రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
బిహార్‌లో ఘటన మృతులు ‘పశ్చిమ’ జిల్లావాసులు
కొవ్వూరు (పశ్చిమ గోదావరి): బిహార్ రాష్ట్రం కైమూర్ జిల్లాలోని మొహనియా జీపీ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. కాశీ నుంచి కారులో గయ వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కొవ్వూరు పట్టణంలో నివాసం ఉంటున్న బ్రాహ్మణగూడెం పంచాయతీ కార్యదర్శి మాచవరపు సత్యనారాయణ (58), ఆయన తల్లి పద్మావతి(72), పెదకుమారుడు మాచవరపు పవన్ కుమార్ (23), నిడదవోలు నగరం రాయపేటకు చెందిన రిటైర్డ్ ఈవోపీఆర్‌డీ అత్తిలి శ్రీరామ్ (65), ఆయన సోదరి రుక్మిణి (75) దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ భార్య సరస్వతీ దేవి(62) ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మాచరపు సత్యనారాయణ భార్య లక్ష్మీకళావతి గాయాలపాలై మహనియా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 3న ఈ రెండు కుంటుంబాలు తీర్థయాత్రకు కాశీ వెళ్లాయి. తొమ్మిది రోజులపాటు అక్కడ గడిపిన అనంతరం 17వ తేదీ ఉదయం కాశీ నుంచి ఏడుగురు సభ్యులు కారులో బయలుదేరి గయ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలకు కాశీలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బీహార్ మృతులకు సీఎం సంతాపం
సాక్షి, విజయవాడ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లావాసుల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.