‘మందు’ షాపులకు మస్త్ డిమాండ్!
- మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు
- ఇప్పటివరకు వచ్చినవి 15 వేలకు పైగానే..
- హైదరాబాద్‌లో మాత్రం ఆదరణ అంతంతే..
- దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి రోజు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సు కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 2,216 దుకాణాలకుగాను సోమవారం రాత్రి వరకు ఏకంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం చివరిరోజు కావడంతో మరో 15 వేల వరకు దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి దరఖాస్తులు చేస్తున్నారని.. దాంతో భారీగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 276 దుకాణాల కోసం 3,055 దరఖాస్తులు రాగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 183 షాపులకు 145 దరఖాస్తులే వచ్చాయి. ఇక్కడ 62 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట జిల్లా జాన్‌పహాడ్‌లోని ఒకే ఒక్క మద్యం దుకాణానికి ఏకంగా 134 దరఖాస్తులు రావడం గమనార్హం. దీనికి మంగళవారం మరో 130 దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ వ్యాపారులు రావడంతో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షాపులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఏపీలో మద్యం దుకాణాలకు రెండు నెలల ముందే టెండర్ల ప్రక్రియ ముగిసింది. అక్కడ దుకాణాలు దక్కని వ్యాపారులు తెలంగాణకు వరుస కట్టారు. దీంతో ఏపీ సరిహద్దులో ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో మద్యం దుకాణాలకు భారీగా స్పందన వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 276 దుకాణాలకు 3,056 దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల వ్యాపారులు ఇక్కడ భారీగా దరఖాస్తులు చేశారు. సూర్యాపేట జిల్లాలోనైతే ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 70 శాతం మంది ఏపీ వ్యాపారులేనని అంచనా. ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు రావడంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 161 మద్యం దుకాణాలకు ఏకంగా 2,865 దరఖాస్తులు వచ్చాయి.
ఒరిజినల్ చలానాతో తగ్గాయి
మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకుంటే... మొత్తం లైసెన్స్ ఫీజులో 10 శాతం సొమ్మును (ఈఎండీ) దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చలానా తీసి దరఖాస్తు ఫారానికి జతచేయాలి. దుకాణం రాకపోతే సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అయితే గతంలో ఒక్కో చలానాపై జిరాక్స్ కాపీలతో 10 దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈసారి దానిని రద్దు చేశారు. ఒరిజినల్ చలానా జత చేసిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనల్లో పేర్కొన్నారు. దీనివల్ల ఒక్కో దరఖాస్తు కోసం గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు రూ. 5.60 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి రూ. 6.65 లక్షల వరకు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈసారి దరఖాస్తు ఫీజును ఏకంగా రూ.లక్షకు పెంచారు. ఈ సొమ్మును తిరిగి ఇవ్వరు (నాన్ రిఫండబుల్) కూడా. ఈ మార్పులే లేకపోతే ఊహించని స్థాయిలో భారీగా దరఖాస్తులు వచ్చి ఉండేవని అంచనా వేస్తున్నారు.