సాక్షి, ఉంగుటూరు(పశ్చిమ గోదావరి): సొంతూరుకు బైక్‌పై బయలుదేరిన వారి ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. ముందువెళ్లే వాహనాన్ని తప్పించే క్రమంలో మరో వాహనాన్ని ఢీకొని జారిపడటంతో రోడ్డు దెబ్బ తగిలి తల్లీకొడుకులు దుర్మరణం పాలైన ఘటన చేబ్రోలులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకు చెందిన వెజ్జు గోపాలకృష్ణ, కనకదుర్గ దంపతులు వ్యాపారరీత్యా కొన్నేళ్లుగా జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సొంతూరులోని బంధువుల ఇంటికి వచ్చేందుకు కుమారుడు హేమంత్‌కుమార్ (17)తో కలిసి తల్లి కనకదుర్గ (33) బుధవారం ఉదయం జంగారెడ్డిగూడెం నుంచి బైక్‌పై బయలుదేరారు.
లక్కవరం, దూబచర్ల మీదుగా చేబ్రోలు సమీపించే సరికి ముందు వెళుతున్న ట్రావెల్స్ బస్సును తప్పించే క్రమంలో మరో మోటార్‌సైకిల్‌పై వస్తున్న ఉప్పు అమ్ముకునే వ్యక్తిని ఢీకొని రోడ్డుపై పడ్డారు. హేమంత్‌కుమార్, కనకదుర్గకు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉప్పు అమ్ముకునే సత్యనారాయణ అనే వ్యక్తి చర్చి వీధిలో నుంచి ఒక్క ఉదుటన రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. సత్యనారాయణ చేతికి బలమైన గాయాలయ్యాయి. తల్లీకొడుకుల మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్ప గించారు. చేబ్రోలు ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment