temples visitation
-
‘రాట్నాలమ్మవారి’తో సింధుకు ఎంతో అనుబంధం
పెదవేగి (పశ్చిమ గోదావరి): రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆశీస్సులతోనే ఒలింపిక్ కాంస్య పతకం సాధించానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మవారిని శుక్రవారం సింధు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అమ్మ ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష మేరకు పతకంతో తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సింధుకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు ఆహ్వానం పలికారు. ఆలయంలో తరతరాల అనుబంధం సింధు కుటుంబానికి కులదైవంగా రాట్నాలమ్మ వారు పూజలందుకుంటున్నారు. సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ, ఆయన సోదరులు రామస్వామి, తాండవ కృష్ణమూర్తి కుటుంబసభ్యులతో కలిసి ఏలూరు పడమరవీధిలో ఉండేవారు. ఆ సమయంలో ఎండ్ల బండ్లపై బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అమ్మవారి సన్నిధికి వచ్చేవారు. ఈ క్రమంలో సింధుకు కూడా చిన్ననాటి నుంచి అమ్మవారిపై నమ్మకం కలిగింది. ద్వారక తిరుమలలో.. ద్వారకాతిరుమల: రాబోయే రోజుల్లో మరెన్నో మెడల్స్ సాధించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని పీవీ సింధు అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రాన్ని కుటుంబసమేతంగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. -
పూజలు.. ప్రమాణాలు!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్న ఈ జంట ఏ ఆటంకం కలగకుండా పలు పూజలు చేస్తున్నారని భోగట్టా. ఇప్పటికే ఈ ఇద్దరూ తమిళనాడు, కేరళలోని పలు ఆలయాలను సందర్శించారని తెలుస్తోంది. తాజాగా తమిళనాడులోని కుంభకోణం సమీపంలో గల తిరునాగేశ్వరం రాహు ఆలయాన్ని ఇద్దరూ సందర్శించనున్నారట. అక్కడ ప్రత్యేక పూజలు, ప్రమాణాలు చేయనున్నారట నయనతార, విఘ్నేష్. మరి.. పెళ్లి పీటల మీద ఎప్పుడు కూర్చుంటారనేది తెలియాల్సి ఉంది. ప్రచారంలో ఉన్న వార్తల సారాంశం ఏంటంటే... ఇప్పటికే ఈ ప్రేమికులు పలు దేశాలు చుట్టారు. అందుకని పెళ్లి తర్వాత ప్రత్యేకంగా హనీమూన్ ప్లాన్ చేయడంలేదని సమాచారం. -
49 రోజులు.. 501 దేవాలయాల సందర్శన
బంజారాహిల్స్: వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. సొంత అన్నదమ్ములు.. అటు తమిళనాడుతోనూ ఇటు తెలంగాణతోనూ అనుబంధం పెంచుకున్నారు. అందరిలా కాకుండా తమకంటూ గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. ఈ యాత్ర కోసం వీరు ప్రత్యేకంగా ఓ కారును కూడా తయారు చేసుకున్నారు. ఆ కారుపై వివిధ ఆలయాల నమూనాలు కూడా ఆకట్టుకున్నాయి. సమాజంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పులు కొంతవరకు మేలు చేస్తుండగా అధికశాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా తమ భవిష్యత్‌ను, కెరీర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన యువత స్మార్ట్ఫోన్ల మోజులో పడి తమ వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కోలేక వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–10లో నూర్‌నగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై(32), కార్తికేయన్(28)లు ఇటీవల అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. గత ఏడాది నవంబరులో ప్రారంభమైన వీరి ఆధ్యాత్మికయాత్ర 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు సాగింది. ఈ ప్రయాణంలో వీరు 501 దేవాలయాల్ని దర్శించుకున్నారు. తమ స్వగ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర బంజారాహిల్స్‌లో ఇటీవలనే ముగిసింది. ఈ సందర్భంగా పాండిదురై మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్ర తమ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఇక్కడి యువతలో ఆధ్యాత్మిక భావాలు తగ్గిపోయాయని, దేశవ్యాప్తంగా తాము దేవాలయాల సందర్శన ద్వారా అనే అంశాలను అవగాహన చేసుకున్నామన్నారు. దేవాలయాల వ్యవస్థను ఆధ్యాత్మిక సంపదను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం ఉందన్నారు. తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన ఆదరణ లభించిందన్నారు. ఈ సందర్భంగా తాము గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్‌ను కూడా కలుసుకున్నామని, తమ యాత్రను అభినందించారని చెప్పారు. -
నేను శివ భక్తుణ్ని: రాహుల్
బెచరాజీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శిస్తూ గుజరాత్లో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను శివ భక్తుడినని రాహుల్ సోమవారం వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి రాహుల్ వివిధ ఆలయాలను సందర్శించడం తెలిసిందే. తాజాగా మెహ్సాన జిల్లాలోని మూడు ఆలయాల్లో రాహుల్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఓ చోట ఆయన మాట్లాడుతూ ‘నేను శివ భక్తుడిని. బీజేపీ వారికి ఇష్టమొచ్చిన దుష్ప్రచారాన్ని నాకు వ్యతిరేకంగా చేయనివ్వండి. నా నిజాయితీ నాతోనే ఉంది’ అని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
బిహార్‌లో ఘటన మృతులు ‘పశ్చిమ’ జిల్లావాసులు కొవ్వూరు (పశ్చిమ గోదావరి): బిహార్ రాష్ట్రం కైమూర్ జిల్లాలోని మొహనియా జీపీ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. కాశీ నుంచి కారులో గయ వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కొవ్వూరు పట్టణంలో నివాసం ఉంటున్న బ్రాహ్మణగూడెం పంచాయతీ కార్యదర్శి మాచవరపు సత్యనారాయణ (58), ఆయన తల్లి పద్మావతి(72), పెదకుమారుడు మాచవరపు పవన్ కుమార్ (23), నిడదవోలు నగరం రాయపేటకు చెందిన రిటైర్డ్ ఈవోపీఆర్డీ అత్తిలి శ్రీరామ్ (65), ఆయన సోదరి రుక్మిణి (75) దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ భార్య సరస్వతీ దేవి(62) ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మాచరపు సత్యనారాయణ భార్య లక్ష్మీకళావతి గాయాలపాలై మహనియా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 3న ఈ రెండు కుంటుంబాలు తీర్థయాత్రకు కాశీ వెళ్లాయి. తొమ్మిది రోజులపాటు అక్కడ గడిపిన అనంతరం 17వ తేదీ ఉదయం కాశీ నుంచి ఏడుగురు సభ్యులు కారులో బయలుదేరి గయ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలకు కాశీలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీహార్ మృతులకు సీఎం సంతాపం సాక్షి, విజయవాడ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లావాసుల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.