస్తోందని, విమోచన దినోత్సవం నిర్వహించడానికి కేసీఆర్‌ ఎందుకు ముందుకు రావట్లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుమారుడ్ని సీఎం చేయడానికే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ మెడలు వంచైనా సరే వచ్చే ఏడాది విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తాత్రేయ
టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. గోల్కొండ కోటపై వచ్చే ఏడాది బీజేపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మాదిరిగానే టీఆర్‌ఎస్‌ కూడా నాశనమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావ్‌ అన్నారు. తెలంగాణ గుర్తింపును, సంస్కృతిని కాపాడడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ ఉద్యమాలను అణచివేయడం ద్వారా ఆ పార్టీ కూడా సమాధి అవుతుందని చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని బర్తరఫ్‌ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విచ్ఛిన్న కార్యక్రమం అనడం ఆయన అవగాహన లేనితనానికి నిదర్శనమని విమర్శించారు. మజ్లిస్‌ నాయకులను చర్లపల్లి జైలులో పెట్టిస్తామన్నారు. రజకార్ల వారసత్వానికి కేసీఆర్‌ నాయకత్వం వహిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement