
పసిబిడ్డకు పాలిద్దామన్నా..
⇒ ఆంక్షల వలయంలో సరోగసీ బాధితురాలు
⇒ పుట్టిన బిడ్డను చూడటానికి కూడా అనుమతించని వైనం
సరోగసీ (అద్దె గర్భం) అంశం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. బాధిత మహిళ చుట్టూ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమెను కలవడానికి, మాట్లాడటానికి వెళ్లిన ఆమె భర్తను సైతం నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటివేస్తున్నారు. ప్రస్తు తం నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న బిడ్డను చూసేందుకు కూడా బాధితురాలికి అనుమతినివ్వడం లేదు. అదే మంటే మాకు పైనుంచి ఆదేశాలున్నాయంటూ నిరాకరిస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అయినవారెవరూ పక్కన లేక, ఒంటరిగా నరకం అనుభవిస్తోందా మహిళ. ఈ వివాదానికి తెరదించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే... బిడ్డతో పాటు బాధిత దంపతులు, సరోగసీ ద్వారా బిడ్డను కనాలని భావించిన మహిళకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని, రిపోర్టు వచ్చే వరకు బాధిత మహిళను ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. – సాక్షి, హైదరాబాద్
చిక్కులు రాకుండా పేరు మార్పు..
మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండలం పొల్కంపల్లికి చెందిన బాధితురాలు హయత్‌నగర్‌లో నివాసముంటోంది. గుంటూరుకు చెందిన సుధారాణికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సరోగసీ ద్వారా బిడ్డను కనాలని భావించి... బాధితురాలితో ఒప్పందం కుదుర్చుకుంది. జనన ధృవీకరణ పత్రంలో చిక్కులు రాకుండా బాధితురాలి పేరును సుధారాణిగా అన్ని రిపోర్టుల్లో పేర్కొన్నారు. అయితే ఏడో నెల స్కానింగ్‌లో పుట్టబోయేది ఆడ బిడ్డని తెలిసి సుధారాణి దంపతులు ముఖం చాటేశారు. ఇటీవల బాధితురాలికి నొప్పులు రావడంతో ఆమె భర్త పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిషన్ సమయంలో తన భార్యపేరు చెప్పగా, అప్పటికే వెంట తెచ్చుకున్న పాత రిపోర్టులపై మరో పేరు ఉండటంతో వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది.
ఆస్పత్రుల్లో తనిఖీలు..
సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డ నిజనిర్ధారణకు అధికార యంత్రాంగం కదిలింది. సోమవారం ‘నేను ఎవరి బిడ్డని’శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు... బాధితురాలు చికిత్స చేయించుకున్న వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని జేజే ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మజ... ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ జయంతిరెడ్డి నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో ఐవీఎఫ్ చెకప్ చేయించుకున్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని, కానీ ఆమె చెప్పినట్టుగా ఇక్కడ ఐవీఎఫ్ జరగలేదని పద్మజ తెలిపారు.
కంటికి రెప్పలా చూసుకొంటా
అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడి సరోగసీకి అంగీకరించాను. కానీ ఆడ పిల్లని తెలియగానే నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఆ దంపతులు ఒంటరిగా వదిలేశారు. నన్ను మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. పుట్టిన బిడ్డకు.. నాకు జన్యుపరంగా సంబంధం లేకపోయినా పేగు తెంచుకుపుట్టింది కనుక తనను వదులుకోను. కంటికిరెప్పలా చూసుకుంటాను.
– సరోగసీ బాధితురాలు
ఆ పాపను ఎవరికీ ఇవ్వను
నాకు తెలియకుండా డబ్బు ఆశ చూపి నా భార్య ను ఇబ్బందులకు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఆడ పిల్ల అయినప్పటికీ... పెంచి పోషించుకుంటాను.
– బాధితురాలి భర్త
మెరుగైన వైద్యం అందిస్తున్నాం...
బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. పాప అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించాం. తల్లి అనారోగ్యంగా ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. రికార్డులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందజేశాం. విచారణ జరుగుతోంది.
– డాక్టర్ నాగమణి, సూపరింటెండెంట్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి