
భారీగా నగదు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రినుంచి నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ. 29,98,450 ల నగదును సీజ్ చేశారు.
కమ్మర్‌పల్లిలో రూ.10.83లక్షలు
కమ్మర్‌పల్లి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో తరలిస్తున్న రూ. 10.82 లక్షలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి. కమ్మర్‌పల్లి పోలీసు చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కరీం నగర్ జిల్లా జగిత్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డాక్టర్ విజయ్ కుమార్ కారును తనిఖీ చేయగా.. రూ. 10 లక్షలు లభించాయి. హైదరాబాద్‌లో కన్‌స్ట్రక్షన్ పనుల నిమిత్తం డబ్బులు తీసుకువెళ్తున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను తెలియజేయకపోవడంతో పోలీసులు సొమ్మును సీజ్ చేశారు.
కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న యాళ్ల అంజిరెడ్డి కారును తనిఖీ చేయగా రూ. 81,900 లభించాయి. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బును తీసుకు వెళ్తున్నట్లు అంజిరెడ్డి తెలిపారు. డబ్బులకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.
నగరంలో 11.74 లక్షలు..
నిజామాబాద్‌క్రైం : బోర్గాం(పి) బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో వాహనాల ను తనిఖీ చేస్తుండగా రూ. 7.74 లక్షలు లభిం చాయని నాలుగో టౌన్ ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తున్న ఇంద్ర బస్సును పోలీసులు బోర్గాం (పి) చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన హరణికుమార్ బ్యాగ్ లో రూ. 7 లక్షల 74 వేలు లభించాయి. డబ్బులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు.
సారంగాపూర్‌లో..
సారంగాపూర్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ. 4 లక్షలు లభించాయి. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓ నర్సింగ్‌యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం సారంగాపూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ డీసీఎం వ్యాన్ వచ్చింది. ఈ వ్యాన్ మహారాష్ర్ట నుంచి నల్గొం డ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్తోంది. వ్యాన్ డ్రైవర్ అంజయ్య వద్ద రూ. 4 లక్షలు లభించాయి. డబ్బులకు సంబంధించి ఎలాంటి రిసిప్ట్‌లు చూపకపోవడంతో నగదును సీజ్ చేశామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
లచ్చాపేట్ చెక్‌పోస్టు వద్ద..
మాచారెడ్డి : జిల్లా సరిహద్దుల్లోని లచ్చాపేట్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించి లక్షా 80 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ ప్రసాద్‌రావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధకు చెందిన రాజు బైక్‌పై లక్ష రూపాయలు తీసుకొని కామారెడ్డివైపు వస్తున్నాడు. చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని తీసుకోవడానికి డబ్బులు తీసుకువెళ్తున్నానని రాజు తెలిపారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలను చూపకపోవడంతో సీజ్ చేశారు.
మెదక్ జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన మల్లేశం వద్ద నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులను తీసుకుని వెళ్తున్నానని మల్లేశం తెలిపినా.. వాటికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.
బస్వాపూర్ వద్ద రూ.94,450..
భిక్కనూరు : జిల్లా సరిహద్దులోని బస్వాపూర్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించామని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేడపాటి శివ్వారెడ్డి తన వాహనంలో ఎలాంటి వివరాలు లేకుండా తరలిస్తున్న 94,450 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
చాకిర్యాల్‌లో రూ. లక్షా78వేలు..
బాల్కొండ : చాకీర్యాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి నిర్వహిం చిన తనిఖీల్లో భారీగా నగదు లభ్యమైంది. ఆదిలాబాద్ వైపు నంచి వస్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా రూ. లక్షా 78 వేలు లభించాయని ఎస్‌ఐ సురేశ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించామని పేర్కొన్నారు.
భీమ్‌గల్‌లో రూ.2.90లక్షలు..
భీమ్‌గల్ : మండలంలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 2.90 లక్షల నగదు లభించిందని తహశీల్దార్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నగదును స్టాటిస్టికల్, సర్వేలెన్స్ బృందానికి అప్పగించామన్నారు.
రేంజ్ పరిధిలో రూ. కోటీ 38 లక్షలు స్వాధీనం
నిజామాబాద్‌క్రైం : ఎన్నికల నియమావళి అమలులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును సీజ్ చేస్తున్నామని రేంజ్ డీఐజీ సూర్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా రు. రేంజ్ పరిధిలో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఈనెల 3వ తేదీనుంచి ఇప్పటివరకు కోటీ 38 లక్షల 11 వేల 240 రూపాయలు, 24 కిలోల వెండి అభరణాలు, కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 142 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 259 కేసులు నమోదు చేశామని, 1,627 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.