ఒకటికాదు, రెండు కాదు... ఏకంగా వెయ్యి జిలెటిన్‌స్టిక్స్, రెండువేల ఎలక్ట్రానిక్ డిటొనేటర్లను అక్రమంగా తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఒకటికాదు, రెండు కాదు... ఏకంగా వెయ్యి జిలెటిన్‌స్టిక్స్, రెండువేల ఎలక్ట్రానిక్ డిటొనేటర్లను అక్రమంగా తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆల్వాల్ ఏసీపీ జి.ప్రకాశరావు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... బుధవారం రాంపల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మారుతీ జెన్ కారు(ఏపీ11ఎఫ్6399)ను సోదా చేయగా, అందులో మొత్తం వెయ్యి జిలెటిన్ స్టిక్స్, 2150 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.
వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న టి.సురేందర్‌తోపాటు హోల్‌సేల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నగర శివారు మండలాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు అవసరమైన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను సరఫరా చేస్తున్న వీరిరువురిపై గతంలో మేడ్చల్ తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు విచారణలో ఉన్నాయి. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు.