బంజారాహిల్స్: వారిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. సొంత అన్నదమ్ములు.. అటు తమిళనాడుతోనూ ఇటు తెలంగాణతోనూ అనుబంధం పెంచుకున్నారు. అందరిలా కాకుండా తమకంటూ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. ఈ యాత్ర కోసం వీరు ప్రత్యేకంగా ఓ కారును కూడా తయారు చేసుకున్నారు. ఆ కారుపై వివిధ ఆలయాల నమూనాలు కూడా ఆకట్టుకున్నాయి. సమాజంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పులు కొంతవరకు మేలు చేస్తుండగా అధికశాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా తమ భవిష్యత్‌ను, కెరీర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన యువత స్మార్ట్‌ఫోన్ల మోజులో పడి తమ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కోలేక వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–10లో నూర్‌నగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై(32), కార్తికేయన్(28)లు ఇటీవల అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన వీరి ఆధ్యాత్మికయాత్ర 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు సాగింది. ఈ ప్రయాణంలో వీరు 501 దేవాలయాల్ని దర్శించుకున్నారు. తమ స్వగ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర బంజారాహిల్స్‌లో ఇటీవలనే ముగిసింది. ఈ సందర్భంగా పాండిదురై మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్ర తమ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఇక్కడి యువతలో ఆధ్యాత్మిక భావాలు తగ్గిపోయాయని, దేశవ్యాప్తంగా తాము దేవాలయాల సందర్శన ద్వారా అనే అంశాలను అవగాహన చేసుకున్నామన్నారు. దేవాలయాల వ్యవస్థను ఆధ్యాత్మిక సంపదను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం ఉందన్నారు. తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన ఆదరణ లభించిందన్నారు. ఈ సందర్భంగా తాము గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్‌ను కూడా కలుసుకున్నామని, తమ యాత్రను అభినందించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment