హాస్టళ్లలో అవినీతికి చెక్ | Hostels to check corruption | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో అవినీతికి చెక్

Published Wed, Oct 22 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

హాస్టళ్లలో అవినీతికి చెక్

హాస్టళ్లలో అవినీతికి చెక్

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: హాస్టళ్లలో అవినీతికి అధికారులు చెక్ పెట్టనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపి దోచుకుంటున్న వార్డెన్లకు కళ్లెం వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమశాఖ హాస్టళ్లలో వందమందికి పైగా విద్యార్థులున్న చోట బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా హాజరు పట్టికలో పూర్తిస్థాయి హాజరు వేసి బిల్లులు స్వాహా చేస్తున్నారన్న అపవాదులు ప్రభుత్వ హాస్టళ్లపై ఉన్నాయి.

అంతేగాక ఇటీవల ఏసీబీ జిల్లాలోని పలు హాస్టళ్లలో చేసిన తనిఖీల్లో ఇవే విషయాలు బయటపడ్డాయి. ఏసీబీ తనిఖీ చేసిన హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ హాజరు రిజిస్టర్‌లో మాత్రం పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు నమోదై ఉంది. హాస్టళ్లలో వార్డెన్‌లు వేస్తున్న ఎక్కువ విద్యార్థుల సంఖ్య ప్రకారం నెలకు లక్షల రూపాయలు కాజేస్తున్నారని ఏసీబీ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.

ఇదే విషయంపై గతంలో సమీక్ష చేపట్టిన ప్రభుత్వం విద్యార్థుల హాజరు విధానంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని గతేడాది నిర్ణయించింది. మొదటి విడతగా సంక్షేమహాస్టళ్లలో ఈ బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. ఆ తర్వాత బీసీ, గురుకులు, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో అమలు చేయనున్నట్లు సంక్షేమ అధికారులు చెబుతున్నారు. కేవలం విద్యార్థుల హాజరుతో సరిపెట్టక విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు కూడా బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

అందుకు అవసరమైన బయోమెట్రిక్, ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన క్లస్టర్ ఇన్‌ఫోటెక్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. 100 మంది విద్యార్థుల సంఖ్య కలిగిన సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానం అమలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 100 మంది విద్యార్థులకు పైగా సంఖ్య ఉన్న 81 హాస్టళ్లకు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లోని సాంఘీక సంక్షేమహాస్టళ్లకు చేరిన క్లస్టర్ ఇన్‌ఫోటెక్ సంస్థకు చెందిన ప్రతినిధులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు బయోమెట్రిక్ విధానం అమలుపై వివరించి బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు.

విద్యార్థుల నుంచి వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ విధానంలో విద్యార్థి పూర్తి వివరాలు ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇక ప్రతిరోజు రెండు సార్లు విద్యార్థుల నుంచి వేలి ముద్రల ద్వారా హాజరు నమోదు చేస్తారు. ఇలా నమోదైన వివరాలు ప్రతి రోజు రాజధానిలోని ప్రధాన కార్యాలయానికి చేరుతాయి. నెల  చివరినాటికి ఇలా నమోదైన విద్యార్థుల హాజరుశాతం ఆధారంగా ఆయా హాస్టళక్లు బిల్లులు మంజూరవుతాయి. ఈ విధానంతో గతంలో జరిగిన అవకతవకులకు చెక్ పడనుంది.

 వార్డెన్లకు శిక్షణ ఎప్పుడో..?
 జిల్లా వ్యాప్తంగా ఉన్న 81 హాస్టళ్లకు ఆయా సహాయ సంక్షేమ అధికారుల ద్వారా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. కొన్ని హాస్టళ్ల వార్డెన్లు బయోమెట్రిక్ మిషన్లను తమ ఇళ్లల్లో పెట్టుకున్నట్లు తెలిసింది. బయోమెట్రిక్ అమలు తీరుపై ఆయా హాస్టళ్ల వార్డెన్‌లకు శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో ఆదిలోనే జాప్యం జరుగుతున్న ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలవుతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement